Sakshi News home page

24 గంటల్లో 31 మంది మృతి.. ఆసుపత్రి డీన్‌పై కేసు నమోదు

Published Thu, Oct 5 2023 1:09 PM

Made To Clean Toilets Nanded Hospital Dean Now Faces Police Case - Sakshi

ముంబై: మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మరణాల ఘటన దేశవ్యాప్తంగాచర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నాందేడ్‌  శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 48 గంటల్లోనే 31 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దుమారం రేపింది. మృతుల్లో 18 మంది చిన్నారులు కూడా ఉండటంతో మరింత వివాదం రాజుకుంది.

తాజాగా ఈ వ్యవహారంలో ఆసుపత్రి డీన్‌పై పోలీసు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆసుపత్రి డీన్‌ డాక్టర్‌ ఎస్‌ వాకోడ్‌తోపాటు మరో వైద్యుడిపై నేరపూరితమైన హత్య కేసు నమోదైంది. మృతిచెందిన నవజాత శిశువు బంధువుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాందేడ్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు ఫైల్‌ అయ్యింది.

శిశువు మృతికి డీన్‌, చైల్డ్‌ స్పెషలిస్ట్‌ నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆసుపత్రిలో మందులు లేకపోవడంతో, బయట నుంచి కొనుక్కొచ్చినా.. డాక్టర్లు సకాలంలో వైద్యం అందించలేదని ఆరోపించారు. సాయం కోసం డీన్ కార్యాలయానికి వెళ్లినప్పుడు. వారిని దూరంగా వెళ్లగొట్టారని  ఫిర్యాదులో పేర్కొన్నారు. 
సంబంధిత వార్త: ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. 24 గంటల్లో 31 మంది మృతి

కాగా తనతో ఆసుపత్రి టాయిలెట్స్‌ శుభ్రం చేయించినందుకు శివసేన ఎంపీపై డీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఈ పరిణామం వెలుగుచూడటం గమనార్హం. నాందేడ్‌ శివసేన(షిండే వర్గం) ఎంపీ హేమంత్‌ పాటిల్‌ మంగళవారం శంకర్‌రావు చావన్‌ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితని సమీక్షించారు. అక్కడి టాయ్‌లెట్‌ అత్యంత అపరిశుభ్రంగా ఉండటం గమనించారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..ఆసుపత్రిలో మరుగుదొడ్ల దుస్థితిని చూసి బాధగా ఉందన్నారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఇక్కడ పరిస్థితిని చూసి బాధేస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వార్డుల్లోని టాయిలెట్స్‌కు తాళాలు వేసి ఉండటం, మరికొన్ని మురికిగా ఉండటంపై ఎంపీ హేమంత్‌ పాటిల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి డీన్‌ ఆర్‌ఎస్‌ వాకోడ్‌తో టాయిలెట్‌ క్లీన్‌ చేయించారు. ఎంపీ కూడా అక్కడే ఉండి నీళ్ళపైపుతో నీళ్లు వేశారు.
చదవండి: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌లో ట్రబుల్ షురూ: సుప్రియా సూలే

ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఎంపీ హేమంత్‌ పాటిల్‌పై ఆసుపత్రి డీన్‌ వాకోడ్‌ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారి విధులు అడ్డుకోవడం, పరువు తీయడం వంటి సెక్షన్ల కింద ఎంపీ హేమంత్‌ పాటిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఆసుపత్రిలో మరణాలపై విచారణ చేసేందుకు కమిటీని నియమించినట్లు వైద్య, విద్య పరిశోధన డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మైసెఖర్ స్పష్టం చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement