స్మార్ట్‌ సీతాకోక చిలుకలు | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ సీతాకోక చిలుకలు

Published Tue, Dec 12 2023 9:53 AM

Butterflies Are Now Smart Butterflies - Sakshi

రంగు రంగుల సీతాకోక చిలుకలు ఎగురుతున్న దృశ్యం పిల్లలకే కాదు, పెద్దలకూ సంబరంగానే ఉంటుంది. అలాగని సీతాకోక చిలుకలు ఎప్పుడంటే అప్పుడు కనిపించవు. కాంక్రీట్‌ కీకారణ్యాల్లాంటి నగరాల్లోనైతే, సీతాకోక చిలుకలు కనిపించడం మరీ అరుదు. మరి పిల్లలకు సీతాకోక చిలుకల సరదా తీరేదెలా? అందుకే, అమెరికన్‌ టాయ్‌ కంపెనీ ‘జింగ్‌’ ఎప్పుడంటే అప్పుడు ఎగరవేయగలిగే సీతాకోక చిలుకలను ‘గో గో బర్డ్‌’ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది.

రంగు రంగులతో అచ్చం అసలు సిసలు సీతాకోక చిలుకల్లా కనిపించే ఈ బొమ్మ సీతాకోక చిలుకలను రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో కోరుకున్నప్పుడల్లా ఇంచక్కా ఎగరేయవచ్చు. డ్రోన్‌ మాదిరిగా ఎగిరే ఈ సీతాకోక చిలుకలను రాత్రిపూట చీకటిపడిన తర్వాత కూడా ఎగురవేయవచ్చు. వీటిలోని ఎల్‌ఈడీ లైట్లు రంగు రంగుల్లో వెలుగుతూ చీకట్లో మిరుమిట్లు గొలుపుతాయి. ఇవి రీచార్జబుల్‌ బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి. ఈ ‘గో గో బర్డ్‌’ సీతాకోక చిలుక ధర 12.99 డాలర్లు (రూ. 1,083) మాత్రమే!

స్మార్ట్‌ ఉకులెలె..  మ్యూజిక్‌ మేడీజీ!
గిటార్‌లా కనిపించే ఈ బుల్లి వాద్యపరికరం ఉకులెలె. ఈ పోర్చుగీసు సంప్రదాయ పరికరాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్‌గా తయారు చేసిన చైనీస్‌ కంపెనీ జియోమీ ఇటీవల ‘పాపులెలె 2 ప్రో స్మార్ట్‌’ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చింది. సంగీతంలో కొత్తగా సరిగమలు నేర్చుకుంటున్న వారు సైతం దీనిపై తేలికగా కోరుకున్న పాటలు పలికించేలా దీన్ని తీర్చిదిద్దడం విశేషం.

స్మార్ట్‌ఫోన్‌ లేదా లాప్‌టాప్‌ ద్వారా కోరుకున్న పాటను ఎంపిక చేసుకుని, యాప్‌ ద్వారా దీనిని అనుసంధానం చేసుకుంటే చాలు. ఈ ఉకులెలె ఫింగర్‌ బోర్డులో పాటలోని సంగీతానికి తగిన స్వరస్థానాలలో ఎల్‌ఈడీ లైట్లు వెలుగుతాయి. ఎల్‌ఈడీ లైట్ల వెలుగు ఆధారంగా వేళ్లను కదుపుతూ దీనిని వాయిస్తే, ఎలాంటి పాటైనా భేషుగ్గా పలుకుతుంది.

దీనిని వాయించడంలో మొదట్లో కొద్దిగా తడబడినా, సంగీతం రానివారు సైతం దీనికి పదిహేను నిమిషాల్లోనే అలవాటు పడిపోతారని, తేలికగా పాటలు వాయించగలుగుతారని జియోమీ కంపెనీ చెబుతోంది. సంప్రదాయ ఉకులెలెను కలపతో తయారు చేస్తారు. ఈ స్మార్ట్‌ ఉకులెలెను సింథటిక్‌ ఫైబర్‌తో కొద్దిపాటి డిజైన్‌ మార్పులతో తయారు చేశారు. దీని ధర 279 డాలర్లు (రూ.23,264) మాత్రమే!

చార్జర్‌ కమ్‌ రేడియో
ఇది చార్జర్‌ కమ్‌ రేడియో. మామూలు చార్జర్లలా దీనికి బయటి విద్యుత్తుతో పనిలేదు. ఇది తనంతట తానే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. కావలసినప్పుడు ఆన్‌ చేసుకుంటే, ఇంచక్కా రేడియోను వినిపిస్తుంది. దీనొకక ఎల్‌ఈడీ లైట్‌ కూడా ఉంటుంది. ఈ చార్జర్‌ కమ్‌ రేడియో పనిచేయడానికి కాసింత ఉప్పునీరు చాలు. జపానీస్‌ కంపెనీ ‘స్టేయర్‌ హోల్డింగ్‌’ దీనిని ఇటీవల మార్కెట్‌లోకి తెచ్చింది.

ఇది మాగ్నెటిక్‌ చార్జర్‌. దీని సాకెట్‌లో నాలుగు మెగ్నీషియం రాడ్లు ఉంటాయి. అందులో ఉప్పునీరు వేసి నింపడం వల్ల జరిగే రసాయనిక చర్య ద్వారా విద్యుత్తు పుడుతుంది. దీంతో మొబైల్‌ ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్‌  వస్తువులను చార్జ్‌ చేసుకోవచ్చు. వినియోగాన్ని బట్టి దీనిలోని మెగ్నీషియం రాడ్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఆరుబయట పిక్నిక్‌లకు వెళ్లేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని ధర 15,800 యెన్‌లు (రూ.8,837) మాత్రమే!
 

Advertisement

తప్పక చదవండి

Advertisement