Sakshi News home page

అప్పుడెట్లనో.. ఇప్పుడట్లనే ఉండాలే..!

Published Sat, Oct 14 2023 1:34 AM

- - Sakshi

మంచిర్యాల: ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీల నాయకులు మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. దీంతో మద్యం పంపిణీని కట్టడి చేసేందుకు ఎక్సైజ్‌ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా పెంచారు. 2018 ఎన్నికల సమయంలో ప్రధానంగా అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో మద్యం అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పడు కూడా అలాగే ఉండాలని వైన్స్‌ యజమానులకు ఎక్సైజ్‌ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

మద్యం ఏరులై పారకుండా ఐఎంఎల్‌ డిపో నుంచి భారీ మద్యం కొనుగోలు చేయడానికి వీలు లేకుండా కట్టడి చేశారు. జిల్లాలోని హాజీపూర్‌ మండలం గుడిపేట లిక్కర్‌ డిపో పరిధిలో 208 మద్యం దుకాణాలు, దాదాపు 45 వరకు బార్లు ఉన్నాయి. ఇప్పటికే వీటిపై నిఘా పెంచారు. పరిమితికి మించి మద్యం నిల్వలు ఉంచినా, మద్యం తరలింపు చేపట్టినా ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖలు పట్టుకుని సీజ్‌ చేయడంతోపాటు కేసులు నమోదు చేయనున్నారు. ఒక వ్యక్తికి పరిమితికి మించి మద్యం విక్రయించినా ఆ వైన్‌ దుకాణాలను సీజ్‌ చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

 నిరంతరం నిఘా..
ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన వెంటనే మద్యం అమ్మకాలపై నిరంతరం నిఘా పెట్టాం. మద్యం అమ్మకాలు గతంలోని అమ్మకాలను పోల్చి చూస్తూ మద్యం విక్రయాలపై దృష్టి సారించాం. మద్యం నియంత్రణ చేపడుతూ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా చర్యలు చేపడుతున్నాం.

మద్యం దుకాణా దారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. అక్రమ మద్యం రవాణా కట్టడికి రెండు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. అక్రమ మద్యం నిల్వలు, సరఫరా అరికట్టేలా మూడు తనిఖీ బృందాలు ప్రత్యేకంగా గస్తీ చేపడుతున్నాయి. – నరేందర్‌, సీఐ, ఎక్సైజ్‌ శాఖ, మంచిర్యాల

Advertisement

What’s your opinion

Advertisement