పట్టపగలే దోచేశారు
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : ఆ ఇంట్లో వారి కదలికలపై నిఘాపెట్టారు. ఇంటి యజమానులతో పాటు పనిమనిషి బయటకెళ్లగానే తలుపులు పగలగొట్టిలోనికి ప్రవేశించారు. బెడ్రూంలోని బీరువా, మంచం అల్మారాలో ఉన్న సుమారు రూ.42 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు. నెల్లూరు నగరంలోని వేదాయపాళెం సమీపంలో ఉన్న వెంకటరెడ్డినగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. ఇదే ఇంట్లో కొద్ది నెలల క్రితం చోరీ జరగడం గమనార్హం.
పోలీసుల కథనం మేరకు..
కాంట్రాక్టర్ తల్లపనేని చిన్న వెంకటేశ్వర్లు, హైమావతి దంపతులు వెంకటరెడ్డినగర్‌లో నివాసముంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన వీరి కుమారుడు శ్రీనివాసులు భార్య స్రవంతి, కుమార్తెతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. గురువారం స్రవంతి సోదరుడు కృష్ణచైతన్య వివాహం కావడంతో నాలుగురోజుల క్రితం కుటుంబసమేతంగా నెల్లూరుకు వచ్చారు. కోడలి సోదరుడి వివాహం కావడంతో బ్యాంకు లాకర్లో ఉన్న నగలను చిన్నవెంకటేశ్వర్లు రెండు రోజుల కిందట ఇంటికి తెచ్చా రు. గురువారం నగరంలోని రమారాయల్ కల్యాణ మండపంలో జరిగిన కృష్ణచైతన్య వివాహానికి అందరూ వెళ్లొచ్చారు. శుక్రవారం వేదాయపాళెంలోని ఎల్ఎల్ఎఫ్ స్కూలు సమీపంలో ఉన్న పుట్టింట్లో సత్యనారాయణ వ్రతం కావడంతో స్రవంతితో పాటు కుటుంబసభ్యులందరూ ఉదయం 11 గంటలకు అక్కడకు వెళ్లారు. వెళ్లే సమయంలో పనిమనిషి షాబు బయట అంట్లు తోముతుండగా పనిపూర్తయిన తర్వాత సందులో పెట్టాలని సూచించారు. షాబు పనిపూర్తి చేసుకుని 12 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బెడ్రూంలోని బీరువాను పగలగొట్టడంతో పాటు మంచం కింద ఉన్న అల్మారాను తెరిచారు. వీటిలో ఉన్న సుమారు రూ.42 లక్షల విలువైన 175 సవర్ల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వెండివస్తువులు ఉన్నప్పటికీ అక్కడే వదిలివెళ్లారు. వ్రతం పూర్తయిన తర్వాత హైమావతి కుమారుడు శ్రీనివాసులుతో కలిసి ఇంటికి వచ్చారు.
ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా పడివుండడంతో పాటు బీరువా, అల్మారాలోని నగలు కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. హైమావతి వెంటనే విషయాన్ని భర్తకు తెలియజేయడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సిటీ డీఎస్పీ పి.వెంకటనాథ్‌రెడ్డి, ఐదో నగర ఇన్స్పెక్టర్ ఎస్వీ రాజశేఖరరెడ్డి, ఎస్సైలు విజయకుమార్, వేమయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించగా, డాగ్‌స్క్వాడ్ నిందితుల ఆధారాల కోసం గాలించింది.
విభిన్న కోణాల్లో దర్యాప్తు
ఈ భారీ చోరీ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చిన్నవెంకటేశ్వర్లు కుటుంబసభ్యుల కదలికలను దగ్గర నుంచి పరిశీలిస్తున్న వారే ఈ చోరీకి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. మొదట రెక్కీ నిర్వహిం చినట్లు భావిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట మధ్యే చోరీ జరిగినట్లుండటంతో దొంగలు ఇంటికి సమీపంలోనే మాటేసినట్లు నిర్ధారణకు వచ్చారు.
ఇదే ఇంట్లో కొద్ది నెలల క్రితం దొంగలు చొరబడి సుమారు రూ.45 వేల నగదు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ అపహరించారు. అప్పట్లో ఆ ఘటనకు పాల్పడిన వారే మళ్లీ ఇప్పుడు తెగబడ్డారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులతో పాటు పనిమనిషి షాబును విచారించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ పి.వెంకటనాథ్‌రెడ్డి చెప్పారు.
శుభకార్యం కావడంతో...
కోడలి అన్న పెళ్లి కావడంతో నగలను లాకరు నుంచి తెచ్చామని బాధితుడు చిన్నవెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం మళ్లీ లాకరులో పెడదామనుకున్నామని, ఇంతలోనే దొంగలు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.