గజరాజుల మృత్యుఘోష | Sakshi
Sakshi News home page

గజరాజుల మృత్యుఘోష

Published Thu, Dec 28 2023 5:04 AM

Unnatural deaths of elephants are increasing in the country - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో గజరాజుల మరణాలు ఇటీవల పెరి­గా­యి. విద్యుదాఘాతం, రైళ్లు ఢీకొనడం వంటి కారణాలతో పెద్ద­ఎత్తున ఏనుగులు మరణిస్తున్నాయి. వీటికితోడు వేటాడటం, విష ప్రయోగం వంటి కారణాల వల్ల ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 522 ఏనుగులు మృత్యువాత పడ్డాయని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ఇటీవల వెల్లడించింది.

విద్యుదాఘాతాల కారణంగా ఐదేళ్లలో (2018–19 నుంచి 2022–23 వరకు) అత్యధికంగా 379 ఏనుగులు మృతి చెందినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తరువాత రైలు ప్రమాదాల బారినపడి ఐదేళ్లలో 75 ఏనుగులు మరణించాయి. వేటాడటం ద్వారా 47 గజరాజులను చంపేశారు. దంతాల కోసం విష ప్రయోగం చేసి 21 ఏనుగులను హతమార్చినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది.  

విద్యుత్‌ కంచెలతోనే తీవ్ర సమస్య 
విద్యుదాఘాతంతో అత్యధికంగా ఒడిశాలో ఐదేళ్లలో 80 ఏనుగులు, తమిళనాడు, అసోం రాష్ట్రాల్లో ఒక్కొక్కచోట 53 చొప్పున ఏనుగులు మృతి చెందాయి. రైళ్లు ఢీకొట్టిన ఘటనల్లో అత్యధికంగా అసోంలో 24 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఒడిశాలో 18 ఏనుగులను రైలు ప్రమాదాలు పొట్టనపెట్టుకున్నాయి. వేటాడ­టం ద్వారా ఒడిశాలో అత్యధికంగా 15 ఏనుగులను హతమార్చారు.

మేఘాలయలో 15 ఏనుగులను చంపేశారు. అసోంలో విషప్రయోగంతో ఏకంగా 17 ఏనుగులను హతమార్చారు. అలాంటి వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అటవీ ప్రాంత సమీప పొలాల్లో పంటల్ని కాపాడుకునేందుకు విద్యుత్‌ కంచెల్ని ఏర్పాటు చేస్తుండటంతో విద్యుదాఘాతానికి గురై ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి.  

రైల్వేతో సమన్వయ కమిటీ 
రైలు ప్రమాదాల్లో ఏనుగుల మరణాల నివారణకు రైల్వే మంత్రిత్వ శాఖ, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలతో శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. రైళ్లు నడిపే పైలట్లకు స్పష్టమైన వీక్షణను అందించడానికి రైల్వే ట్రాక్‌ల వెంట వృక్ష సంపదను తొలగించడం, ఏనుగుల ఉనికి గురించి పైలట్లను హెచ్చరించడానికి తగిన పాయింట్ల వద్ద సూచిక బోర్డులను ఉపయోగించడం, రైల్వే ట్రాక్‌ల ఎలివేటెడ్‌ విభాగాలను ఆధునికీకరించడం, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్‌ పాస్, ఓవర్‌ పాస్‌లను ఏర్పాటు చేయడం, అటవీ శాఖ  ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, వన్యప్రాణుల పరిశీలకులు రైల్వే ట్రాక్‌లపై రెగ్యులర్‌ పెట్రోలింగ్‌ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.

కేంద్రం చేసిన సూచనలివి! 
♦ విద్యుదాఘాతాల నుంచి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్‌ కంచెల్ని తొలగించాల్సిందిగా అన్ని రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలు, ట్రాన్స్‌­మిషన్‌ ఏజెన్సీలకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

♦ భూమిపై విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించింది. అండర్‌ గ్రౌండ్‌ లేదా పోల్స్‌పై మాత్రమే విద్యుత్‌ లైన్లు ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

​​​​​​​♦‘ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌’ కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఏనుగుల పరిరక్షణ, వాటి ఆవాసాల్లో చర్యలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని రాష్ట్రాలకు అందిస్తోంది. 

​​​​​​​♦ ఏనుగుల కదలికలను పర్యవేక్షించడానికి స్థానిక సంఘాలతో ట్రాకర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు మానవుల వల్ల నష్టాన్ని నివారించడానికి స్థానిక ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది.

​​​​​​​♦ మానవ–వన్యప్రాణుల సంఘర్షణల హాట్‌ స్పాట్‌లను గుర్తించడంతోపాటు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించింది.  

​​​​​​​♦ అడవి జంతువులకు రుచించని పంటల్ని వేయాల్సిందిగా సూచనలు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement