చైనాలో 24 కోట్ల ఏళ్ల డ్రాగన్‌ శిలాజం | Scientists Unveil 240-million-year-old Chinese Dragon Fossil, Pic Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Dragon Fossil In China: చైనాలో 24 కోట్ల ఏళ్ల డ్రాగన్‌ శిలాజం

Published Mon, Feb 26 2024 5:38 AM

Scientists unveil 240-million-year-old dragon fossil - Sakshi

ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో శిలాజాలు బయటపడుతుంటాయి. వందల సంవత్సరాల క్రితం భూమిలో కూరుకుపోయిన జీవులు క్రమంగా శిలాజంగా మారుతుంటాయి. అయితే, చైనాలో 2003లో బయటపడిన భారీ డ్రాగన్‌ శిలాజం వయసు 24 కోట్ల సంవత్సరాలు ఉంటుందని సైంటిస్టులు తాజాగా నిర్ధారించారు. ఇంత వయసున్న డ్రాగన్‌ శిలాజం వెలుగుచూడడం ఇదే మొదటిసారి అని నేషనల్‌ మ్యూజియమ్స్‌ స్కాట్లాండ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

చైనాలో ట్రియాసిక్‌ కాలానికి చెందిన ఈ శిలాజం భాగాలను తొలుత 2003లో దక్షిణ చైనాలోని గిజౌ ప్రావిన్స్‌లో గుర్తించారు. గత పదేళ్లలో తవ్వకాల్లో మరిన్ని భాగాలు బయటపడ్డాయి. వాటన్నింటినీ ఒకేచోట అమర్చగా అది ఐదు మీటర్ల డ్రాగన్‌గా తేలింది. 24 కోట్ల ఏళ్ల క్రితమే అది శిలాజంగా మారిపోయిందని పరిశోధకులు కనిపెట్టారు. దీనికి డైనోసెఫాలోసారస్‌ ఒరియంటలిస్‌ అని పేరుపెట్టారు. ముక్కు నుంచి తోక దాకా పూర్తి శిలాజాన్ని ఆవిష్కరించామని ఎన్‌ఎంఎస్‌ సైంటిస్టు డాక్టర్‌ నిక్‌ ఫ్రాసెర్‌ చెప్పారు.

ఇది 8 అంకె ఆకారంలో ఉందని, చైనా డ్రాగన్లను గుర్తుకు తెస్తోందని వివరించారు. డ్రాగన్‌ కాల్పనిక జీవి కాదని, నిజంగానే ఉండేదని చెప్పడానికి ఈ శిలాజం ఒక ఆధారమని సైంటిస్టులు అంటున్నారు. రాక్షస బల్లుల తరహాలో వాతావరణ మార్పుల కారణంగా కోట్ల సంవత్సరాల క్రితం అవి అంతరించిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, చైనాలో బయటపడిన డ్రాగన్‌ శిలాజం మెడ చాలా పొడవుగా ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. నదులు, చెరువుల్లో చేపలు పట్టుకోవడానికి వీలుగా దాని మెడ పొడవుగా సాగి ఉండొచ్చని భావిస్తున్నారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement
Advertisement