కర్ణిసేన చీఫ్‌ హత్య కేసు..ఇద్దరు షూటర్లు సహా ముగ్గురి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

కర్ణిసేన చీఫ్‌ హత్య కేసు..ఇద్దరు షూటర్లు సహా ముగ్గురి అరెస్ట్‌

Published Mon, Dec 11 2023 5:07 AM

3 Key Accused Arrested for Karni Sena Leader Death - Sakshi

న్యూఢిల్లీ/జైపూర్‌: శ్రీ రాష్ట్రీయ కర్ణిసేన చీఫ్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామెడి హత్య కేసుకు సంబంధించి ఇద్దరు షూటర్లు సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 5న రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌లోని తన సొంతింట్లోనే గోగామెడిని దుండగులు కాల్చి చంపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా జైపూర్‌కు చెందిన రోహిత్‌ రాథోడ్, హరియాణాలోని మహేంద్రగఢ్‌ వాసి నితిన్‌ ఫౌజీ అనే వారే కాల్పుల ఘటనలో పాల్గొన్నట్లు నిర్థారణకు వచ్చారు.

రాజస్తాన్, ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టి, చండీగఢ్‌లోని 24వ సెక్టార్‌లోని ఓ హోటల్‌లో ఉండగా వీరిద్దరితోపాటు తప్పించుకునేందుకు సహకరించిన ఉద్ధమ్‌ సింగ్‌ అనే వ్యక్తిని పట్టుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం వీరిని జైపూర్‌ పోలీసులకు అప్పగించనున్నారు. గోగామెడిని చంపేందుకు షూటర్లను కాంట్రాక్టుకు కుదిర్చిన రాంవీర్‌ అనే వ్యక్తిని శనివారం జైపూర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

విదేశాలకు వెళ్లేందుకు పథకం
‘గోగామెడిని చంపిన అనంతరం నిందితులిద్దరూ నకిలీ గుర్తింపు పత్రాలతో చండీగఢ్‌లోని ఓ హోటల్‌లో బస చేశారు. అక్కడి నుంచి విదేశాలకు వెళ్లేందుకు పథకం వేసినట్లు భావిస్తున్నాం. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది’అని పోలీసులు చెప్పారు. నాలుగేళ్ల క్రితం ఆర్మీలో చేరేందుకు శిక్షణ తీసుకుంటున్న సమయంలో నితిన్‌ ఫౌజీ, ఉద్ధమ్‌ సింగ్‌లకు పరిచయం ఏర్పడినట్లు తెలిపారు.

గతంలో ఫౌజీపై కిడ్నాప్‌ కేసు, పోలీసు అధికారిపై దాడి కేసులతో సంబంధముంది. రాథోడ్‌కు కూడా నేరచరిత్ర ఉంది. జైలుకెళ్లి వచ్చాడు. రోహిత్‌ గోదారా ఆదేశాల మేరకు గోగామెడి హత్యకు వీరేంద్ర చరణ్‌ అనే వ్యక్తి పథక రచన చేసినట్లు అనుమానిస్తున్నారు. గోగామెడిని చంపినందుకు గాను రాథోడ్, ఫౌజీలకు చెరో రూ.50 వేలు ముట్టినట్లు చెబుతున్నారు.

నకిలీ వీసాలు, పాస్‌పోర్టులు తయారయ్యే వరకు అజ్ఞాతంలో గడపాలని వీరు నిర్ణయించుకున్నట్లు సమాచారం. చండీగఢ్‌ నుంచి గోవాకు అక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లేందుకు వీరు పథకం వేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆర్మీలో పనిచేస్తూ సెలవుపై మహేంద్రగఢ్‌లోని సొంతింటికి వచ్చిన ఫౌజీ, మళ్లీ విధుల్లో చేరకుండా హరియాణాలో నేరాలకు పాల్పడుతున్నట్లు వివరించాయి
 

Advertisement
Advertisement