లిక్కర్‌ స్కాంలో ట్విస్ట్‌.. కవితను అరెస్ట్‌ చేసిన సీబీఐ | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ స్కాంలో ట్విస్ట్‌.. కవితను అరెస్ట్‌ చేసిన సీబీఐ

Published Thu, Apr 11 2024 2:02 PM

CBI Arrested BRS MLC Kavitha Over Delhi Liquor Scam Case - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తీహార్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఇప్పటి వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండగా తాజాగా సీబీఐ తమ అదుపులోకి తీసుకుంది. 

కాగా లిక్కర్‌ స్కాంకు సంబంధించి ఇటీవల తీహార్‌లో జైలులోనే కవితను సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. లిక్కర్‌ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి కవిత కుట్ర చేశారని సీబీఐ ఆరోపిస్తుంది. బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్‌పై సీబీఐ దృష్టి పెట్టింది.  వంద కోట్ల ముడుపుల చెల్లింపు తర్వాత కొనుగోలు చేసిన భూముల డాక్యుమెంట్‌లపై దర్యాప్తు చేస్తోంది. 

సౌత్ గ్రూపుకు ఆప్‌కు మధ్య కవిత దళారిగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో  కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగం మోపింది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఐపీసీ 120బి కింద కుట్ర కోణంలోనూ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే  కవితను అరెస్ట్‌ చేసినట్టు సీబీఐ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. కవితను జ్యుడీషియల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్‌ తరలించారు.  రేపు(శుక్రవారం) కోర్టు ముందు ప్రవేశపెట్టి తమ కస్టడీకి తీసుకోనున్నారు సీబీఐ అధికారులు. 

ఇక లిక్కర్‌ స్కాం కేసులో కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, కవిత రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈనెల 16వ తేదీన విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది. ఇక, లిక్కర్‌ స్కాం కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్‌ చేసింది. ప్రస్తుతం కవిత తీహార్‌ జైలులో ఈడీ కస్టడీలో ఉన్నారు. 
చదవండి: నన్ను బలి పశువును చేశారు.. కల్వకుంట్ల కవిత లేఖ

Advertisement
Advertisement