Post Matric
-
ముందే ఫీ‘జులుం’
పాలిసెట్ ద్వారా ధనుంజయ్ రంగారెడ్డి జిల్లా మీర్పేట్లోని ఓ కాలేజీలో సీటు సాధించాడు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి అర్హత ఉంది. ట్యూషన్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదని అనుకున్నాడు. సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన తర్వాత అడ్మిషన్‌కు కాలేజీకి వెళ్లాడు. అయితే పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ ఇస్తామని కాలేజీ యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో ఒక్కసారిగా రూ.18వేలు చెల్లించే పరిస్థితి లేక ధనుంజయ్ సతమతమయ్యాడు. సీటు కోల్పోతాననే ఆందోళనతో తండ్రికి అసలు విషయం చెప్పగా, అప్పు చేసి వెంటనే ఫీజు చెల్లించి కాలేజీలో చేరాడు. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకానికి అర్హత ఉన్న ధనుంజయ్ ఒక్కడే కాదు..ఆ కాలేజీలో కన్వినర్ కోటాలో వివిధ బ్రాంచ్‌ల్లో సీటు దక్కించుకున్న దాదాపు 500 మందికి పైగా విద్యార్థులంతా ఇదే తరహాలో ట్యూషన్ ఫీజు సొంతంగా చెల్లించి అడ్మిషన్లు తీసుకున్నారు. పలు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర వృత్తివిద్యా కాలేజీలన్నీ ఇదే తరహాల్లో విద్యార్థుల నుంచి ముందస్తుగా ఫీజు చెల్లిస్తేనే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఆయా కోర్సులు అందించే కాలేజీలు ఇలా... సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తోంది. వృత్తివిద్యా కోర్సుల అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఆదాయపరిమితికి లోబడిన, కన్వినర్ కోటాలో సీటు దక్కించుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇంటర్లో చేరే విద్యార్థులు, దోస్త్ ద్వారా జనరల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి కూడా ఈ పథకం అమలవుతోంది. వాస్తవానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద సీటు సాధిస్తే నిబంధనలకు లోబడి ఎలాంటి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. నేరుగా కాలేజీలో అడ్మిషన్ తీసుకొని కోర్సు పూర్తిచేసే వరకు ఉచితంగా చదువుకోవచ్చు. కానీ మెజారిటీ కాలేజీలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. అడ్మిషన్ సమయంలోనే కొన్ని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థి నుంచి ముందస్తుగా ట్యూషన్ ఫీజు వసూలు చేస్తున్నాయి. అలా ఫీజును చెల్లించిన వారికి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు చెల్లిస్తే.. అప్పుడు రికవరీ రాష్ట్రంలో పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 12.65లక్షలు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అర్హత ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు నిధులు విడుదల చేస్తుంది. నేరుగా కాలేజీ యాజమాన్యం ఖాతాలో అవి జమ అవుతాయి. పాలిటెక్నిక్ కోర్సు మూడు సంవత్సరాలు, ఇంజనీరింగ్ కోర్సు నాలుగేళ్లు... ఇలా ఆయా కోర్సు కాలపరిమితి ఉండగా, విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత ఆ సంవత్సరానికి సంబంధించిన నిధులను తదుపరి అకడమిక్ ఈయర్ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం కాలేజీ ఖాతాలో జమ చేస్తుంది. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యం విద్యార్థి చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెక్కు రూపంలో అతనికే చెల్లిస్తుంది. వాస్తవానికి విద్యార్థి నుంచి ఫీజు వసూలు చేసుకోవడం, తర్వాత అతడికి తిరిగి చెల్లించడం నిబంధనలకు విరుద్ధం. లిఖిత పూర్వక ఫిర్యాదులు నిల్ రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు అదే కాలేజీలో చదవాల్సి ఉండడంతో ముందస్తు ఫీజు వసూళ్లపై విద్యార్థులు ఎలాంటి ఫిర్యాదులు చేయడం లేదు. ఇలా ఫిర్యాదు చేస్తే కాలేజీల్లో ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందనే భావన మెజారిటీ విద్యార్థుల్లో ఉంది. ఫీజుల చెల్లింపులపై సంక్షేమ శాఖలకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు. -
‘ఉపకార’ సంస్కరణలు ఇప్పట్లో లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల విషయంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని భావించిన సంక్షేమ శాఖలకు ఈ ఏడాది నిరాశే ఎదురైంది. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దరఖాస్తుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలను సమర్పించాయి. ప్రధానంగా సాంకేతిక సమస్యలను అధిగమించడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ, పరిశీలన, ఆమోదం విషయంలో సవరణలకు సంబంధించిన ప్రతి పాదనలను సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి దాదాపు ఆర్నెళ్లు కావస్తున్నా..వాటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ప్రస్తుతం అవలంభిస్తున్న పద్ధతులతోనే పథకాలను అమలు చేయాలని భావించి పాత విధానాల ఆధారంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేశాయి. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి విద్యార్థుల నుంచి ఈ పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేలా గడువును నిర్దేశించాయి. సులభతరం కోసం సంస్కరణలు.. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం ఏటా సగటున 12.5 లక్షల మంది విద్యార్థుల నుంచి సంక్షేమ శాఖలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. ఇవన్నీ ఆన్లైన్ పద్ధతిలోనే స్వీకరిస్తున్నప్పటికీ.. పరిశీలన ప్రక్రియలో పలు అంచెలన్నీ మాన్యువల్ పద్ధతిలోనే సాగుతున్నాయి. దీంతో పథకాల అమలులో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సులభతర విధానం కోసం దరఖాస్తుల ప్రక్రియలో మార్పులు చేయాలని సంక్షేమ శాఖలు పలు దఫాలుగా చర్చించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఏదైనా కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థి ఒకసారి ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు సమర్పిస్తే కోర్సు ముగిసే వరకు ఆ దరఖాస్తును సాంకేతికంగా అప్డేట్ చేయాలని, ఈ బాధ్యతలను కాలేజీ యాజమాన్యాలకు ఇస్తే విద్యార్థి పదేపదే దరఖాస్తు చేసే పని ఉండదని, సంక్షేమ శాఖ అధికారులు మొదటి ప్రతిపాదన చేశారు. విద్యార్థుల నుంచి ప్రతిసారి ఆదాయ ధ్రువీకరణ పత్రాల సమర్పణ, అఫిడవిట్లు తీసుకునే విధానాన్ని రద్దు చేయాలని, ఇక ప్రతి విద్యార్థి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత మాన్యువల్ పద్ధతిలో పత్రాలను సమర్పించడం కాకుండా ఆన్లైన్ విధానాన్నే పాటించడం, బయోమెట్రిక్ అప్డేషన్ ప్రక్రియంతా కాలేజీలో నిర్వహించడంలాంటి పద్ధతులతో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల అమలు మరింత సులభతరమవుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమ శాఖలు ప్రతిపాదనలు సమర్పించాయి. ఇదంతా జరిగి ఆర్నెళ్లు కావస్తున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో ఈ విద్యాసంవత్సరంలో పాత విధానాన్నే అనుసరించాలని, ప్రభుత్వం అనుమతిస్తే వచ్చే ఏడాది నుంచి కొత్త పద్ధతులను అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణను వేగవంతం చేస్తూ కాలేజీ యాజమాన్యాలకు జిల్లా సంక్షేమ శాఖల నుంచి ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు మౌఖిక ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఆదేశాలు పంపించారు. -
రీయింబర్స్మెంట్ దరఖాస్తు గడువు పెంపు
► డిసెంబర్ 31 చివరి తేదీ ► ఇదే చివరి అవకాశమని ప్రభుత్వం స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: పోస్ట్‌మెట్రిక్ ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి దరఖాస్తు గడువును ప్రభుత్వం పెంచింది. ఈనెల 31 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. వాస్తవానికి నవంబర్ 30 నాటితో దరఖాస్తుకు గడువు ముగిసింది. అయితే కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో భారీ మార్పులు చేసుకున్న నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియలో ఈ వివరాలను వెబ్సైట్లో పొందుపర్చాల్సి ఉంది. ఈ పాస్ వెబ్‌సైట్‌ను సాంఘిక సంక్షేమ శాఖ దాదాపు నెలరోజుల పాటు నిలిపివేసింది. దీంతో విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేక పోయారు. కాలేజీల సమాచారం, వాటి చిరునామా తదితర అంశాలను పునరుద్ధరించి గతనెల మొదటివారం నుంచి ఈపాస్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన ఆదాయ ధ్రువీకరణపత్రాలు కొత్తగా ఏర్పాటైన మండలాల నుంచి జారీ చేయడంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. మీసేవ నుంచి ధ్రువీకరణ పత్రాలు రాకపోవడంతో పెద్దసంఖ్య లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు గడువును పొడిగించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ కరుణాకర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో దరఖాస్తు గడువును ఈనెల 31కి ప్రభుత్వం పొడిగించింది. 2016-17 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ దరఖాస్తును నిర్దేశిత గడువులోగా సమర్పించాలని, ఇకపై గడువు పొడిగించే అవకాశం లేదని ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ కరుణాకర్ స్పష్టం చేశారు.