2023 పాఠాలు... 2024 ఆశలు | Sakshi
Sakshi News home page

2023 పాఠాలు... 2024 ఆశలు

Published Thu, Dec 28 2023 12:04 AM

Sakshi Guest Column On 2023 Year End Round Up

2023 సంవత్సరం ముగింపునకు వచ్చేసింది. ఒకపక్క కృత్రిమ మేధ, మరోపక్క రాజకీయ పరివర్తన జోరుగా సాగుతున్న ఈ ఏడాది మనకు మిగిల్చిన జ్ఞాపకాలేమిటి? ప్రపంచం పట్టు తప్పిపోతోందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. జీపీటీ–4 రావడం ఈ ఏడాది అత్యంత కీలకమైన పరిణామం.ఇక నుంచి కృత్రిమ మేధే భౌగోళిక రాజకీయాల్లో ఒక పాత్రధారి కానుంది. ఉక్రెయిన్, గాజా యుద్ధాల నేపథ్యంలో 2024ను ఊహించుకుంటే, ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్న ప్రత్యేక పరిస్థితులు మరిన్ని యుద్ధాలకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. అయితే, వాతావరణ మార్పుల ముప్పును తట్టుకునేందుకు శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లాలని ‘కాప్‌’ సమావేశాల్లో అంగీకారం కుదరడం శుభపరిణామం.

చాలా దేశాల పౌరులు హ్రస్వదృష్టితో కూడిన జాతీయవాదానికీ, తాత్కాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేసే నేతలకూ పగ్గాలు అప్పగించారు. కోవిడ్‌–19 పరిస్థితులు ప్రచండంగా ఉన్న సమయంలో టీకాల పేరుతో జాతీయ వాదం ప్రబలింది. ఇదెంత సంకుచితమైనదో ఆ తరువాత కానీ అర్థం కాలేదు. ఇది సాటి మానవుడి బాధను కూడా మరచిపోయేలా
చేసింది. గాజాపై ఇజ్రాయెల్‌ దళాలు విరుచుకుపడుతున్నా ఎవరికీ పట్టకపోవడం కూడా దీనికి మరో నిదర్శనం. అదుపులేని హింసకు కొత్త, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలూ ఆజ్యం పోస్తున్నాయి. వేగంగా వృద్ధి చెందు తున్న ఈ టెక్నాలజీలు మానవాళి నిశ్చేష్టతకూ దారితీస్తున్నాయనడంలో సందేహం లేదు.

కల్పనకూ, వాస్తవానికీ తేడాలు చెరిగి...
ఈ ఏడాది మార్చిలో ఓపెన్ ఏఐ జీపీటీ–4ను విడుదల చేసింది. ఇది కాస్తా రక్తమాంసాలతో కూడిన వాస్తవానికీ, కల్పనకూ మధ్య ఉన్న అంతరాన్ని చెరిపివేస్తోంది. ఈ డిజిటల్‌ వాస్తవాన్ని మన అనలాగ్‌ బుర్రలు ఎలా అర్థం చేసుకోగలవు? 2023 మొత్తమ్మీద అత్యంత కీలకమైన పరిణామం ఇదే అనడం అతిశయోక్తి కాబోదు. 2024లోనే కాదు... ఆ తరువాతి కాలంలోనూ మన జీవితాలను మార్చేసే పరిణామం. జీపీటీ–4 లాంటివి మన జియోపాలిటిక్స్‌ను కూడా ప్రభావితం చేస్తాయి. ‘‘టెక్నాలజీ అనేది భౌగోళిక రాజకీ యాలపై ప్రభావం చూపడం కొత్త కాకపోయినా, కృత్రిమ మేధ రంగ ప్రవేశంతో పరిస్థితి సమూలంగా మారనుంది. కృత్రిమ మేధే భౌగోళిక రాజకీయాల్లో ఒక పాత్రధారి కానుంది’’ అని ఓ విశ్లేషకుడు ఇటీవలే వ్యాఖ్యానించారు. 

ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లలో ప్రస్తుతం కృత్రిమ మేధే అతిపెద్దది. దీని నియంత్రణ కేవలం కొంతమంది చేతుల్లోనే ఉంది. ఈ టెక్నాలజీ కొన్ని బహుళజాతి కంపెనీల చేతుల్లో అభివృద్ధి చెందింది. ప్రభుత్వాలకు వీటిపై అవగాహన లేదు. నియంత్రించే శక్తీ లేదు. నియంత్రించాలన్నా ప్రభుత్వాలు ఈ కంపెనీలపైనే ఆధార పడాల్సి ఉంటుంది. చైనా లాంటి దేశాలు చాలాకాలంగా సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపై గట్టి నియంత్రణ పాటిస్తూ వచ్చిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. బహుశా చైనా ఈ కృత్రిమ మేధను ఇతరుల కంటే మెరుగ్గా నియంత్రించగలదేమో. కానీ అక్కడి ప్రభుత్వం కృత్రిమ మేధను కూడా తమ పార్టీ లక్ష్యాల సాధనకు పావుగా వాడు కున్నా ఆశ్చర్యం లేదు. అలాంటిది ఏదైనా జరిగితే అది ప్రపంచంలో అధికార అసమతౌల్యానికి దారితీయవచ్చు. 

ద్వైదీ భావ పరాకాష్ఠలో ప్రపంచం...
మానవాళి సంక్షేమానికి అడ్డుగా నిలుస్తున్న సవాళ్లు అంతర్జాతీయ స్థాయికి చేరుతున్న తరుణంలో మన ఆలోచనా ధోరణులు మాత్రం అంతకంతకూ కుంచించుకుపోతున్నాయి. దేశాలకు, ప్రాంతాలకు పరి మితమైపోతున్నాయి. ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో బహుముఖీన అంతర్జాతీయ సహకారం, సమష్టి బాధ్యతల పంపిణీతోనే మనం ప్రస్తుత సమస్యలను ఎదుర్కోగలం. సమ న్యాయం పాటించగలం. ప్రస్తుతం ప్రభుత్వాతీత శక్తులన్నింటికీ శక్తి మంతమైన హింసాత్మక ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్‌దాడి దీనికో తార్కాణం. బలహీనులు, నిర్వా సితులు కూడా బలంగా దెబ్బకొట్టగలరు అనేందుకు ఇజ్రాయెల్‌పై దాడి ఒక రుజువు. 

ఉగ్రవాదంపై పోరు ఇప్పుడిప్పుడే అంతమయ్యేది కాదని 2023 మరోసారి నిరూపించింది. ఈ పోరు ఏకరీతిన లేదు. పైగా సాంకేతిక పరిజ్ఞానం ప్రభుత్వాలకు మరింత బలం చేకూరుస్తోంది. రాజ్యాంగాలను పక్కనబెట్టిన అన్ని దేశాలూ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే, తిరుగుబాట్లను సమర్థంగా అణచివేసిన సంఘటనలు చరిత్ర మొత్తం వెతికినా కనిపించవూ అని! చిన్న రాపిడి మళ్లీ నిప్పు పుట్టించడం ఖాయం. ఫలితం తీవ్ర నష్టం, హింస. రాజకీయం ద్వారా హింసను చట్టబద్ధం చేయడం ఎంతమాత్రం తగని పని.

అమాయ కులు, మహిళలు, పిల్లలను చంపివేయడాన్ని కూడా సమర్థించే లక్ష్యం ఎంతటి ఉదాత్తమైనదైనా సమర్థనీయం కాదన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. హింసను ఆయుధంగా వాడుకోవడం ఎప్పుడూ పులి మీద స్వారీ లాంటిదే. హింస మొదలైతే అది కేవలం తాము ఉద్దేశించిన లక్ష్యాలకే పరిమితమవుతుందని అనుకోలేము. హింస అటు ఆక్రమణదారులనూ, ఇటు బాధితులనూ రాక్షసుల్లా మార్చేస్తుంది. ఈ సత్యాన్ని చాలాకాలం క్రితమే మహాత్మగాంధీ బాగా అర్థం చేసు కున్నారు. ‘అహింస’ భావన ఈ ప్రగాఢమైన అవగాహన నుంచి పుట్టిందే. గాంధీ మాటలను మనం ఎంత విస్మరిస్తామో ప్రపంచంలో అంతేస్థాయిలో ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉంది. 

ఒక్క సానుకూల పవనం...
ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో చూసిన ఒక సానుకూల అంశం ఏదైనా ఉందీ అంటే అది దుబాయిలో ఇటీవలే ముగిసిన కాప్‌ సమావేశాలని చెప్పాలి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునేందుకు మానవాళి జరుపుతున్న కృషిలో భాగంగా జరిగిన ఈ సమావేశాల్లో కొన్ని ఆశాజనకమైన ఒప్పందాలు, నిర్ణయాలు జరిగాయి. వీటిని సక్రమంగా అమలు చేయగలి గితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సామాజిక సుస్థిరత దిశగా మళ్లే అవకాశాలు పెరుగుతాయి.

వాతావరణ మార్పుల ముప్పును తట్టుకునేందుకు శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లాలని అందరూ అంగీకరించడం శుభపరిణామం. కృత్రిమ మేధతోపాటు వినూత్నమైన టెక్నా లజీలను అందిపుచ్చుకునేందుకు ఇదో చక్కటి అవకాశం. 2023లో వాతావరణ మార్పుల విషయంలో జరిగిన ఒప్పందాలు, కల్పించిన ఆశ వచ్చే ఏడాదిలో సఫలీకృతమవుతాయని ఆశిద్దాం.

దీన్ని పక్కనపెడితే... ప్రపంచం వచ్చే ఏడాది కూడా కొంత అసందిగ్ధ్దతను ఎదుర్కొంటుందనేందుకు కొన్ని నిదర్శనాలు కనిపి స్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగేది 2024లోనే. ప్రస్తుతానికి డోనాల్డ్‌ ట్రంప్‌ పోటీ చేసే అవకాశాలు తగ్గాయి. అడ్డంకులు తొలిగి ట్రంప్‌ పోటీ చేసి గెలిస్తే మాత్రం అగ్రరాజ్యంలో సరికొత్త స్థానిక వాదం తలెత్తే ప్రమాదం ఉంది. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్‌ యుద్ధంతోపాటు రష్యా ఉక్రెయిన్  జగడమూ వచ్చే ఏడాది మరింత ముదిరే అవకాశాలున్నాయి. ఉక్రెయిన్‌కు మద్దతిచ్చే విషయంలో అమెరికా కొంత అసందిగ్ధతతో వ్యవహరిస్తూండటాన్ని పుతిన్ గుర్తించక మానడు. తన దాడులను ఉధృతం చేయకుండా ఉండడు.

అమెరికా ఏకకాలంలో రెండు యుద్ధాలను పర్యవేక్షిస్తూండటం, ఆ దేశంతో మనకున్న సంబంధాలపై కూడా ప్రభావం చూపనుంది. పైగా చైనాతో తనకున్న శత్రుత్వాన్ని కొంత తగ్గిగంచుకునే ప్రయ త్నాలు చేయవచ్చు. ఇప్పటికే దీనికి కొన్ని రుజువులు కనిపిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కారాదని బైడెన్  నిర్ణయించుకోవడం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే క్వాడ్‌ సమావేశాల వాయిదాను కూడా ఈ దృష్టితోనే చూడాల్సి ఉంటుంది.

కెనెడా ఉగ్రవాది పన్నూ విషయంలో వచ్చిన అభిప్రాయబేధాలూ ఈ ధోరణికి కారణం కావచ్చు. సెప్టెంబరులో విజయవంతంగా నిర్వహించిన జీ20 సమావేశాల ప్రాభవం కాస్తా ఈ పరిణామాలతో తగ్గి పోయింది. మరోవైపు దేశంలోనూ సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. నరేంద్ర మోదీకి మరోసారి ప్రధాని పదవి దక్కే అవకాశం ఉంది. ఈ రాజకీయ సుస్థిరత 2024లో అంతర్జాతీయ స్థాయిలో మనకు మేలు చేస్తుందని ఆశిద్దాం.
శ్యామ్‌ శరణ్‌ 
వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి
(‘ద బిజినెస్‌ స్టాండర్డ్‌’ సౌజన్యంతో)

Advertisement

తప్పక చదవండి

Advertisement