non veg
-
శాకాహారుల గ్రామం.. ఉల్లి, వెల్లుల్లి కూడా ముట్టరు
జెహనాబాద్: బీహార్‌లోని జెహనాబాద్ జిల్లా హులాస్‌గంజ్ బ్లాక్‌లోని ఓ గ్రామంలోని వారంతా విచిత్రమైన నిబంధనలు పాటిస్తుంటారు. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిలోకి బిఘా గ్రామంలోని వారు మాంసం, మద్యం ముట్టరు. పైగా ఇక్కడి వృద్ధులు ఉల్లి, వెల్లుల్లి కూడా తినరు. గ్రామంలో ఎవరైనా ఈ నిబంధనలకు విరుద్ధంగా వెళితే వారి ఇంటిలో అనర్థం జరుగుతుంది స్థానికులు నమ్ముతుంటారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఇక్కడ ఎవరింటికి కొత్త కోడలు వచ్చినా ఇక్కడి నిబంధనలు పాటించాల్సిందే. గ్రామంలోని యువత ఈ మధ్య కాలం నుంచే ఉల్లి, వెల్లుల్లి తింటున్నారు. అయితే వారు మాంసం, చేపలను అస్సలు ముట్టుకోరు. కొన్ని శతాబ్దాలుగా తమ గ్రామంలో మాంసం, చేపలు తినకూడదనే ఆచారం కొనసాగుతోందని గ్రామస్తులు తెలిపారు.ఈ నియమాన్ని తమ పూర్వీకులు రూపొందించారని పేర్కొన్నారు. ఈ నియమాన్ని ఉల్లంఘించి గతంలో కొందరు ఇక్కట్ల పాలయ్యారని, గ్రామంలో మద్యం కూడా ఎవరూ ముట్టరని తెలిపారు. ఈ గ్రామానికి చెందిన ఏ యువతికైనా వివాహం జరిగి, అత్తవారింటి వెళ్లాక కూడా ఆమె మాంసాహారం తినదు.ఇది కూడా చదవండి: ట్రెండ్: 12 రోజుల్లో పెళ్లి.. పది నిమిషాల్లోనే ముగించేశారు! -
స్కూల్ ప్రిన్సిపాల్ ఓవరాక్షన్ .. నాన్‌వెజ్ తీసుకొచ్చాడని విద్యార్ధి సస్పెండ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ స్కూల్లో ప్రిన్సిపాల్ అమానుషంగా ప్రవర్తించాడు. అయిదేళ్ల విద్యార్ధిని క్లాస్‌లోకి మాంసాహారం తెచ్చాడని అతడిని సస్పెండ్ చేవారు. ఈ ఘటన అమ్రోహాలోని ఓ ప్రవేటు పాఠశాలలో వెలుగుచూసింది. గురువారం ఉపాధ్యాయుల దినోత్సవం రోజు హిల్టన్ కాన్వెంట్ స్కూల్లో చదువుతున్న నర్సరీ విద్యార్ధి తన లంచ్ బాక్స్‌లో మాంసాహారాన్ని పాఠశాలకు తీసుకొచ్చాడు. ఇది గమనించిన ప్రిన్సిపల్ బాలుడిని స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లి పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్‌ను నిలదీసింది. పాఠశాలలకు మాంసాహారం తీసుకొచ్చే పిల్లలకు మంచి బుద్దులు చెప్పడం తమకు ఇష్టం లేదని ఆమెతో ప్రిన్సిపల్ వాగ్వాదానికి దిగారు. అంతేగాక విద్యార్థి తరుచుగా మాంసాహారాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పాడు. మాంసాహారం తినేలా చేయడం వల్ల అందరినీ ఇస్లాంలోకి మార్చాలనుకుంటున్నాననని, తాను హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలనుకుంటున్నట్లు తనతో విద్యార్ధి చెబుతున్నాడని ఆరోపించారు. ప్రిన్సిపల్ మాటలపై స్పందించిన విద్యార్ధి తల్లి తన క్లాస్‌లోని విద్యార్థులు కేవలం హిందూ-ముస్లిం’ అంటూ వేరు చేసి మట్లాడుతున్నారని చేస్తున్నారంటూ తన కొడుకు గత మూడు నెలలుగా ఫిర్యాదు చేస్తున్నాడని చెప్పింది. తన బిడ్డను అతని తరగతిలో కూర్చోనివ్వడం లేదని మహిళ ఆరోపించింది. అయితే దీంతో ఆగ్రహించిన ప్రిన్సిపాల్.. సదరు విద్యార్థికి చదువు నేర్పడం ఇష్టం లేదని, అతన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.విద్యార్ధి తల్లి, ప్రిన్సిపల్ మధ్య సంభాషణను వీడియో రికార్డు చేయడంతో.. వైరల్‌గా మారింది. దీంతో ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలని, పాఠశాలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అమ్రోహి ముస్లిం కమిటీ.. జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ రాసింది. అమ్రోహా ప్రాథమిక విద్యాశాఖాధికారి మూడు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయుల బృందాన్ని ఏర్పాటు చేసి ఈ అంశంపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా తమ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. -
'ఇప్పటికైనా తినడం ఆపేయండి'.. వైరలవుతున్న బాలయ్య హీరోయిన్ పోస్ట్!
విజయదశమి చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన ముంబయి భామ వేదిక. ఆ తర్వాత తెలుగులో బాణం, దగ్గరగా దూరంగా, కాంచన-3, రూలర్, బంగార్రాజు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ చేసింది. కన్నడలో నటించిన శివలింగ మూవీ ఆమె కెరీర్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. 2019లో ది బాడీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రజాకార్, జంగిల్ సినిమాల్లో నటిస్తోన్న ముద్దుగుమ్మ ఎప్పుటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పోస్టులు పెడుతూ ఉంటోంది. అయితే మూగజీవాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించేలా పోస్టులు పెడుతోంది వేదిక. మాంసాహారం కోసం మూగజీవాలను ఎంతలా హింస పెడుతున్నారంటూ పోరాటం చేస్తోంది. జంతు హింసకు వ్యతిరేకంగా వేదిక పోరాటం చేస్తోంది. ఇటీవల జీ-20 సమ్మిట్ కోసం వీధి కుక్కులను అత్యంగా క్రూరంగా హింసించారంటూ పోస్ట్ పెట్టిన వేదిక.. తాజాగా మరో వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది. వేదిక తన ఇన్‌స్టాలో రాస్తూ..' కోళ్లు, ఆవులు, మేకలు, పందులు మాంసం వెనక ఉన్న భయంకరమైన ఫ్యాక్టరీ ఫారమ్‌ల వెనుక ఉన్న నిజం ఇదే. ప్రపంచవ్యాప్తంగా (భారతదేశంలో కూడా) మాంసం, డైరీ ఫ్యాక్టరీ ఫారాల వెనుక ఉన్న భయంకరమైన వాస్తవికత ఇదే. మీరు ఇప్పటికైనా ఈ జంతువులను కాపాడేందుకు భాగం కావాలనుకుంటున్నారా?? జంతువులను చంపేందుకు నిధులు ఇవ్వడం ఆపివేయండి. వెగాన్గా(వెజిటేరియన్) మారిపోండి. ఇప్పుడే జంతువులను తినడం మానేయండి. ప్లీజ్ రెస్పెక్ట్ యానిమల్స్' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఆమెకు జంతు ప్రేమికులు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ మరికొందరేమో మీరు వేజిటెరియన్గా మారితే.. అందరూ అలాగే ఉండాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా జంతువుల హింస పట్ల ఆమె చేస్తున్న ప్రయత్నం కొద్ది మందిలోనైనా మార్పు వస్తుందేమో వేచి చూద్దాం. View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) -
ఆంధ్రజ్యోతి కథనంపై దుర్గగుడి స్పందన
సాక్షి, కృష్ణా: విజయవాడ దుర్గగుడికి చెందిన సీవీ రెడ్డి ఛారిటీస్‌లో మాంసాహారం పేరుతో వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. పోలీసులు మాంసాహారం వండుకుని తిన్నారంటూ అందులో పేర్కొంది. అయితే ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండించారు దుర్గగుడి అధికారులు. దుర్గ గుడి ఈవో భ్రమరాంబ ఆదేశాల మేరకు సత్రాన్ని సందర్శించి.. అన్ని రూములు, పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు అధికారులు. ఆపై సత్రంలో ఎలాంటి మాంసాహారం వండటం స్వీకరించడం లేదని పర్యవేక్షణాధికారి స్పష్టత ఇచ్చారు. తప్పుడు కథనం ఆధారంగా.. చేసిన ఆరోపణలను నిరూపించడంతో పాటు రేపటి పేపర్లో వివరణ ప్రచురించాల్సిందిగా ఆంధ్రజ్యోతిని అధికారులు కోరినట్లు ఈవో వెల్లడించారు. -
ఏంటీ, పెళ్లిలో నాన్‌వెజ్ లేదా?.. మూడు దశాబ్దాలుగా ఇదే ఆచారం!
‘పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు, మంథని ప్రాంతానికి చెందిన ఎంపీపీలు, పలువురు ప్రజాప్రతినిధులు ఇటీవల సిరిసిల్లలో జరిగిన పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. వధువరులను ఆశీర్వదించి భోజనాలకు ఉపక్రమించారు. విందులో పప్పు, పచ్చిపులుసు, పప్పుచారు, వంకాయ, టమాట, గోబీఫ్రై, ఆలుగడ్డ కర్రీ, మిర్చి, స్వీట్లను చూసి అవాక్కయ్యారు. నాన్‌వెజ్ లేదా..! అని పుట్ట మధు ప్రశ్నించారు. సిరిసిల్ల పద్మశాలీ సమాజంలో పెళ్లిళ్లలో నాన్‌వెజ్ పెట్టరని, ఓన్లీ వెజ్ మాత్రమే వడ్డిస్తారని చెప్పడంతో మధుతో పాటు, మంథని ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు షాకయ్యారు.’ సాక్షి, సిరిసిల్ల: ఇంట్లో పెళ్లి చేస్తున్నామంటే మొదటగా అతిథులకు రుచికరమైన భోజనం వడ్డించాలని ఆలోచన చేస్తారు. తెలంగాణ జిల్లాల్లో ఎక్కడైనా పెళ్లిల్లో మాంసాహారానికి అగ్రతాంబూలం ఉంటుంది. కానీ కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో ఎంతపెద్ద కోటీశ్వరులైనా.. పేదోళ్లయినా పెళ్లిళ్లలో శాకాహారం.. సాత్విక ఆహారంతోనే విందు చేస్తారు. ఇది నిన్న, మొన్నటి విధానం కాదు.. మూడు దశాబ్దాలుగా సిరిసిల్ల పద్మశాలీ సమాజంలో కొనసాగుతోంది. లక్ష జనాభా ఉన్న పట్టణంలో పద్మశాలీ సమాజమే 80శాతం ఉంటుంది. అందరికీ ఆదర్శంగా నిలు స్తున్న ఆ సాంప్రదాయంపై సండే స్పెషల్.. మూడు దశాబ్దాలుగా సిరిసిల్లలో మూడు దశాబ్దాలుగా పద్మశాలీ సమాజంలో పెళ్లిళ్లలో శాకాహారం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1993లో మొదలైన ఆచారం 30 ఏళ్లుగా కొనసాగుతోంది. సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాలైన చంద్రంపేట, రాజీవ్‌నగర్, తంగళ్లపల్లిలోనూ శాకాహార భోజనాలనే పెళ్లిలో వడ్డిస్తున్నారు. సంఘం స్ఫూర్తి.. అదే కీర్తి 1992లో సిరిసిల్ల పద్మశాలీ సంఘం పెద్దలుగా ఉన్న రుద్ర శంకరయ్య, గూడూరి పర్శరాం, గున్నాల రామచంద్రం, కొండ శంకరయ్య, కట్టెకోల లక్ష్మీనారాయణ, కుడిక్యాల రాజారాం పెళ్లిలో శాకా హారం వడ్డించాలని తీర్మాణం చేసి అమలు చేశారు. కొద్ది రోజులకే శాంతినగర్‌లోని ఓపెళ్లిలో ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి మాంసాహారాన్ని వడ్డించారు. ఈ విషయం తెలుసుకున్న పద్మశాలీ సంఘం పెద్దలందరూ ఆ పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించి, భోజనం చేయకుండా వెనుదిరిగారు. ఆ సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. పెళ్లి పెద్దలు సైతం మరుసటి రోజే సంఘం పెద్దవద్దకు వచ్చి పొరపాటైందని అంగీకరించారు. 1993 నుంచి సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో పద్మశాలీ సమాజం శాకాహార భోజనాలు వడ్డిస్తున్నారు. రిసెప్షన్ వేడుకల్లో వారి ఇష్టం ఆర్థిక అసమానతలున్న సిరిసిల్లలో శాకాహార భోజనం అందించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పెళ్లి జరిగే ఇంట్లో హోమం ఉంటుంది కాబట్టి మాంసాహారం ముట్టకూడదన్న కులపెద్దల నిర్ణయం మేరకు మాంసాహారాన్ని బంద్ చేశారు. ఆర్థికంగా ఉన్నవారు పెళ్లిలో శాకాహార భోజనం పెట్టి, మరుసటి రోజు పెళ్లి రిసెప్షన్లో (విందులో) మాంసాహార భోజనాలు పెడుతుంటారు. ఇది వారి వ్యక్తిగతం పెళ్లిలో మాత్రం మాంసాహారం ఉండదు. సాత్వికాహారం ఆరోగ్యానికి మంచిదని పద్మశాలీ సంఘం పెద్దలు నిర్ణయించారు. అందరూ తింటారు శాకాలతో భోజనం పెడితేనే ఆరోగ్యానికి మంచిది. మాంసాహారం ఖర్చుతో కూడుకున్న పని. కూరగాయల భోజనమైతే అందరు చేస్తారు. శాకాహారమైతే అందరికీ బాగుంటుంది. సిరిసిల్ల పద్మబ్రాహ్మణులు, సంఘం పెద్దలు శాకాహార భోజనం విషయంలో మంచి ప్రోత్సాహం ఇచ్చి.. స్ఫూర్తిగా నిలిచారు. – కాముని వనిత, పద్మశాలీ సంఘం మహిళా అధ్యక్షురాలు, సిరిసిల్ల చాలా ప్రాంతాల్లో.. ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పెళ్లిలో నాన్ వెజ్ పెట్టవద్దని తీర్మాణాలు చేశారు. అందరికీ సిరిసిల్ల స్ఫూర్తిగా నిలిచింది. కానీ ఆయా ప్రాంతాల్లో సంఘాల పర్యవేక్షణ లేక కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు.. కొన్ని గ్రామాల్లో ఉల్లంఘించారు. ఎవరిష్టం వారిదే అన్నట్లుగా మారింది. సిరిసిల్లలో మూడు దశాబ్దాలుగా అమలవుతోంది. – కొక్కుల భాస్కర్, పద్మశాలీ జాతీయ పరిషత్ అధ్యక్షుడు ఇప్పటికీ అమలవుతోంది చాలా ఏళ్ల కిందట పద్మశాలీ సంఘం పెద్దలు తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పటికీ అమలవుతోంది. పెళ్లిళ్లలో మాంసం వద్దని తీర్మానం చేశారు. అన్ని రకాలుగా అదే మంచిదని అందరూ భావించారు. ఉన్నవాళ్లు ఉంటారు.. లేనివాళ్లు ఉంటారు.. అందరూ సమానమే అని చెప్పడం కోసం శాకాహార భోజనాలను అమలు చేస్తున్నాం. – గోలి వెంకటరమణ, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు, సిరిసిల్ల -
పెళ్లి భోజనంలో మాంసం పెట్టరా? వరుడి ఫ్రెండ్స్ గొడవ.. వివాహం రద్దు..
జీడిమెట్ల: పెళ్లిలో పెట్టిపోతలకంటే కీలక పాత్ర పోషించేది పెళ్లి విందు. ఆ విందులో వధువు తరఫున వారు మాంసం పెట్టలేదన్న కోపంతో పెళ్లి రద్దు చేసుకున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని, కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఈ నెల 30న పెళ్లి చేసేందుకు ఇరువర్గాల వారు ఒప్పుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట రింగ్‌బస్తీకి చెందిన అబ్బాయికి కుత్బుల్లాపూర్‌కు చెందిన అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. 28వ తేదీ తెల్లవారుజామున 3గంటలకు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. బంధువులంతా షాపూర్‌నగర్‌లోని ఓ కల్యాణ మండపానికి చేరుకున్నారు. వధువు కుటుంబీకులు ఏర్పాటు చేసిన విందులో అందరూ భోజనం చేస్తున్నారు. చివరిబంతిలో పెళ్లి కొడుకు మిత్రులు కూర్చున్నారు. వారికి వెజ్ ఐటమ్స్ వడ్డించారు. దీంతో కొంతమంది లేచి ‘మాంసాహారం లేదా’అని అడిగారు. లేదని వధువు కుటుంబీకులు చెప్పడంతో.. విందులో మాంసం పెట్టకపోవడమేమిటని వరుడి స్నేహితులు వధువు బంధువులతో వాగ్వాదానికి దిగారు. అలా తిండి దగ్గర మొదలైన గొడవ ఇరువర్గాలు కొట్టుకునేవరకు వెళ్లింది. దీంతో పెళ్లి రద్దు అయినట్లు ప్రకటించారు. కాస్త నెమ్మదించాక విషయం పోలీసుల వరకూ వెళ్లింది. జీడిమెట్ల సీఐ పవన్.. ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో నవంబర్ 30(రేపు)న పెళ్లి జరిపించేందుకు ఇరు వర్గాలు ఒప్పుకున్నారు. చదవండి: ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ ప్రారంభం -
మాంసాహారం తిని, ఆలయానికి సిద్దు
సాక్షి, బెంగళూరు: సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఇటీవల కొడగు పర్యటనలో మాంసాహారం తీసుకొని దేవస్థానానికి వెళ్లారని ఆరోపణలు వచ్చాయి. మడికెరిలో మాజీ ఎమ్మెల్యే వీణా అచ్చయ్య ఇంట్లో నాటు కోడి కూర, రాగి ముద్ద భోజనం ఆరగించి ఆ సాయంత్రమే కొడ్లిపేటలో ఉన్న బసవేశ్వర దేవస్థానానికి వెళ్లి దర్శించుకున్నారు. గతంలోనూ సిద్ధరామయ్య చేపల కూర తిని ధర్మస్థలకు వెళ్లారనే వివాదంలో చిక్కుకున్నారు. ఇందులో తప్పేముందని సిద్ధరామయ్య ఆదివారం చిక్కబళ్లాపురలో ప్రశ్నించారు. ఒక్కరోజు ముందు మాంసాహారం తిని మరుసటి రోజు ఆలయానికి వెళ్తే తప్పు కాదా అని అన్నారు. చదవండి: (నగల వ్యాపారికి హనీ ట్రాప్.. వద్దన్నా హోటల్‌కు.. యువతి ఎంట్రీ..) -
దిగొచ్చిన చికెన్ ధర.. లొట్టలేస్తున్న మాంసం ప్రియులు
సాక్షి, తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): చాలాకాలం తరువాత చికెన్ ధరలు తగ్గడంతో మాంసం ప్రియులు లొట్టలేసుకుంటున్నారు. ఒక సమయంలో దాదాపు మూడొందల వరకు వెళ్లిన కిలో చికెన్ రేటు ఇప్పుడు సగానికి పడిపోయింది. నాన్‌వెజ్ ఐటమ్స్‌లో మటన్, ఫిష్‌తో పోలిస్తే చికెన్ రేటు మాత్రమే సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. దీంతో ఎక్కువ శాతం చికెన్‌కు మొగ్గు చూపుతారు. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులు, కార్తీక మాసం కావడంతో ఇటీవల చికెన్ రేటు 170 (స్కిన్), 180 (స్కిన్లెస్)కి పడిపోయింది. తాటిచెట్లపాలెంలో మాత్రం ఈ ధర 160/ 170గా ఉంది. కార్తీకమాసం కారణంగా సుమారు 40 శాతం అమ్మకాలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా బ్రాయిలర్ కోడి పెరగగానే చికెన్ సెంటర్లకు తరలించి అమ్మకాలు చేపడుతుంటారు. అంతకుమించి పెరిగిన కోడిని ఉంచడం వల్ల వాటికి అదనపు మేత అవసరమై, కోళ్ల రైతులకు నష్టాలు వస్తాయి. ప్రస్తుతం ఇలా అందుబాటులోకి వచ్చిన కోళ్లు కూడా అధికంగా ఉండడంతో చికెన్ రేటు పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. చదవండి: (థ్యాంక్యూ టీటీడీ.. మహిళా భక్తురాలు ఈ–మెయిల్) -
కొరమీను, నాటు కోడి, రొయ్య, మటన్ ఖీమా.. ఈ పచ్చళ్లు టేస్ట్ చేశారా
మర్యాదలకు, మంచి ఆతిథ్యానికి పెట్టింది పేరు ఉభయగోదావరి జిల్లాలు.. ఇక మన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పసందైన విందు భోజనాలు, సంక్రాంతి కోడిపందేలు, నాన్ వెజ్ వంటల రుచుల గొప్పతనం అందరికీ తెలిసిందే. అలాంటి భీమవరంలో తయారైన నాన్‌వెజ్ పచ్చళ్లు ఇప్పుడు దేశ విదేశాల్లోని తెలుగువారి నోరూరిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర దేశాల్లోని కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులకు నాన్‌వెజ్ పచ్చళ్లు పంపించాలంటే వెంటనే గుర్తుకొచ్చేవి భీమవరం పచ్చళ్లే. సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం పట్టణం, చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 50 మంది వరకు ఈ నాన్‌వెజ్ పచ్చళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. కొందరు నిత్యం ఈ పచ్చళ్ల వ్యాపారంలో ఉంటే.. మరికొందరు తమకు వచ్చిన ఆర్డర్ మేరకు పచ్చళ్లు తయారు చేస్తారు. నాజ్‌వెజ్ పచ్చళ్ల వ్యాపారం ఈ ప్రాంతంలో వందల మందికి ఉపాధి కల్పిస్తోంది. నాణ్యత, రుచిలో రాజీ పడకుండా పచ్చళ్లు తయారు చేయడంతో వీటికి మంచి పేరు దక్కింది. చూస్తేనే నోరూరించేలా నాణ్యతతో వీటిని తయారుచేస్తుంటారు. భీమవరం వచ్చే రాజకీయ నాయకులు, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఈ నాన్‌వెజ్ పచ్చళ్లు రుచి చూడాల్సిందే. వాటి రుచి చూసిన వారు తప్పకుండా తమతో తీసుకెళ్తుంటారు. ఎందరో ప్రముఖులు ఇక్కడి పచ్చళ్లకు ఫ్యాన్స్‌గా మారిపోయారు. దాదాపు 40 దేశాలకు ఎగుమతి భీమవరం ప్రాంతంలోని నాన్‌వెజ్ పచ్చళ్లు దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లాండ్, దుబాయ్, కువైట్, సింగపూర్, రష్యా తదితర 40 దేశాలకు వెళ్తుంటాయి. అక్కడ ఉన్న బంధువులు, స్నేహితులకు ఇక్కడి నుంచి పంపిస్తుంటారు. అలాగే విదేశాల్లోని తెలుగువారు ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటారు. నాన్‌వెజ్ పచ్చళ్ల వ్యాపారం భీమవరం ప్రాంతంలో ఏడాదికి సుమారు రూ.కోటి వరకూ జరుగుతుందని అంచనా. నాన్‌వెజ్ పచ్చళ్లు ఆయా రకం బట్టి కిలో రూ.600 నుంచి రూ.1500 వరకు ఉంటాయి. పావుకిలో ప్యాకెట్ల దగ్గర నుంచి విక్రయిస్తుంటారు. మన ఆర్డర్ల మేరకు పెద్ద ఎత్తున కూడా తయారుచేస్తుంటారు. ► చేపలో రకాలు : శీలావతి, కొరమీను, పండుగొప్ప, మెత్తళ్లు, బెత్తుల పచ్చళ్లు లభిస్తాయి. ► చికెన్ వెరైటీలు : బోన్, బోన్‌లెస్, నాటు కోడి, పందెం పుంజు పచ్చళ్లు ప్రత్యేకం ► రొయ్యలో రకాలు : రొయ్య(చిన్నవి), రొయ్య (పెద్దవి), శాక రొయ్య పచ్చళ్లు ఫేమస్ ► అలాగే పీత, మటన్ బోన్‌లెస్, మటన్ ఖీమా పచ్చళ్లు కూడా ఆర్డర్ల మేరకు సరఫరా చేస్తారు. ► పీత సమోసా ప్రత్యేకం.. ఇక్కడ తయారు చేసే పీత సమోసా ప్రత్యేకమైంది. మామూలుగా సమోసా అంటేనే వెంటనే తినాలనిపిస్తుంది. ఇక ఇక్కడ తయారైన పీత సమోసా రుచి చూస్తే వదిలిపెట్టరు. ► చికెన్ పచ్చడి ► రొయ్యల పచ్చడి ► నాటుకోడి పచ్చడి ► పీతల సమోసా -
మాంసాహారం తింటున్నారా? ఆ తర్వాత ఇవి తినండి...
వాస్తవంగా బాదాం పలుకులను ఎప్పుడైనా తినవచ్చు. అయితే ముఖ్యంగా మనం డిన్నర్లో వేటమాంసం, రెడ్ మీట్ తిన్న తర్వాత కొన్ని బాదాం తినడం మంచిది. ఎందుకంటే ఇవి కొవ్వు అత్యధికంగా ఉండే పదార్థాల వల్ల గుండెకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. ఇక మామూలు సమయాల్లో తిన్నా వీటి వల్ల మనకు ఒనగూరే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో క్యాల్షియమ్ పాళ్లు ఎక్కువ. కాబట్టి బాదాంలోని పోషకాలు మన ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వైటమిన్–ఈ కూడా ఎక్కువే. అందుకే బాదాం గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణాశయానికి మంచి పెరుగు ఎంత మేలు చేస్తుందో, బాదం చేసే మేలూ అంతకు తక్కువేమీ కాదు. శరీరంలో ఎక్కడైనా మంట, వాపులతో ఇన్ఫ్లమేషన్ ఉంటే కూడా బాదాం తినడం మంచిది. అప్పుడు అందులోని ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. కొవ్వు పాళ్లు ఒకింత ఎక్కువగా ఉండే మాంసాహారం తర్వాత బాదాంలోని పోషకాలు కొవ్వుల దుష్ప్రభావాన్ని తగ్గించడం వల్ల బాదాం పలుకులు కరోనరీ గుండెజబ్బులనూ సమర్థంగా నివారిస్తాయి. చదవండి: అంతరిక్షంలో ఆతిథ్యం, ఎప్పటినుంచంటే.. ఈ ఫేమస్ యాడ్స్‌లో నటించిన సెలబ్రిటీలు వీళ్లే.. -
నాన్‌వెజ్ పిజ్జా ఇస్తావా? రూ.కోటి ఇవ్వాల్సిందే
కొందరు శాఖాహారులకు మాంసం వాసనే గిట్టదు. అలాంటిది ఏకంగా వారు తినేదాంట్లో మాంసం కలిపేస్తే ఊరుకుంటారా? ఛాన్సే లేదు. ఇదిగో ఇక్కడ చెప్పుకునే దీపాళి త్యాగి అనే మహిళ కూడా శుద్ధ శాఖాహారి. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నివాసముండే ఆమె గతేడాది హోలి పండగ రోజు ఆకలితో ఉన్న తన పిల్లలకోసం అమెరికన్ పిజ్జా రెస్టారెంట్ నుంచి వెజ్ పిజ్జాను ఆర్డర్ చేసింది. కానీ చెప్పిన సమయాని కన్నా అరగంట ఆలస్యంగా డెలివరీ తన ఇంటి ముందుకు వచ్చింది. పోనీలేనని, తనకు తాను సర్ది చెప్పుకుని ఆ డెలివరీ బాక్స్ ఓపెన్ చేసి గబగబా తిన్నారు. ఈ క్రమంలో పిజ్జాలో మాసం ముక్కలు పంటికి తగులడంతో అది మాంసాహార పిజ్జా అని అర్థమైంది. దాన్ని క్షుణ్ణంగా చూస్తే పుట్టగొడుగుల స్థానంలో మాంసం ముక్కలు ఉన్నాయని స్పష్టమైంది. దీంతో ఖంగు తిన్న మహిళ సదరు రెస్టారెంట్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. సంప్రదాయాలు, ఆచారాలు, మత విశ్వాసాలను పాటించే నన్నే మోసం చేస్తావా? అంటూ రెస్టారెంట్‌ను కోర్టుకు లాగింది. నాన్‌వెజ్ పిజ్జా ఇచ్చి చీట్ చేశారంటూ ఇందుకు తనకు కోటి రూపాయల పరిహారం చెల్లించాల్సిందేనంటూ వినియోగదారుల వివాద పరిష్కార కోర్టుకెక్కింది. అయితే దీనిపై ఆమె అదే ఏడాది మార్చి 26న కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. మేనేజర్ ఉచితంగా వెజ్ పిజ్జాను పంపుతానని ఆఫర్ చేసినట్లు తెలిపింది. కానీ ఇది అంత చిన్న విషయం కాదని, తన సంప్రదాయాలను దెబ్బతీయడమేనని పేర్కొంది. తనను మానసిక క్షోభకు గురి చేసినందుకుగానూ కోటి రూపాయలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేసింది. మహిళ ఫిర్యాదుపై స్పందించాలంటూ ఢిల్లీలోని జిల్లా వినియోగదారుల పరిష్కార కమిషన్ సదరు పిజ్జా సంస్థను ఆదేశించింది. అనంతరం దీనిపై ఈ నెల 17న విచారణ జరపనున్నట్లు తెలిపింది. చదవండి: ఫ్రిజ్‌లో ఎలా కూర్చున్నాడబ్బా?! -
బొమ్మిడాలు.. బెండకాయ కాంబినేషన్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: కొందరికి నాన్‌వెజ్ తప్ప వెజ్ అస్సలు రుచించదు. ఇంకొందరు ఆకు కూరలంటే ఆమడ దూరం పెడతారు. మరికొందరికి కొన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలు అంటే వారికి చిరాకు. అవి తినేందుకు కాదుకదా.. చూడ్డానికి కూడా ఇష్టపడరు. మరి శరీరానికి కావాల్సిన పోషకాలు ఎలా అందుతాయ్. ఎప్పుడూ విభిన్న రుచుల ప్రయోగాలకు కేంద్రమైన మన హైదరాబాదీ రెస్టారెంట్లు ఇలాంటి వారికోసమే వెజ్‌ను.. నాన్‌వెజ్‌ను కలిపి అందిస్తూ సరికొత్త రుచులను పంచుతున్నాయి. వేసుకునే దుస్తులు మల్టీ పర్పస్.. ధరించే నగలు మల్టీ పర్పస్ ఉండగా తినే ఫుడ్ మాత్రం ‘మల్టీ’ అయితే తప్పేంటి అంటున్నారు. భోజన ప్రియులు కూడా ఇప్పుడు వెజ్..నాన్‌వెజ్ కలిపి వండిన వంటకాల టేస్టీతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంస్కృతి మన ముత్తాతల కాలం నుంచి ఉన్నప్పటికీ ఏవేవో కారణాలతో రెండింటినీ విడదీసి వంటలు చేశారు. మళ్లీ ఇప్పుడిప్పుడే తిరిగి ‘వంట’పట్టించుకుంటున్నారు. అదీ నగర రెస్టారెంట్ల మధ్య నెలకొన్న పోటీ వల్లనే అని చెప్పక తప్పదు. బొమ్మిడాలు..బెండకాయ అదుర్స్ ‘గ్రీన్ చికెన్’ (చికెన్‌కు కొత్తిమీర, పుదీనా కలిపి చేసేది) పేరుకు తగ్గట్టే ఇది చూడ్డానికి పచ్చగానే ఉన్నా.. ఇందులో వాడే ఆకుకూరలతో అద్భుతమైన రుచి రావడంతో పాటు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఆకు కూరలు, కూరగాయలకు జత కలిసినవి మటన్, చికెన్ మాత్రమే కాదు.. చేపలు, రొయ్యలు, పీతలు వంటివి కూడా ఉన్నాయండోయ్. బొమ్మిడాలు–బెండకాయ కాంబినేషన్‌తో చేసిన పులుసు ఇప్పుడు నగరంలో హైలెట్‌గా నిలుస్తోంది. చాలామంది బెండకాయలో జిగురు ఉంటుందని, దానిని తినేందుకు పిల్లలు కూడా అయిష్టత చూపిస్తుంటారు. అయితే, బెండకాయ మెదడు చురుకుగా పనిచేసేందుకు దోహదపడుతుందని చెప్పి మరీ తల్లిదండ్రులు తినిలా చేస్తారు. అలాంటి జిగురు బెంకాయను బొమ్మిడాలతో కలిపి చేసిన పులుసు యమ టేస్ట్‌గా ఉందంటున్నారు. ఇక మామిడికాయ–చేపల పులుసు.. పేరు చెబితే సరిపోదు.. ఒక్కసారి రుచి చూస్తే చాలు మరిచిపోలేరంటే అతిశయోక్తి కాదు. ఇక గోంగూర–రొయ్యలు టేస్ట్ ఐరన్‌కు కేరాఫ్‌గా చెప్పే వటకం. అటు పీచు.. ఇటు ప్రొటీన్స్ కూరగాయల నుంచి పీచు పదార్థాలు అధికంగా లభ్యమవుతాయి. అయితే, ఇవి పూర్తిస్థాయిలో ప్రోటీన్స్‌ను అందించలేవు. అదే నీచు వంటకాల్లో ప్రోటీన్స్ లభ్యమవుతాయి. మానవ శరీరానికి పీచు, నీచు ద్వారా లభ్యమయ్యే ప్రోటీన్స్, కార్పొహైడ్రేట్స్ రెండూ అవసరమే. ఒకటి అమితంగా తీసుకుని మరొకటి మితంగా తీసుకుంటే కుదరదు. రెండు సమపాళ్లలో ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందన్నది నిపుణులు చెప్పే మాట. ఈ క్రమంలో కూరగాయలతో నీచు పదార్థాలను మిక్స్ చేసి వండి వార్చేస్తున్నారు. ఒకప్పుడు కొన్ని రకాల కూరగాయలతోనే చికెన్, మటన్, రొయ్యలు వంటి వాటిని కలిపి వండేవారు. ఇప్పుడు దాదాపు అన్ని రకాల ఆకు కూరలతో పాటు చాలా రకాల కూరగాయలను కలిపి కంబైన్డ్ వంటలు చేసేస్తున్నారు. ఎప్పటికప్పుడు నగరవాసి సరికొత్త టేస్టీ కోరుకుంటున్న నేపథ్యంలో రెస్టారెంట్ల నిర్వాహకులు సైతం వారి ముంగిటకు సరికొత్తగా డిషెస్‌ను పరిచయం చేస్తూ వస్తున్నాయి. ఇదే క్రమంలో భోజన ప్రియుల ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలో శోధించి మరీ ఆయా డిషెస్‌ను వండి వడ్డిస్తున్నారు. చికెన్ మిర్చి నాన్‘వెజ్’తో జత కట్టినవి ఎన్నో.. తమలపాకు–చికెన్ (తమలపాకులను పేస్ట్ లాగా చేసి చికెన్ కలిపి సూప్ లాగా చేస్తారు), చికెన్ మిర్చి బజ్జీ (మిర్చి బజ్జీని సగానికి కోసి అందులో చికెన్ ముక్కలు ఉంచుతారు), తమలపాకు కోడి పకోడీ (తమలపాకులను పేస్ట్ లాగా చేసి చికెన్‌తో కలిపి పకోడీలా వేస్తారు), ఆలూ చికెన్ కుర్మా, మునక్కాయ–కోడికూర, దోసకాయ–చికెన్, గోంగూర–చికెన్ ఆవకాయ–చికెన్, కొత్తిమీర–కోడికూర, కరివేపాకు–కోడికూర సిటీ భోజన ప్రియులు లొట్టలేసుకుని మరీ ఆరగిస్తున్నారు. ఇక మటన్ విషయానికొస్తే దోసకాయ, బీరకాయ, తోటకూర, గోంగూరలకు మటన్‌ను మిక్స్ చేసి వడ్డిస్తున్నారు. రెస్టారెంట్లో రుచి చూసి ఇంట్లో కూడా తయారు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సాంబర్ రైస్– మటన్ కాబినేషన్ ఇప్పుడు సాంబార్ రైస్‌కు సైతం నాన్‌వెజ్ జోడించే కల్చర్ పెరిగింది. చికెన్–సాంబార్ రైస్, మటన్–సాంబార్, చేపల వేపుడు–సాంబార్ కాంబినేషన్లు ఇప్పుడు భోజన ప్రియుల జిహ్వాకు పనిచెబుతున్నాయి. అలాగే, రైస్ విషయానికొస్తే గోంగూర చికెన్ బిర్యానీ, గోంగూర మటన్ బిర్యానీ, గోంగూర చికెన్ రైస్ ఇప్పుడు సరికొత్త టేస్ట్‌కు కేరాఫ్‌గా మారాయనే చెప్పాలి. రుచులు కోరుతున్నారు నగరవాసులు ఎప్పటికప్పుడు కొత్త రుచుల కోసం ఎదురుచూస్తుంటారు. అలాగే మేం దాదాపు అన్ని రకాల కూరగాయలకు నాన్‌వెజ్‌ను మిక్స్ చేసి వడ్డిస్తున్నాం. నగరంలో ఎక్కడా చేయని డిషెస్‌ను మేం తయారు చేసి పెడతాం. – చంద్రకాంత్, కోడికూర చిట్టిగారె రెస్టారెంట్ ప్రోటీన్స్ పుష్కలం ఆరోగ్య రీత్యా కూరగాయలు మంచివి అయినప్పటికీ అవి పూర్తి స్థాయిలో ప్రోటీన్స్‌ను అందజేయలేవు. ఈ క్రమంలో నాన్‌వెజ్‌తో తీసుకోవడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చు. గోంగూర–చికెన్, ఎగ్–పాలకూర వంటివి. గోంగూరలో విటమిన్–సి, పాలకూర విటమిన్–ఎ లభ్యమవుతాయి. అలాగే వెజ్–నాన్‌వెజ్ మిక్సింగ్‌గా తీసుకునే క్రమంలో విటమిన్ బీ12 లోపాన్ని అధిగమించవచ్చు. – డాక్టర్ పావని, డైటీషియన్ -
తమ్ముడూ.. లెట్స్ డూ కుమ్ముడూ!
ముక్కతోనే.. ముద్ద దిగుతోంది ► నాన్‌వెజ్ వినియోగంలో దేశంలో నగరమే నంబర్‌వన్ ► మటన్, చికెన్, బీఫ్, చేపలు, ► రొయ్యలు అన్నింటికీ యమ డిమాండ్ ► రోజూ 8.66 లక్షల కిలోల మాంసం అమ్మకాలు ► నెలకు సగటున తలసరి 2.6 కిలోల మాంసం లాగించేస్తున్న నగర వాసులు ► పౌల్ట్రీ ఫెడరేషన్, బ్రీడర్స్ అసోసియేషన్ల సర్వేలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: తమకే ప్రత్యేకమైన బిర్యా నీతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హైదరాబాద్.. మాంసాహారం వినియోగంలో మన దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. మొఘ లాయి, దక్కన్, ఇరానీ, పర్షియన్ వంటకాలకు నెలవుగా మారిన నగరంలో మటన్, చికెన్, బీఫ్, చేపలు, రొయ్యలు వంటి మాంసాహార వినియోగం బాగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా సగటున ఒక్కొక్కరు ఏడాదికి 5 కిలోల మాంసం వినియోగిస్తుండగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా 31 కిలోలు వినియోగిస్తున్నట్లు తేలింది. పౌల్ట్రీ ఫెడరేషన్, బ్రీడర్స్ అసోసియేషన్లు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రధానంగా బిర్యానీతో.. కుతుబ్‌షాహీలతో హైదరాబాద్ గడప తొక్కిన బిర్యానీ ఇప్పుడు ప్రపంచంలోని 80శాతం దేశాల్లో నాన్‌వెజ్ కేటగిరీల్లో ప్రధాన వంటకంగా మారింది. హైదరాబాద్ లో బిర్యానీ కోసమే వెలిసిన హోటళ్లు, రెస్టా రెంట్లు ఎన్నో ఉన్నాయి. మటన్, చికెన్, బీఫ్‌ల తో పాటు ఫిష్ బిర్యానీ కూడా బాగా అమ్ముడ వుతోంది. దీనికితోడు ఇళ్లలో చికెన్ వినియోగం బాగా పెరగడంతో... నిత్యం మాంసాహార వినియోగం లక్షల కిలోలకు చేరుకుంది. కోటి జనాభా.. నెలకు సగటున 2.6 కిలోల మాంసం రాజధాని గ్రేటర్ నగరం జనాభా సుమారు కోటికి చేరువైంది. నగరంలో రోజువారీగా చికెన్ వినియోగం 6.66 లక్షల కిలోలుగా ఉంది. మటన్, బీఫ్ అమ్మకాలు కలిపి సుమారు లక్ష కిలోల మేర, చేపల విక్రయాలు మరో లక్ష కిలోల మేర ఉంటాయి. అంటే మొత్తంగా రోజుకు 8.66 లక్షల కిలోల మేర మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన నెలకు 2,59,80,000 కిలోల మాంసం వినియోగమవుతోంది. అంటే సగటున ఒక్కొక్కరి మాంసం వినియోగం నెలకు 2.6 కిలోలుగా, ఏడాదికి 31 కిలోలుగా తేలింది. అదే దేశవ్యాప్తంగా సగటు మాంసం వినియోగం ఏడాదికి 5 కిలోలే కావడం గమనార్హం. అంటే దేశవ్యాప్త సగటు కంటే సుమారు 6 రెట్లు మాంసం వినియోగం అధికమన్న మాట. చికెన్.. అదిరెన్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధి లో నెలకు నాలుగు కోట్ల కిలోల మేర కోడి మాంసం ఉత్ప త్తవుతుండగా.. అందులో రెండు కోట్ల కిలోల మేర గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వినియోగమవుతున్నట్లు పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లెక్కలు చెబుతున్నాయి. దేశంలో చికెన్ విని యోగంలో హైదరాబాద్ తర్వాత ముంబై రెండో స్థానంలో నిలిచినట్లు తేలింది. చేపా.. చేపా.. నిన్నొదలా! చేపలు, రొయ్యలు వంటి ఉత్పత్తులనూ గ్రేటర్ వాసులు విస్తృతంగా వినియోగిస్తున్నారు. కొవ్వుశాతం తక్కువగా ఉండడం, శరీరానికి అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయన్న వైద్యుల సూచనల మేరకు చేపల విని యోగం పెరుగుతోంది. వీటితోపాటు రొయ్యలు, పీతలు, ఇతర సముద్ర ఉత్పత్తులకూ డిమాండ్ పెరుగుతోంది. మొత్తంగా నగరం పరిధిలో రోజూ సుమారు లక్ష కిలోల మేర చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తుల విక్రయాలు జరుగుతుంటాయని మత్స్యశాఖ అంచనా వేసింది. మటన్కూ ఫుల్ గిరాకీ హైదరాబాద్‌లో ఇటీవల చికెన్ వినియోగం బాగా పెరిగినా.. మటన్‌కు మాత్రం డిమాండ్ తగ్గలేదు. ఇళ్లలో వినియోగానికితోడు హోటళ్లు, రెస్టారెంట్లలో మటన్ కబాబ్‌లు, పత్తర్‌కా ఘోష్, బోటి, పాయా, లివర్‌ఫ్రై, బిర్యానీ తదితర వంటకాలు విస్తృతంగా విక్రయమవుతున్నాయి. పాత నగరం సహా పలు ప్రాంతాల్లో బీఫ్ వినియోగం కూడా అధికంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజూ సగటున సుమారు లక్ష కిలోల మేర మటన్, బీఫ్ అమ్మకాలు సాగుతున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. అవగాహన పెరగడమే కారణం ‘‘ప్రొటీన్స్ అధికంగా ఉండడం, పోషకాహార లేమిని చికెన్ దూరం చేస్తుందన్న అవగాహన పెరగడంతో చికెన్, గుడ్ల వినియోగం ఎక్కువైంది. చికెన్, గుడ్లలో ప్రొటీన్స్ అధికంగా ఉంటాయి, కొవ్వు శాతం తక్కువే. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చికెన్, గుడ్ల ధరలు తగ్గుముఖం పట్టడం పౌల్ట్రీ రైతులకు భారంగా పరిణమించింది..’’ – రంజిత్‌రెడ్డి, పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బిర్యానీతో పెరుగుతున్న డిమాండ్ ‘‘వందల ఏళ్ల కిందటి నుంచే మాంసాహార వంటకాల్లో అనేక వెరైటీలు రుచి చూసిన చరిత్ర హైదరాబాదీలది. ఆ సంస్కృతిని కొనసాగిస్తూ మొఘలాయి, దక్కనీ మటన్, చికెన్ బిర్యానీ, పాయ, పత్తర్‌కా ఘోష్ వంటి అరుదైన వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా బిర్యానీకి రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది కూడా..’’ – ఎండీ రబ్బానీ, షాగౌస్ బిర్యానీ -
లింఫ్గ్రంథులకూ టీబీ వచ్చే అవకాశం ఉంది...
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 సంవత్సరాలు. నేను ఉద్యోగరీత్యా తరచు ప్రయాణాలు చేస్తుంటాను. ఎక్కువగా నాన్‌వెజ్ తీసుకుంటాను. ఈ మధ్య నా కాలిబొటనవేలు వాచి విపరీతంగా నొప్పిగా ఉంటే రక్తపరీక్షలో యూరిక్ యాసిడ్ పెరిగిందన్నారు. హోమియోలో దీనికి చికిత్స ఉందా? - పి. రమేశ్, రామేశ్వరం మన శరీరంలో ఏ కదలికలోనైనా కీళ్లదే ప్రధాన పాత్ర. ఆహార నియమాల లోపం వల్ల, కాలేయానికి సంబంధించిన జీవక్రియల అసమతుల్యత వలన రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగి కీళ్లలో గుళికలుగా చేరి నొప్పిని కలిగిస్తాయి. అలాంటి కీళ్ల జబ్బును గౌట్ ఆర్థరైటిస్ అంటారు. 25 నుంచి 45 సంవత్సరాల మధ్యవయసులో ఈ వ్యాధి రావచ్చు. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో గౌట్ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. గౌట్ ప్రధానంగా కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఈ ఆర్థరైటిస్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. మూత్రపిండాలు ఆశించిన స్థాయిలో యూరిక్ యాసిడ్ బయటికి పారదోలడంలో వైఫల్యం చెందడం వల్ల రక్తంలో వాటిస్థాయి పెరుగుతుంది. కారణాలు: రక్తంలో యూరిక్ ఆసిడ్ స్థాయి పెరగడం, వంశపారంపర్యం, స్థూలకాయం, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి, రోగనిరోధక శక్తి తగ్గించే మందులు, అధిక మద్యపానం, ఎక్కువగా మాంసం, చేపలు తినడం వల్ల, హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడేవారిలో యూరిక్ ఆసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. లక్షణాలు: అకస్మాత్తుగా రాత్రివేళలో జ్వరం రావడం, కాలి బొటన వేలిలో నొప్పి, వాపుతో ప్రారంభమవుతుంది. అందుకే గౌట్ ఆర్థరైటిస్‌ను వైద్యపరిభాషలో పొడగ్రా అంటారు. కీళ్లవాపుతో కీళ్లు ఎర్రగా మారడం, కీళ్లు వేడిగా ఉండటం, మోకాళ్లలో నొప్పి, రాత్రివేళలో విపరీతమైన జ్వరం, నీరసంగా ఉండటం. జాగ్రత్తలు: మద్యపానం మానేయాలి, మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. క్రమపద్ధతిలో వ్యాయామం చేయాలి. చాలామందిలో కీళ్లనొప్పులు వచ్చేంత వరకు తెలియదు వారిలో యూరిక్ యాసిడ్ స్థాయికి మించి ఉందని. ముందుజాగ్రత్తగా ఇలాంటి నొప్పులు రాకుండా ఉండటానికి అధిక బరువును నియంత్రించాలి. సమతులాహారాన్ని తీసుకోవాలి. హోమియో చికిత్స: హోమియోపతిలో గౌట్ ఆర్థరైటిస్‌కు రోగి మానసిక, శారీరక లక్షణాలను అనుసరించి మందులివ్వడం జరుగుతుంది. కీళ్లలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడకుండా చూసి, రక్త ప్రసరణలోని వివిధ రసాయనాల సమతుల్యతను కాపాడటం ద్వారా గౌట్ వ్యాధిని సమూలంగా నయం చేయవచ్చు. ముఖ్యంగా బ్ర యోనియా, కాల్బికమ్, బెంజోమిన్, ఆసిడ్, బెర్పిరిస్, నైట్రిక్ యాసిడ్ వంటి మందులను వైద్యుని పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ డయాబెటిస్ కౌన్సెలింగ్ నా వయసు 32. ఈ మధ్య నా భార్యకు తెలియకుండా నాకు పరిచయం ఉన్న ఓ ఆంటీని కలిశాను. ఆవిడతో కలిసిన కొద్దిరోజులకే మూత్రంలో మంట, దురద, అంగచర్మంపై పొక్కులు వచ్చాయి. ఇది హెచ్.ఐ.వి అని నా ఫ్రెండ్స్ అంటే పరీక్ష చేయించుకున్నాను. హెచ్.ఐ.వి. నెగటివ్ వచ్చింది. అయినా నాకు భయంగా ఉంది. నా భార్యకు కూడా వస్తుందా? నాకు తగిన పరిష్కారం సూచించగలరు. - ఒక సోదరుడు, హైదరాబాద్ మీరు ఎప్పుడైనా బయటి వ్యక్తులతో కలిసినప్పుడు కండోమ్ వాడాలి. కండోమ్స్ వాడకం వల్ల సుఖవ్యాధులు రాకుండా ఉంటాయి. తర్వాత మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే హెచ్.ఐ.వి పరీక్ష అనేది అరక్షిత సెక్స్‌లో పాల్గొన్న మూడు నెలల తర్వాత తెలుస్తుంది. దీనిని విండోపిరియడ్ అంటారు. ఈ సమయంలో హెచ్.ఐ.వి పరీక్ష నెగటివే వస్తుంది. మీరు మూడు నెలల తర్వాత పరీక్ష చేయించుకోండి. అయితే సుఖవ్యాధులు మాత్రం సెక్స్‌లో పాల్గొన్న అతి తక్కువ వ్యవధిలోనే తెలుస్తుంది. దీనికోసం మీరు వీడీఆర్ఎల్, టార్చ్ పరీక్షలు, వీటితోపాటు ఆర్బీఎస్ పరీక్ష కూడా చేయించుకోవడం ద్వారా మీకు వచ్చినది సుఖవ్యాధా, కాదా తెలుస్తుంది. ప్రస్తుతం మీకు సుఖవ్యాధి ఉన్నా లేకపోయినా మీరు మీ భార్యతో కండోమ్‌తోనే సెక్స్‌లో పాల్గొనడం సురక్షితం. నా వయసు 21. నాకు ఆరు నెలలుగా జ్వరం వస్తూ పోతూ ఉంటోంది. వైద్యుల దగ్గరకి వెళ్లి చికిత్స తీసుకున్నా, ఫలితం లేదు. మలేరియా, మూత్రపరీక్ష, షుగర్ పరీక్షలు అన్నీ నెగటివ్ అనే వస్తున్నాయి. నాకు జ్వరంతో పాటు రాత్రులు విపరీతమైన చలి, దుప్పట్లు తడిసిపోయేంత చెమట కూడా ఉంటోంది. బాగా నీరసంగా ఉంటోంది. బరువు కూడా తగ్గాను. నా మెడ దగ్గర కొన్ని గడ్డలుగా కూడా ఉన్నట్లు అనిపిస్తోంది. నాకు తరుణోపాయం చూపించగలరు. - శ్రీలక్ష్మి, గుంతకల్లు మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే సర్వైకల్ లింఫిడినోపతిలా కనిపిస్తోంది. మీరు సీబీపీ, ఈఎస్సార్, ఎంపీ, వైడల్, సీయూఈ, చెస్ట్ఎక్స్రే, ఎఫ్ఎన్ఏసీ లేదా బయాప్సీ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా మీకు ఎటువంటి జ్వరం అన్నది తెలుస్తుంది. మీకు వచ్చిన జ్వరం టీ బీ జ్వరం అని నాకు అనిపిస్తోంది. టీబీ ఊపిరితిత్తులకే కాకుండా లింఫ్ గ్రంథులకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి నేను చెప్పిన పరీక్షలు చేయించుకుని మీరు డాక్టర్ దగ్గర చూపించుకుంటే మీకు మంచి తరుణోపాయం లభిస్తుంది. డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కన్సల్టెంట్ - ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటిస్ సెంచరీ హాస్పిటల్ బంజారాహిల్స్, హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 19 ఏళ్లు. ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇటీవల వాడికి కాళ్లలో వాపు వస్తుంటే వైద్యులకు చూపించాం. పలు వైద్యపరీక్షలు నిర్వహించి, మా అబ్బాయికి కిడ్నీ జబ్బు ఉందని నిర్ధారించారు. మా కుటుంబ సభ్యుల్లో ఎవరికీ ఈ జబ్బు లేదు. మరి మా వాడికే ఎందుకొచ్చిందో తెలియడం లేదు. దయచేసి మా అబ్బాయి సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. - ప్రకాష్, గుంటూరు కిడ్నీజబ్బులు రావడానికి చాలా కారణాలుంటాయి. మధుమేహం, రక్తపోటు ఉన్నవారిలో, ఊబకాయంతో బాధపడుతున్న వారిలో, కిడ్నీజబ్బులున్న కుటుంబ చరిత్ర కలిగి ఉన్నవారిలో ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కారణం తెలియకుండా కూడా కిడ్నీ జబ్బులు వస్తాయి. కిడ్నీజబ్బులు ఏ వయసులోనైనా రావచ్చు. కాబట్టి ఈ వ్యాధివల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీజబ్బు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలూ కనిపించవు. దురదృష్టవశాత్తూ వ్యాధి ముదిరిన తర్వాతనే లక్షణాలు బయట పడుతుంటాయి. కిడ్నీ వ్యాధిలో ఐదు దశలు ఉంటాయి. రోగి వయసు, వ్యాధి, దశ, ఇతర పరిస్థితులను బట్టి చికిత్స అందిస్తారు. మొదటి రెండు దశల్లోనే వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే చాలా వరకు పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంటుంది. మూడవ దశ, నాలుగవ దశలో గుర్తించి చికిత్స అందిస్తే వ్యాధి తీవ్రత పెరగకుండా చూసుకోవచ్చు లేదా 10-15 ఏళ్ల వరకు వ్యాధి ముదరకుండా వాయిదా వేయవచ్చు. కిడ్నీజబ్బు ఓ సెలైంట్ కిల్లర్. ఎందుకంటే ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తుంటుంది. ఈ జబ్బులో చాలా వరకు వ్యాధి ముదిరిన తర్వాతనే లక్షణాలు కనపడుతుండడంతో ముందస్తుగా ఏం చేయలేకపోతుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా ఏడాదికి ఒకసారి మూత్రపరీక్ష, సీరమ్ క్రియాటినిన్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. మీ అబ్బాయికి కిడ్నీజబ్బు ఉందని మీరుగాని, మీ కుటుంబ సభ్యులు కానీ ఆందోళన చెందకండి. ప్రస్తుతం కిడ్నీజబ్బులకు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చికిత్సను కొనసాగిస్తూ వైద్యుల సలహాలు, సూచనలు పాటించడం ద్వారా మీ అబ్బాయి కూడా అందరిలాగే సాధారణ జీవితం గడపగలుగుతారు. చదువను కొనసాగించి ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా చేయగలుగుతారు. డాక్టర్ వి.సురేష్‌బాబు సీనియర్ నెఫ్రాలజిస్ట్ యశోదా హాస్పిటల్స్ సికింద్రాబాద్ -
కెవ్వు కేక
ఓరీ వెధవాయ్... చుక్క నెయ్యి లేకుండా తింటున్నావ్... నాయనమ్మ గావు కేక! ఆవకాయ, పప్పు, వేడివేడి అన్నం, ఓ రెండు చెంచాలు నెయ్యి... కేక! వాట్ ఈజ్ దిస్ లైఫ్.. కమాన్.. లెట్స్ ఎంజాయ్.. ఫ్రెండ్స్ కెవ్వు కేక! కేక్స్, పేస్ట్రీ, ఐస్‌క్రీమ్, పీజా, బర్గర్, చిప్స్, ఫ్రైస్... కొవ్వు కేక! కొలెస్ట్రాల్, ఒబేసిటీ, హార్ట్ ప్రాబ్లం, పక్షవాతం, ఫ్యాటీ లివర్.. చా... కేక! డాక్టర్లు, క్లినిక్‌లు, హాస్పిటళ్లు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, బిల్లులు.. పొలి కేక! ఇక లాభం లేదు. ఈ డౌట్స్ అన్నిటికీ ఒక ఆన్సర్ కావాలి. ఏ కొవ్వు మంచిదో.. ఏ కొవ్వు చెడ్డదో.. ఏ కొవ్వు అవసరమో.. ఏ కొవ్వు వద్దో.. చెప్పే హెచ్చరిక.. ఈ తొలి కేక. సుస్మిత పదహారేళ్ల పిల్ల. వాళ్ల ఉమ్మడి కుటుంబంలో ఆమె ఒక్కతే ఆడపిల్ల. నానమ్మ, తాతయ్య, మేనత్తల దగ్గర్నుంచి పెద్దనాన్న, పెద్దమ్మ, బాబాయ్ పిన్ని దాకా.. అందరికీ గారాల పట్టి. తిండి దగ్గర్నుంచే ఆ గారాబాన్ని మొదలుపెడ్తారు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అన్నీ ఫ్రై కూరలు, కమ్మటి నెయ్యి, మీగడ పెరుగు, రోజొక రకం స్వీట్ సుస్మిత మెనూలో చేరుస్తారు. ఆ అమ్మాయి మాత్రం వీటన్నిటినీ పక్కను తోసి నూనె లేని పుల్క, నీళ్లకూరతో భోజనం అయిందనిపించేస్తుంది. కారణం.. మోడల్ కావాలనే ఆమె ఆశయం! కానీ సుస్మిత నానమ్మ, తల్లికి మాత్రం ఆ పిల్ల ధోరణి భయం పుట్టిస్తోంది. ‘ఎవరైనా ఉద్యోగం చేసేది బతకడానికే కానీ నువ్వేంటే కడుపు చంపుకొనే ఉద్యోగం కావాలనుకుంటున్నావ్’ అంటూ నానమ్మ అసహనాన్ని వెళ్లగక్కినా వినిపించుకోదు ఆ మనవరాలు. తినడానికి ఏమి ఇచ్చినా ‘అమ్మో ఇది బోలెడంత ఫ్యాట్’ అంటూ మూతి విరిచేస్తుంది. ఆ చేష్టలకు సుస్మిత తల్లి కోపం నషాళానికి అంటుతుంది. సుస్మితకు తోడు వాళ్ల పెద్దనాన్న.. పాలు, పెరుగు, నూనె వస్తువులంటే అమ్మో.. ఫ్యాట్.. కొలెస్ట్రాల్‌ని పెంచేస్తుంది అంటూ ఆమడదూరం పరిగెడుతాడు. మిత్స్ (అపోహలు) ఇలా సుస్మిత, వాళ్ల పెద్దనాన్నే కాదు.. వయసు, పరిజ్ఞానం వంటి భేదాల్లేకుండా చాలామందే ఈ ఫ్యాట్స్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలియక పోషకాల ప్రాధాన్యం లేని పదార్థాలతో పొట్టనింపుకుంటున్నారు. ఫ్యాట్స్ మిత్స్లో పడిపోయి అదే నిజమనే మిథ్యలో ఉంటున్నారు. కొవ్వులు పెరుగుతాయనే అపోహతో నెయ్యి, నూనెలను పూర్తిగా తగ్గించేసుకుంటున్నారు. మరికొంతమందైతే కొన్ని నూనె కంపెనీలు తమది కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్ అన్న ప్రచారాన్ని నమ్మి ఆ కంపెనీ నూనెలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ తప్పే! అసలు మన దేశంలో వాడే నూనెల్లో దేంట్లోనూ కొలెస్ట్రాల్ ఉండదు. కొలెస్ట్రాల్ అన్నది మొక్కల (వెజిటెబుల్ కింగ్డమ్)నుంచి రాదు. మన నూనెలన్నీ సీడ్స్ నుంచే తయ్యారయ్యేవే. అన్ని నూనెలూ కొలెస్ట్రాల్ఫ్రీయే! కాబట్టి సదరు కంపెనీల ప్రచారాన్ని నమ్మి సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరంలేదు. కొవ్వులు.. నిజాలు ఫ్యాట్స్ అన్నీ హానికరం కాదు. మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ వైటల్ ఆర్గాన్స్‌ను సంరక్షించే రక్తనాళాలు, మెదడు, చర్మకణాలకు ఫ్యాట్స్ చాలా అవసరం. మనం తీసుకునే ఆహారానికి రుచినీ కల్పిస్తాయి. శరీరానికి శక్తినిస్తాయి. ఫ్యాట్స్ స్లిమ్‌గా ఉండడానికీ తోడ్పడుతాయి. ఉదాహరణకు అన్నంలో నెయ్యి వేసుకొని తింటే.. అది ఆహారం పైన ఓ పొరలా మారి ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీనివల్ల త్వరగా ఆకలి కాదు. తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఒళ్లూ పెరగదు. పైగా నెయ్యితో ఆహారాన్ని తినడం వల్ల సెటైటీ (ఆహారం తిన్న సంతృప్తి భావన) త్వరగా కలుగుతుంది. దీనివల్లా తినే పరిమాణం తగ్గుతుంది. ఆశ్చర్యంగా అనిపించినా ఇది వాస్తవం. ఏమేమి.. ఎంత అవసరం... మనిషికి మోనో - అన్ సాచ్యురేటెడ్, పాలీ - అన్సాచ్యురేటెడ్, సాచ్యురేటెడ్యాసిడ్స్, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అనే నాలుగు రకాల ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. వీటిలో మోనో -అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (మ్యూఫా) , పాలీ - అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (ప్యూఫా) ఆరోగ్యకరమైనవి. వీటిని మార్చిమార్చి వాడటం వల్ల గుండెకు కొవ్వులు చేరకుండా గార్డుడ్యూటీ చేస్తుంటాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్డిఎల్.. లో డెన్సిటీ లైపో ప్రొటీన్) పెరగకుండా చేస్తాయి. తగు మోతాదులో సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్... అంటే నెయ్యి వంటివి కూడా అవసరమే. అలాగే ఓమేగా -3 ఫ్యాటీ యాసిడ్సూ శరీరానికి కావాలి. ఎందుకంటే వాటిని మన శరీరం తయారు చేసుకోలేదు. పైగా ఎ, డి, ఇ అనే విటమిన్లను మన శరీరం గ్రహించడానికి ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఎంతగానో తోడ్పడతాయి. పై విటమిన్లు కేవలం కొవ్వుల్లోనే కరుగుతాయి. కంటికి ఎ విటమిన్, పూర్తి వ్యాధి నిరోధక శక్తికి డి విటమిన్, సంతాన సాఫల్యానికి ఇ విటమిన్ ఎంత దోహదం చేస్తాయో చెప్పనవసరం లేదు. అలాంటి విటమిన్లను శరీరంలోకి ఇంకేలా చేసేవి ఈ కొవ్వులే! అయితే ఈ ఫ్యాట్స్ అన్నీ హై ఎనర్జీనిస్తాయి. సాచ్యురేటెడ్ అయినా, అన్సాచ్యురేటెడ్ అయినా ఒక గ్రామ్ ఫ్యాట్ 9 క్యాలరీల శక్తినిస్తుంది. కాబట్టి ఏ ఫ్యాట్స్ అయినా అవి శరీరంలో నిల్వ ఉండనంత వరకు... అంటే మనం ఉండాల్సినదాని కన్నా ఎక్కువ బరువు ఉండనంత వరకు మాత్రమే తీసుకోవాలి. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి పరిమితి అవసరం ఎలాగూ కొవ్వు పదార్థాలు అవసరం కదా అని అదేపనిగానూ, ఆహారంలో రుచిపెంచడం కోసమూ కొవ్వుల్ని ఎక్కువ మోతాదుల్లో తీసుకోకూడదు. అలాగని పూర్తిగా నివారించకూడదు. పరిమితిలో తీసుకోవడం వల్ల కొవ్వులతోనూ ఆరోగ్యం చేకూరుతుంది. ఆ పరిమితి ఏమిటంటే... ప్రతి వ్యక్తి నెలకు అరలీటర్ (500 ఎమ్ఎల్) నుంచి ముప్పావు లీటర్ (750 ఎమ్ఎల్) వరకునూనె వాడాలి. అంతకు మించితే ఆరోగ్యానికి చేటే. మధుమేహం, గుండెజబ్బులు, రక్తపోటు వంటి వ్యాధులు ఉన్నవారైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కొలతను మించనివ్వకూడదు. ఇంత కచ్చితంగా ఎలా పాటించాలి అంటే.. ఒక టీస్పూన్లో 5 ఎమ్ఎల్ నూనె పడుతుంది. ప్రతి వ్యక్తి రోజూ 3 టీ స్పూన్ల నూనె వాడితే అది నెలకు 450 ఎమ్ఎల్ అవుతుంది. మరో 50 ఎమ్ఎల్ను అదనం. ఆ లెక్కన ప్రతి వ్యక్తికి రోజూ మూడు నుంచి నాలుగు చెంచాల నూనె చాలు. ఇంతకు మించి వాడకూడదనే నియమం పెట్టుకోవాలి. కృత్రిమ కొవ్వు దీనికి ఉదాహరణ.. మార్జరిన్. ఆహారపదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇలాంటి కృత్రిమ కొవ్వు పదార్థాలను ట్రాన్స్‌ఫ్యాట్స్ అని కూడా అంటారు. ఇది చాలా ప్రమాదకరమని పరిశోధకులు చెబుతున్నారు. గుండెకు ఎందుకు మంచిది? ఎందుకు చెడ్డది? ఎల్డీఎల్ కొవ్వు పదార్థాలు రక్తనాళాల్లో గారలాగా (ప్లాక్) ఏర్పడి, రక్తప్రవాహంలో అడ్డంకులు ఏర్పరుస్తాయి. గుండెకూ, మెదడుకు అందాల్సిన రక్తప్రవాహానికి అడ్డుపడితే గుండెపోటుకు, పక్షవాతానికి దారితీస్తాయి. హెచ్‌డీఎల్ ఆ గారను తొలగిస్తూ ఉంటుంది. కాబట్టి రక్తంలో హెచ్‌డీఎల్ పాళ్లు 40కి పైగా ఉంటేనే ఆరోగ్యం. ఎల్డీఎల్ పాళ్లు 100 లోపు ఉంటే మంచిది. ఏయే నూనెల్లో ఏ ఫ్యాట్స్ ఎక్కువ? నూనెలు ఫ్యాట్స్ వేరుశనగ, ఆలివ్ మోనో - అన్సాచ్యురేటెడ్ సఫోలా, సన్‌ఫ్లవర్, అవొకాడో పాలీ - అన్సాచ్యురేటెడ్ నెయ్యి, డాల్డా సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చేప, సోయాబీన్, ఆవనూనె ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఏయే పదార్థాల్లో ఎంతెంత ఫ్యాట్స్ పదార్థం(గ్రాముల్లో) ఫ్యాట్స్ 100 గ్రా. పాలు (స్కిమ్డ్) 1 గ్రాము 100 గ్రా. పన్నీర్ 6.5 గ్రాములు 100 గ్రా. సోయాబీన్ 19.5 గ్రాములు ఉడికించిన కోడిగుడ్డు 7 గ్రాములు ప్రై చేసిన గుడ్డు 14 గ్రాములు 100 గ్రా. చీజ్ 25.1 గ్రాములు 100 గ్రా. ఐస్‌క్రీమ్ (వెనీల) 11 గ్రాములు 100 గ్రా. బాదాం 58.9 గ్రాములు 100 గ్రా. జీడిపప్పు 46.9 గ్రాములు 100 గ్రా. వేరుశనగలు 40.1 గ్రాములు 100 గ్రా. మిక్స్డ్ నట్స్ (వేయించిన) 54 గ్రాములు 100 గ్రా డార్క్ చాక్లెట్స్ 31 గ్రాములు 100 గ్రా. పిజా 10 గ్రాములు 85 గ్రా. చేప (వెన్నలో వేయించినది) 12 గ్రాములు ఎలా, ఎందుకు తీసుకోవాలి..? మోనో అన్సాచ్యురేటెడ్, పాలీ అన్సాచ్యురేటెడ్, ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌తోపాటు అతి తక్కువ మోతాదులో సాచ్యురేటెడ్ ఆయిల్స్ అందేలా నూనెల కాంబినేషన్స్ మారుస్తూ తీసుకుంటే మంచిది. ఈ నూనెల వల్ల వచ్చే కొవ్వులు బయటి వేడిమి, చల్లదనం నుంచి కాపాడుతాయి. మూత్రపిండాలు, కాలేయం, గుండె వంటివాటికి ప్యాడింగ్గా ఉంటాయి. కాని అదే నూనెలను అంటే ఒక్కరు రోజుకు 25 గ్రాముల కంటే ఎక్కువగా వాడితే.. ఆ కొవ్వు శరీరంలో పేరుకుపోతే.. స్థూలకాయం, గుండెజబ్బులు, డయాబెటిస్, ఆర్థరైటిస్, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. శాకాహారులైతే వాళ్లు ఉపయోగించే నూనెలతోపాటు తప్పనిసరిగా సోయాబిన్నూనె లేదా ఆవనూనె వాడాలి. మాంసాహారులైతే వారానికి కనీసం మూడు సార్లు చేపలను తీసుకోవడం మంచిది. వ్యక్తి వ్యక్తికీ మారే కొవ్వు పాళ్లు ఒక వ్యక్తి ఎంత కొవ్వు తీసుకోవాలన్న అంశం వారి వ్యక్తిగత బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆహారంతో తీసుకోవలసిన కొవ్వు పాళ్లు వ్యక్తి నుంచి వ్యక్తికి మారతాయి. కాబట్టి న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి ఆహారం తీసుకుంటేనే మేలైన ఆరోగ్యం. - మధురిమా సిన్హా, చీఫ్ న్యూట్రిషనిస్ట్, కేర్ హాస్పిటల్స్ -
చికెన్ చూస్తే చాలు చిరాకు...!
మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన శరీరాకృతి ఉంటుందని అనుష్కాశర్మ తరచు చెబుతుంటారు. చెప్పడమేమిటి... ఆ సూత్రాన్ని అక్షరాల పాటించేవారు కూడా. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండేవారు. అడిగినా అడకగపోయినా తన ఆరోగ్య సూత్రాలు అందరికీ చెప్పేవారు. అంత ఆరోగ్య స్పృహ ఉన్నప్పటికీ... అనుష్కకు నాన్ వెజ్ అంటే చెప్పలేనంత ఇష్టం. ఆమె తన ఆరోగ్య సూత్రాల గురించి చెప్పినప్పుడు ఎవరైనా- ‘‘మరి నాన్‌వెజ్ సంగతో...’’ అని అడిగినప్పుడల్లా- ‘‘నో కామెంట్’’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చేవారు. అంత ఇష్టమన్నమాట నాన్‌వెజ్ అంటే! అలాంటి అనుష్క కాస్త్తా ‘‘ఇక నాన్‌వెజ్ తినను’’ అని గట్టిగా ప్రకటించారు. ఆరోగ్యస్పృహలో భాగంగా తీసుకున్న నిర్ణయం కాదట ఇది. కేవలం తన పెంపుడు శునకం కోసం తీసుకున్న నిర్ణయం. ఇంతకీ విషయమేమిటంటే, అనుష్క పెంపుడు శునకానికి నాన్‌వెజ్ వాసన అంటే పడదు! తన చుట్టుపక్కల ఎక్కడైనా నాన్‌వెజ్ స్మెల్ వచ్చినా చాలా అసహనంగా ప్రవర్తిస్తుంటుందట. అందుకే... తన పెట్‌ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక... నాన్ వెజ్‌కు గుడ్‌బై చెప్పడమే కాదు... ఎవరైనా చికెన్ ప్రస్తావన తేస్తేనే చిరాకు పడుతున్నారు అనుష్క. -
మందు, మాంసాన్ని తగ్గిద్దాం
లండన్‌కు చెందిన ఓవర్సీస్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆహార అలవాట్లు, వినియోగంలో వస్తున్న మార్పులను, ప్యూచర్ డైట్స్‌తో ఒక నివేదిక వెలువరించింది. 1980తో పోలిస్తే 2008 నాటికి ఊబకాయుల సంఖ్య 23 శాతం అధికమైంది. వర్ధమాన దేశాల్లో గత రెండు మూడు దశాబ్దాల్లో ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో వారి ఆహారం తీరు తెన్నుల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఆదాయం పెరిగిన కొద్దీ జనం మాంసం, కొవ్వు పదార్థాలు, స్వీట్లు వంటి వాటి వైపు ఎక్కువగా మళ్లుతున్నారు. కానీ విధానపరంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించాలి. ఆర్థి కాభివృద్ధి, ఆదాయాల పెరుగుదల, పట్టణీకరణ వీటన్నింటి ప్రభా వంతో ప్రజలు సంప్రదాయంగా తాము తినే ధాన్యాలు, కూరగాయల నుంచి జంతు పదార్థాలు (మాంసం, పాల ఉత్పత్తులు) కొవ్వు, చక్కె రల వైపు ఎక్కువగా మళ్లుతున్నారు. మన దేశంలో కూడా గణనీయమైన పెరుగుదల ఉంది కానీ, శాకాహారుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉండటం వల్ల విదేశాలతో పోలిస్తే తలసరి మాంసం వినియోగం తక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆహారం వైవిధ్యం క్రమేపి తగ్గుతూ కొవ్వు, ఉప్పులు, నూనెల వినియోగం, చక్కెర వినియోగం పెరుగుతుంది. ఇది సరికాదని గుర్తిద్దాం. బోడ నాగేశ్వరరావు మల్టీపర్పస్ అవేర్నెస్ సొసైటీ, హైదరాబాద్ -
లగ్గమెట్ల జేసుడు!
కామారెడ్డి, న్యూస్‌లైన్ : శ్రావణ మాసం రావడంతో పెళ్లి సందడి నెల కొంది. సుమారు మూడు నెలల తర్వాత మంచి ము హూర్తాలు రావడంతో జిల్లాలోనూ జోరుగా వివాహాది శుభకార్యాలు జరుగుతున్నాయి. అయితే పెరిగిన ధర లు వధూవరుల కుటుంబ సభ్యులకు చుక్కలు చూపుతున్నాయి. మాంసం ధరలతో కూరగాయలు పోటీ పడుతున్నాయి. దుస్తుల ధరలు బంగారాన్ని అనుసరిస్తున్నా యి. పెళ్లి మండపాల కిరాయి సైతం భారీగా పెరిగింది. ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్నంటడంతో ఖర్చులు తలకు మించిన భారమవుతున్నాయి. రెట్టింపైన భోజనం ఖర్చు.. నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరగడంతో భోజనం ఖర్చు రెట్టింపైంది. ఏ కూరగాయ ధర విన్నా బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితి ఉంది. అన్నింట్లోనూ విని యోగించే ఉల్లి ధర వింటేనే కన్నీరొస్తోంది. కిలో ఉల్లి ధర * 50 దాటింది. కిలో పచ్చిమిర్చి రేటు * వందకు చేరింది. కొత్తిమీర కూడా ఇదే ధర పలుకుతోంది. కిలో అల్లం * 200 లకు విక్రయిస్తున్నారు. * 60 నుంచి * 80 వెచ్చిస్తే గాని కిలో కూరగాయలు రావడం లేదు. కిలో మటన్ * 400లకు, చికెన్ * 150 నుంచి * 180 వరకు అమ్ముతున్నారు. సన్నరకం పాత బియ్యం క్వింటాలుకు * 5 వేలు పలుకుతున్నాయి. గతంలో సాధారణ భోజనం తయారీకి (ఒక ప్లేట్‌కు) * 60 నుంచి *80 వరకు ఖర్చయ్యేది. అయితే పెరిగిన ధరలతో ఇప్పుడు ప్లేట్ భోజనానికి * 80 నుంచి * వంద వరకు ఖర్చవుతోందని క్యాటరింగ్ చేసేవారు చెబుతున్నారు. మూడు రకాల కూరలు, బిర్యానీ, వైట్‌రైస్, పాపడ్, పెరుగు, ఒక రకం స్వీటుతో ప్లేట్ భోజనానికి తక్కువలో తక్కువ * వంద తీసుకుంటున్నారు. పెరిగిన బంగారం, బట్టల ధరలు మార్కెట్లో బంగారం, బట్టల ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల కాస్త తగ్గినట్లనిపించిన బంగారం మళ్లీ జోరందుకుని పది గ్రాములకు * 31,500లకు చేరింది. ఆభరణాల తయారీ ఖర్చులూ పెరిగాయి. బట్టల ధరలైతే చెప్పే పరిస్థితి లేదు. పట్టువస్త్రాల ధరలు భారీగా పెరిగాయి. పెళ్లికూతురుకు కావాల్సిన పట్టుచీరలు, ఇతర ఫ్యాన్సీ చీరల ధరలు పెరగడంతో పెళ్లి బట్టలకు ఎంత లేదన్నా * 50 వేల వరకు వెచ్చించాల్సి వస్తోందని మధ్యతరగతి ప్రజలు పేర్కొంటున్నారు. వరుడి దుస్తుల ధరలూ పెరిగాయి. పండ్ల రేటూ ఆకాశంలోనే.. డజన్ అరటి పండ్ల ధర * 35 లకు చేరింది. ఆపిల్ కిలో * 150, దానిమ్మ కిలో * వంద పలుకుతున్నాయి. ఒక్కో బత్తాయిని * 20 లకు విక్రయిస్తున్నారు. ఫంక్షన్‌హాళ్ల అద్దెలూ ఎక్కువే... గతంలో ఇళ్ల వద్ద పందిళ్లు వేసి పెళ్లిల్లు చేసేవారు. ఇప్పుడు పందిళ్లు వేయడానికి కావాల్సిన కలప కూడా దొరకడం లేదు. దీంతో ఫంక్షన్ హాళ్లలో శుభకార్యాలు జరిపించే సంస్కృతి పెరిగిపోతోంది. ఒకే ముహూర్తంలో ఎక్కువగా పెళ్లిళ్లు ఉంటే ఫంక్షన్ హాళ్ల ధరలను భారీగా పెంచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కామారెడ్డి పట్టణంలోనే ఫంక్షన్‌హాళ్ల అద్దెలు * 30 వేల నుంచి * లక్ష వరకు ఉన్నాయి. డెకొరేషన్, బ్యాండుమేళం, పూలపందిరి, పూలు, ఇతర ఖర్చులు అదనం. దీంతో పెళ్లి అనగానే ఖర్చులను తలచుకొని పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. * 80 వెచ్చిస్తే గాని కిలో కూరగాయలు రావడం లేదు. కిలో మటన్ * 400లకు, చికెన్ * 150 నుంచి * 180 వరకు అమ్ముతున్నారు. సన్నరకం పాత బియ్యం క్వింటాలుకు * 5 వేలు పలుకుతున్నాయి. గతంలో సాధారణ భోజనం తయారీకి (ఒక ప్లేట్‌కు) * 60 నుంచి *80 వరకు ఖర్చయ్యేది. అయితే పెరిగిన ధరలతో ఇప్పుడు ప్లేట్ భోజనానికి * 80 నుంచి * వంద వరకు ఖర్చవుతోందని క్యాటరింగ్ చేసేవారు చెబుతున్నారు. మూడు రకాల కూరలు, బిర్యానీ, వైట్‌రైస్, పాపడ్, పెరుగు, ఒక రకం స్వీటుతో ప్లేట్ భోజనానికి తక్కువలో తక్కువ * వంద తీసుకుంటున్నారు. పెరిగిన బంగారం, బట్టల ధరలు మార్కెట్లో బంగారం, బట్టల ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల కాస్త తగ్గినట్లనిపించిన బంగారం మళ్లీ జోరందుకుని పది గ్రాములకు * 31,500లకు చేరింది. ఆభరణాల తయారీ ఖర్చులూ పెరిగాయి. బట్టల ధరలైతే చెప్పే పరిస్థితి లేదు. పట్టువస్త్రాల ధరలు భారీగా పెరిగాయి. పెళ్లికూతురుకు కావాల్సిన పట్టుచీరలు, ఇతర ఫ్యాన్సీ చీరల ధరలు పెరగడంతో పెళ్లి బట్టలకు ఎంత లేదన్నా * 50 వేల వరకు వెచ్చించాల్సి వస్తోందని మధ్యతరగతి ప్రజలు పేర్కొంటున్నారు. వరుడి దుస్తుల ధరలూ పెరిగాయి. పండ్ల రేటూ ఆకాశంలోనే.. డజన్ అరటి పండ్ల ధర * 35 లకు చేరింది. ఆపిల్ కిలో * 150, దానిమ్మ కిలో * వంద పలుకుతున్నాయి. ఒక్కో బత్తాయిని * 20 లకు విక్రయిస్తున్నారు. ఫంక్షన్‌హాళ్ల అద్దెలూ ఎక్కువే... గతంలో ఇళ్ల వద్ద పందిళ్లు వేసి పెళ్లిల్లు చేసేవారు. ఇప్పుడు పందిళ్లు వేయడానికి కావాల్సిన కలప కూడా దొరకడం లేదు. దీంతో ఫంక్షన్ హాళ్లలో శుభకార్యాలు జరిపించే సంస్కృతి పెరిగిపోతోంది. ఒకే ముహూర్తంలో ఎక్కువగా పెళ్లిళ్లు ఉంటే ఫంక్షన్ హాళ్ల ధరలను భారీగా పెంచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కామారెడ్డి పట్టణంలోనే ఫంక్షన్‌హాళ్ల అద్దెలు * 30 వేల నుంచి * లక్ష వరకు ఉన్నాయి. డెకొరేషన్, బ్యాండుమేళం, పూలపందిరి, పూలు, ఇతర ఖర్చులు అదనం. దీంతో పెళ్లి అనగానే ఖర్చులను తలచుకొని పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.