ప్రపంచస్థాయిలో  గుర్తింపు పొందిన నిర్మల్‌ వాసి | Sakshi
Sakshi News home page

ప్రపంచస్థాయిలో  గుర్తింపు పొందిన నిర్మల్‌ వాసి

Published Mon, Jan 1 2024 2:02 AM

-

ఉపాధి నిమిత్తం ముంబైలో..
జిల్లాకేంద్రంలోని బంగల్‌పేట్‌ వాస్తవ్యుడైన బిట్లింగు రాజేంద్ర ఉపాధి నిమిత్తం ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నాడు. ఆరుపదుల వయసులో విభిన్న కళల్లో ఆరితేరి ఔరా..అనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఓ ప్రముఖ యాడ్‌ ఏజెన్సీలో పనిచేస్తుండగా, మరోవైపు బియ్యపు గింజలపై విభిన్న చిత్రాలు గీస్తున్నాడు.

కళలపై అభిరుచి..
రాజేంద్ర పదేళ్ల వయసులో చిత్రకళపై మక్కువ పెంచుకున్నాడు. టెన్త్‌ పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల కంటే కళలపై ఉన్న అభిరుచిని వృత్తిగా మలుచుకున్నాడు. కాలిగ్రఫీలో ముద్రణలాగా ఉండే వీరి చేతిరాత (దస్తూరి) చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. శిల్పకళలో జీవకళ ఉట్టిపడేలా దేవతామూర్తులు, దేశనాయకుల విగ్రహాలను తీర్చిదిద్దుతున్నారు. దుర్గాదేవి అమ్మవారు, బతుకమ్మ పండుగ చిత్రాలు, రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, ప్రకృతి రమణీయతను ప్రదర్శించే చిత్రాలు, దేశప్రముఖుల చిత్రపటాలు గీయడంలో ఈయనకు సాటి ఎవరూ లేరు.

భగవద్గీతతో అరుదైన గుర్తింపు!
భగవద్గీతను దాదాపు 8 మిల్లీమీటర్లు, 15 మిల్లీమీటర్ల పరిమాణంలో 4 సూక్ష్మ గ్రంథాల్లో భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలను సూక్ష్మీకరిస్తూ తీర్చిదిద్దాడు. సూక్ష్మగ్రంథాల్లో 18 అధ్యాయాలతోపాటు 701 శ్లోకాలు చేతిరాతతోనే గ్రంథస్తం చేశాడు. పది రోజుల్లోనే పూర్తిచేసి వారం క్రితమే హార్వర్డ్‌ వరల్డ్‌ రికార్డులో నమోదు కావడంతో అరుదైన గుర్తింపు పొందాడు. భగవద్గీత గ్రంథంలో ఒక్కొక్క చిత్రం ఒక్క మిల్లీమీటర్‌ పరిమాణంలో ఉండడం విశేషం.

ఇంత సూక్ష్మంగా అబ్బురపర్చే చిత్రాలు గీయడం, గ్రంథాలు, శిల్పాలు, ప్రతిమలను తీర్చిదిద్దడం, కాన్వాస్‌ పెయింటింగ్‌ చేయడం ఈయన ప్రత్యేకత. బియ్యపు గింజలపై లతామంగేష్కర్‌, కార్గిల్‌ విజయం, అబ్దుల్‌ కలాం, తిరుమల శ్రీవేంకటేశ్వరుడు వంటి ప్రతిమలను రూపొందించారు. దేవతామూర్తుల శిల్పాలు రూపుదిద్దడం, కాన్వాస్‌లపై అందమైన వేసిన ప్రకృతి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ప్రముఖుల నుంచి ప్రశంసలు, పురస్కారాలు సైతం అందుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement