కవితకు వార్నింగ్‌ ఇచ్చిన జడ్జి.. కారణం ఇదే.. | Sakshi
Sakshi News home page

ఈనెల 23 వరకు ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

Published Mon, Apr 15 2024 10:19 AM

BRS MLC Kavitha Appear At Rouse Avenue Court Over Liquor Scam Case - Sakshi

సాక్షి, ఢిల్లీ: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. లిక్కర్‌ స్కాం కేసులో కవితకు ఈనెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీని విధించింది రౌస్‌ ఎవెన్యూ కోర్టు. దీంతో సీబీఐ అధికారులు ఆమెను తీహార్‌ జైలుకు తరలించారు. 

మూడు రోజుల కస్టడీ ముగియడంతో ఈరోజు ఉదయం కవితను సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టులో సీబీఐ న్యా­య­మూర్తి కావేరి బవేజా ముందు ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో సీబీఐ తన వాదనలు వినిపిస్తూ.. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించాం. ఆమె విచారణకు సహకరించలేదని వెల్లడించింది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది. అందుకోసం మరో 14 రోజులు కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరగా.. కోర్టు మాత్రం 9 రోజుల కస్టడీకి అనుమతించింది.  ఈ నేపథ్యంలో ఈనెల 23వ తేదీ వరకు కవితకు కోర్టు కస్టడీని పొడిగించింది. 

ఇదే సమయంలో కవితపై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటంపై సీరియస్‌ అయ్యారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తపరిచారు. ఇంకోసారి ఇలా మాట్లాడవద్దు అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. 

అనంతరం, కవిత బయటకు వస్తూ సీబీఐపై ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కవిత.. ‘‘ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ. రెండు నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారు. బయట బీజేపీ అడిగిందే.. లోపల సీబీఐ అడుగుతోంది. ఇందులో కొత్తది ఏమీ లేదు’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. మార్చి 15వ తేదీన ఈడీ లిక్కర్‌ స్కాం కేసులో కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసింది. 

ఈడీ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవితను సీబీఐ అధికారులు మూడు రోజుల పాటు విచారించారు. లిక్కర్‌ స్కాంలో నిందితులు, అ‍ప్రూవర్లుగా మారిన వారు వచ్చిన వాంగ్మూలం, వాట్సాప్‌ చాట్స్‌పై సీబీఐ కవితను ప్రశ్నించింది. ఈ సందర్బంగా కవిత విచారణను సీబీఐ వీడియో రికార్డు చేసింది. 

మరోవైపు.. ఆమె భర్త అనిల్, సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది మోహిత్‌రావులు నిన్న(ఆదివారం) కవితతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలు చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేయగా, ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిల్‌ నిరాకరించింది. ఇక, రెగ్యులర్‌ బెయిల్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement