స్పూర్తిదాయకమైన కథ.. 'బాతు–కొంగ యుద్ధం!' | Sakshi
Sakshi News home page

స్పూర్తిదాయకమైన కథ.. 'బాతు–కొంగ యుద్ధం!'

Published Sun, Mar 24 2024 9:16 AM

A Story In The Form Of Vishwamitra And Harishchandra Written By Sankhyayana - Sakshi

విశ్వామిత్రుడి కారణంగా హరిశ్చంద్రుడు రాజ్యభ్రష్టుడై అష్టకష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు పడినా సత్యసంధతను వదులుకోని హరిశ్చంద్రుడిని చూసి దేవతలు నివ్వెరపోయారు. ఆయనను స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. ధర్మప్రభువైన హరిశ్చంద్రుడు దేవతల కోరికను వెంటనే మన్నించలేదు. తనతో పాటు తన అయోధ్యానగర పౌరులందరికీ స్వర్గవాసం కల్పిస్తేనే వస్తానన్నాడు. హరిశ్చంద్రుడి కోరికను దేవేంద్రుడు మన్నించాడు. వేలాది విమానాలను రప్పించి, హరిశ్చంద్రుడితో పాటు అయోధ్య వాసులందరినీ స్వర్గానికి తరలించుకుపోయాడు. హరిశ్చంద్రుడి స్వర్గారోహణం చూసి దైత్యగురువు శుక్రాచార్యుడు చకితుడయ్యాడు. ‘హరిశ్చంద్రుడిలాంటి ప్రభువు ముల్లోకాల్లోనూ మరొకరు లేరు. తన త్యాగంతో, దానంతో మహాపుణ్యాన్ని ఆర్జించి, తన పౌరులను కూడా స్వర్గానికి తీసుకుపోయాడంటే అతడిది ఎంతటి త్యాగనిరతి! హరిశ్చంద్రుడి వంటి రాజు ఇంకెవడుంటాడు?’ అని శ్లాఘించాడు.

హరిశ్చంద్రుడు స్వర్గానికి వెళ్లిన తర్వాత, అప్పటికి పన్నెండేళ్లుగా గంగా నదిలో మెడలోతు వరకు నీళ్లలో నిలబడి తపస్సు చేసుకుంటూ ఉన్న వశిష్ఠుడు తన తపస్సును చాలించి బయటకు వచ్చాడు. వశిష్ఠుడు హరిశ్చంద్రుడికి కులగురువు. తన శిష్యుడైన హరిశ్చంద్రుడి యోగక్షేమాలు తెలుసుకోవడానికి నేరుగా అయోధ్యకు వెళ్లాడు. అక్కడి జనాల ద్వారా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని పెట్టిన బాధలను తెలుసుకుని, అమిత ఆగ్రహం చెందాడు.

‘ఈ విశ్వామిత్రుడు ఎంతటి దుర్మార్గుడు! పూర్వం నా వందమంది కొడుకులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. అప్పుడు కూడా అంత కోపం రాలేదు. సత్యధర్మ నిబద్ధుడైన హరిశ్చంద్రుడిని రాజ్యభ్రష్టుడిని చేసినందుకు మాత్రం నాకు పట్టరాని కోపం వస్తోంది’ అనుకున్నాడు వశిష్ఠుడు. ఎంత నియంత్రించుకోవాలనుకున్నా కోపం తగ్గకపోవడంతో వశిష్ఠుడు ‘దుర్మార్గుడు, బ్రహ్మద్వేషి, క్రూరుడు, మూర్ఖుడు, యజ్ఞవినాశకుడు అయిన విశ్వామిత్రుడు కొంగ రూపాన్ని పొందుగాక’ అని శపించాడు.

వశిష్ఠుడి శాపాన్ని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘నన్ను శపించ సాహసించిన వశిష్ఠుడు బాతు రూపం పొందుగాక’ అని ప్రతిశాపం ఇచ్చాడు. పరస్పర శాపాల కారణంగా విశ్వామిత్రుడు కొంగగా, వశిష్ఠుడు బాతుగా మారిపోయారు. వారి రూపాలు సామాన్యమైన కొంగ, బాతుల మాదిరిగా లేవు. కొంగ మూడువేల యోజనాల పొడవు ఉంటే, బాతు రెండు వేల యోజనాల పొడవు ఉంది.

భీకరమైన కొంగ, బాతు రూపాలు పొందిన విశ్వామిత్ర, వశిష్ఠులు పరస్పరం తారసపడ్డారు. పూర్వవైరం ఇంకా చల్లారని వారిద్దరూ యుద్ధానికి తలపడ్డారు. బాతు, కొంగల రూపాల్లో వారు హోరాహోరీగా పోరు సాగిస్తుంటే, వారి ధాటికి మహావృక్షాలు నేలకూలాయి. పర్వతాల నుంచి గిరిశిఖరాలు నేల మీదకు దొర్లిపడ్డాయి. భూమి కంపించింది. సముద్రాలు అల్లకల్లోలంగా మారి హోరెత్తాయి. భీకరమైన బాతు, కొంగల కాళ్ల కిందపడి ఎన్నో జీవులు మరణించాయి. ఇన్ని ఉత్పాతాలు జరుగుతున్నా అవేమీ పట్టకుండా బాతు కొంగల రూపాల్లో వశిష్ఠ విశ్వామిత్రులు హోరాహోరీగా రోజుల తరబడి పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి యుద్ధానికి దేవతలు కూడా భీతిల్లారు. అందరూ బ్రహ్మదేవుడి వద్దకు పరుగులు తీశారు.

‘ఓ విధాతా! వశిష్ఠ విశ్వామిత్రులు పరస్పర శాపాలతో బాతు కొంగ రూపాలు పొంది భూమ్మీద పోరు సాగిస్తున్నారు. వారి యుద్ధంలో ఇప్పటికే ఎన్నో జీవులు మరణించాయి. ప్రకృతి అల్లకల్లోలంగా ఉంది. వారి యుద్ధాన్ని నివారించకుంటే, భూమ్మీద ప్రళయం వచ్చేలా ఉంది. వారి పోరును నువ్వే అరికట్టాలి. భూలోకానికి పెను విపత్తును తప్పించాలి’ అని ప్రార్థించారు.

బ్రహ్మదేవుడు దేవతలందరితోనూ కలసి భూమ్మీద పోరు జరుగుతున్న చోటుకు హుటాహుటిన వచ్చాడు. ‘వశిష్ఠ విశ్వామిత్రులారా! ఏమిటీ మూర్ఖత్వం? తక్షణమే యుద్ధాన్ని ఆపండి’ ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. బాతు కొంగ రూపాల్లో ఉన్న వారిద్దరూ బ్రహ్మదేవుడి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా, మరింత ఘోరంగా యుద్ధం చేయసాగారు. ‘ఇప్పటికే మీ వల్ల ఎంతో అనవసర ప్రాణనష్టం జరిగింది. బుద్ధి తెచ్చుకుని యుద్ధాన్ని మానుకోండి’ మరోసారి హెచ్చరించాడు బ్రహ్మదేవుడు.

వశిష్ఠ విశ్వామిత్రులు అప్పటికీ అతడి మాటలను పట్టించుకోకుండా యుద్ధాన్ని కొనసాగించారు. చివరకు బ్రహ్మదేవుడు తన శక్తితో వారిద్దరి తామస గుణాన్ని హరించాడు.
వశిష్ఠ విశ్వామిత్రులు పూర్వరూపాల్లోకి వచ్చారు. బ్రహ్మదేవుడి వద్ద చేతులు జోడించి నిలుచున్నారు.

‘వశిష్ఠా! విశ్వామిత్రుడి తప్పేమీ లేదు. హరిశ్చంద్రుడి ధర్మనిరతిని లోకానికి చాటడానికే అతణ్ణి పరీక్షలకు గురిచేసి, స్వర్గానికి పంపించాడు. నువ్వు అదేదీ గ్రహించకుండా అతణ్ణి శపించావు. ఈ విశ్వామిత్రుడు కూడా కోపాన్ని అణచుకోలేక నిన్ను శపించాడు. మీ వల్ల ఎంతో అనర్థం జరిగింది. ఇకనైనా తామస గుణాన్ని విడనాడి, శాంతం వహించండి. మీ వంటి మహర్షులకు తామసం తగదు’ అని బ్రహ్మదేవుడు హితవు పలికాడు. బ్రహ్మదేవుడి మాటలకు వశిష్ఠ విశ్వామిత్రులిద్దరూ సిగ్గుపడ్డారు. పరస్పరం క్షమాపణలు చెప్పుకుని, ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఈ దృశ్యం చూసి దేవతలంతా సంతోషించారు. బ్రహ్మదేవుడితో కలసి అక్కడి నుంచి సంతృప్తిగా నిష్క్రమించారు.  సాంఖ్యాయన

ఇవి చదవండి: నా స్టూడెంట్‌ టీచర్‌ అయింది!

Advertisement
 
Advertisement
 
Advertisement