Mann Ki Baat: ‘అంతరిక్షం’లో నూతన సూర్యోదయం | Sakshi
Sakshi News home page

Mann Ki Baat: ‘అంతరిక్షం’లో నూతన సూర్యోదయం

Published Mon, Nov 28 2022 5:17 AM

Mann Ki Baat: Launch of Vikram-S heralded new era for private space sector - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ‘విక్రమ్‌–ఎస్‌’ రాకెట్‌ ప్రయోగం మన దేశంలో ప్రైవేట్‌ అంతరిక్ష రంగంలో నూతన సూర్యోదయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ప్రయోగంతో దేశ అంతరిక్ష రంగంలో నూతన శకం మొదలైందన్నారు. ఆదివారం 95వ ‘మన్‌కీ బాత్‌’లో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జీ20కి సారథ్యం వహిస్తున్న దేశంగా ప్రపంచం ముందున్న సవాళ్లకు పరిష్కార మార్గాలు కనిపెట్టాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని చెప్పారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే...

‘స్పేస్‌’లో ప్రైవేట్‌ పాత్ర భేష్‌
స్పేస్‌ టెక్నాలజీలో ప్రైవేట్‌ రంగం పాత్ర ప్రశంసనీయం. స్పేస్‌ సెక్టార్‌లో నవంబర్‌ 18న ‘కొత్త చరిత్రకు’ ప్రజలంతా సాక్షిభూతంగా నిలిచారు. దేశీయంగా ప్రైవేట్‌ రంగంలో డిజైన్‌ చేసి, రూపొందించిన తొలి రాకెట్‌ ‘విక్రమ్‌–ఎస్‌’ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోయింది. ఈ రాకెట్‌ను తక్కువ ఖర్చుతో రూపొందించడం గొప్ప విషయం. స్పేస్‌ టెక్నాలజీలో భారత్‌ పరిమిత ఖర్చుతోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరుకుంది. విక్రమ్‌–ఎస్‌ రాకెట్‌లో కొన్ని కీలక భాగాలను 3డీ ప్రింటింగ్‌ ద్వారా తయారు చేశారు. ఈ రాకెట్‌ ప్రయోగం ప్రైవేట్‌ స్పేస్‌ సెక్టార్‌లో నూతన సూర్యోదయం. కాగితాలతో విమానాలు తయారు చేసి, గాల్లోకి ఎగురవేసిన మన పిల్లలు ఇప్పుడు అసలైన విమానాలు తయారు చేసే అవకాశం దక్కించుకుంటున్నారు. కాగితాలపై ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలను గీసిన మనవాళ్లు ఇప్పుడు రాకెట్లు తయారు చేస్తున్నారు. విక్రమ్‌–ఎస్‌ ప్రయోగం భారత్‌–భూటాన్‌ సంబంధాలకు బలమైన నిదర్శనం.

దేశమంతటా జీ20 కార్యక్రమాలు  
శక్తివంతమైన జీ20 కూటమికి భారత్‌ నాయకత్వం వహించనుండడం ప్రతి భారతీయుడికి గొప్ప అవకాశం. వసుధైక కుటుంబ భావనను ప్రతిబింబించేలా జీ20కి ‘ఒకే భూగోళం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే థీమ్‌ ఇచ్చాం. జీ20కి సంబంధించిన కార్యక్రమాలు దేశమంతటా నిర్వహిస్తాం. ఇందులో భాగంగా విదేశీయులు మన రాష్ట్రాలను సందర్శిస్తారు. మన విభిన్నమైన సంస్కృతి సంప్రదాయలను విదేశాలకు పరిచయం చేయొచ్చు. జీ20 కార్యక్రమాల్లో ప్రజలు.. ముఖ్యంగా యువత పాలుపంచుకోవాలి.

యువత పరుగును ఆపడం కష్టం   
మన యువత గొప్పగా ఆలోచిస్తున్నారు, గొప్ప ఘనతలు సాధిస్తున్నారు. అంతరిక్షం, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల విషయంలో సహచర యువతను కలుపుకొని ముందుకెళ్తున్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నారు. డ్రోన్ల తయారీలోనూ భారత్‌ వేగంగా పరుగులు తీస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇటీవలే యాపిల్‌ పండ్లను డ్రోన్ల ద్వారా రవాణా చేశారు. నూతన ఆవిష్కరణ ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేస్తుండడం సంతోషకరంమన యువత పరుగును ఆపడం ఇక కష్టం.

ప్రపంచం నలు మూలలకూ మన సంగీతం  
సంగీత రంగంలోనూ భారత్‌ గణనీయ ప్రగతి సాధిస్తోంది. ఎనిమిదేళ్లలో సంగీత పరికరాల ఎగుమతి మూడున్నర రెట్లు పెరిగింది. భారతీయ సంగీత ఖ్యాతి ప్రపంచ నలుమూలలకూ చేరుతోంది. తమ కళలు, సంస్కృతి, సంగీతాన్ని చక్కగా పరిరక్షించుకుంటున్న నాగా ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి’’ అని మోదీ సూచించారు. యూపీలోని బన్సా గ్రామంలో ‘కమ్యూనిటీ లైబ్రరీ, రిసోర్స్‌ సెంటర్‌’ను స్థాపించిన జతిన్‌ లలిత్‌ సింగ్, జార్ఖండ్‌లో ‘లైబ్రరీ మ్యాన్‌’గా గుర్తింపు పొందిన సంజయ్‌ కశ్యప్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement