సీఎం సహా చాలామంది దైవ సాక్షిగా ప్రమాణం | Sakshi
Sakshi News home page

సీఎం సహా చాలామంది దైవ సాక్షిగా ప్రమాణం

Published Sun, Dec 10 2023 5:08 AM

101 out of 119 members of the Assembly took oath - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 119 మందిలో శనివారం ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌తో కలిసి 101 మంది ప్రమాణం చేశారు. వీరిలో 15 మంది ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులు లాస్య నందిత, పద్మావతి రెడ్డి, అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాల, బండారి లక్ష్మారెడ్డి, గడ్డం వినోద్, మధుసూదన్‌ రెడ్డి, కేపీ వివేకానంద, కాలేరు వెంకటేశ్, కొక్కిరాల ప్రేమ్‌ సాగర్‌ రావు, తోట లక్ష్మీకాంతారావు, కె. మదన్‌ మోహన్‌ రావు, ముఠా గోపాల్, మైనంపల్లి రోహిత్, తెల్లం వెంకట్రావ్, గడ్డం వివేక్‌ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎంఐఎం నుంచి గెలుపొందిన జాఫర్‌ హుస్సేన్, కౌసర్‌ మొయినుద్దీన్, జుల్ఫీకర్‌ అలీ, మహ్మద్‌ మాజీద్‌ హుస్సేన్, మహ్మద్‌ మోబిన్‌ ఉర్దూలో ప్రమాణం చేశారు. 

♦ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క సహా అధిక సంఖ్యలో సభ్యులు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. 

♦  మంత్రి సీతక్క, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు సహా పలువురు సభ్యులు పవిత్ర హృదయం సాక్షిగా ప్రమాణం చేశారు. వారిలో ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, అరికపూడి గాం«దీ, చిక్కుడు వంశీకృష్ణ, దొంతి మాధవరెడ్డి, గూడం మహిపాల్‌ రెడ్డి, కె. శంకరయ్య, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, మాగంటి గోపినాథ్, మక్కాన్‌సింగ్, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, వాకిటి శ్రీహరి, వేముల వీరేశం ఉన్నారు. 

‘‘దేశ సార్వభౌమాధికారాన్ని’’పలకడంలో ఇక్కడా ఇబ్బందే 
ప్రమాణ స్వీకారంలో భాగంగా ‘సభా నియమాలకు కట్టుబడి ఉంటానని’ చేసే ప్రతిజ్ఞ సందర్భంగా సభ్యులు చాలా మంది ‘సభా నియామకాలకు కట్టుబడిఉంటానని’ చదివారు. ‘భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని...’అనే వాక్యాన్ని పలుకడానికి సహజంగానే చాలా మంది సభ్యులు ఇబ్బంది పడ్డారు.  

బీఆర్‌ఎస్‌ సభ్యులకు సీఎం అభివాదం..
రాజగోపాల్‌రెడ్డికి ఆలింగనం  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉదయం 11.05 గంటలకు సభలోకి వచ్చిన వెంటనే డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సభ్యులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, సుధీర్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, లాస్య నందిత , కోవాలక్ష్మి తదితరుల వద్దకు వెళ్లి అభివాదం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వద్దకు వెళ్లి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఆలింగనం చేసుకున్నారు.అనంతరం ఎంఐఎం సభ్యులను ప్రత్యేకంగా వెళ్లి కలిశారు.  

♦  ప్రమాణ స్వీకారోత్సవం చూసేందుకు కుటుంబసభ్యులు కూడా సభకు వచ్చారు.
♦  అన్ని పార్టీల శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసినవెంటనే ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ వద్దకు వెళ్లి అభివాదం చేశారు. అనంతరం కాంగ్రెస్‌ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లి అభివాదం చేసి, ఫొటోలు దిగారు.  
♦  కొత్త ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నియమావళి, ఇతర మెటీరియల్‌తో కూడిన కిట్‌ను ప్రమాణం చేసిన ప్రతి ఎమ్మెల్యేకు అందజేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు కూడా తరలి వచ్చారు. 
♦  రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ సింగరేణి కార్మికుడి దుస్తుల్లో అసెంబ్లీకి వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శాసనసభలో మక్కాన్‌సింగ్‌నురేవంత్‌ ప్రత్యేకంగాఅభినందించడం కనిపించింది.  
♦ మంత్రి సీతక్క ప్రమాణం చేసిన తరువాత బీఆర్‌ఎస్‌ మహిళా సభ్యులు కోవాలక్ష్మి, లాస్య నందిత, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వద్దకు వెళ్లి కలిశారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి కలవడం కనిపించింది.  

Advertisement
Advertisement