Sakshi News home page

Delhi Airport Tragedy Averted: ఒకే రన్‌వేలో రెండు విమానాలు.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన ఘోరప్రమాదం

Published Wed, Aug 23 2023 3:48 PM

2 Planes Same Runway Woman Pilot Alert Prevents Delhi Airport Tragedy - Sakshi

ఢిల్లీ: బుధవారం మధ్యాహ్నాం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘోరప్రమాదం తప్పింది. విస్తారా ఎయిర్‌లైన్స్‌కే చెందిన రెండు విమానాలు ఒకే రన్‌వేలో ఎదురెదురుగా వచ్చాయి.  కాస్తుంటే అవి రెండూ ఢీ కొట్టుకుని పెను విషాదం చోటు చేసుకునేది. అయితే ఓ విమానంలోని మహిళా పైలట్‌ అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. 

అహ్మదాబాద్‌ నుంచి ఢిల్లీకి చేరిన విస్తారా విమానం.. బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ పర్యవేక్షణలో పార్కింగ్‌ బే వైపు చేరుకునేందుకు సిద్ధమైంది. సరిగ్గా అదే  సమయంలో ఢిల్లీ-బాగ్డోగ్రా(పశ్చిమ బెంగాల్‌) విస్తారా విమానానికి అదే రన్‌వే నుంచి టేకాఫ్‌కు అనుమతిచ్చారు. అయితే రెండు విమానాలు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉండగా.. అహ్మదాబాద్‌-ఢిల్లీ ఫ్లైట్‌లో ఉన్న కెప్టెన్‌ సోనూ గిల్‌(45) జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టారు.

వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థను అప్రమత్తం చేశారు. దీంతో.. ఘోర ప్రమాదం తప్పింది. ఆ వెంటనే టేకాఫ్‌ రద్దు చేసి.. ఢిల్లీ-బాగ్డోగ్రా విమానాన్ని తిరిగి పార్కింగ్‌ వైపు మళ్లించారు. రెండు విమానాల్లో కలిపి 300 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు.. అది ఈ మధ్యే ప్రారంభమైన రన్‌వే.

ఒకవేళ ఆమె(సోనూ గిల్‌) గనుక అప్రమత్తం చేయకుండా ఉండి ఉంటే ఘోర ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు అంటున్నారు. ఏటీసీ అధికారి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని డీజీసీఏ(పౌర విమానయాన శాఖ)  ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు సంబంధిత అధికారిని విధుల నుంచి తప్పించినట్లు ప్రకటించింది. 

Advertisement

What’s your opinion

Advertisement