Gajvelu
-
ఆరుగురు మంత్రులు ఔట్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహా రాష్ట్ర మంత్రివర్గంలోని 17 మంది మంత్రులకుగాను 14 మంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ 14 మందిలో ఎనిమిది మంది విజయం సాధించగా, ఆరుగురు ఓటమి పాలయ్యారు. మిగతా ముగ్గురు మంత్రులు మహమూద్ అలీ (హోం), సత్యవతి రాథోడ్ (గిరిజన, మహిళా, శిశు సంక్షేమం), పట్నం మహేందర్‌రెడ్డి (సమాచార, పౌర సంబంధాలు) శాసన మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్), కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (వనపర్తి), ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), పువ్వాడ అజయ్ (ఖమ్మం), వి.శ్రీనివాస్‌గౌడ్ (మహబూబ్‌నగర్) ఓటమి పాలయ్యారు. మంత్రులు కేటీఆర్ (సిరిసిల్ల), హరీశ్‌రావు (సిద్దిపేట), వేముల ప్రశాంత్‌రెడ్డి (బాల్కొండ), గంగుల కమలాకర్ (కరీంనగర్), చామకూర మల్లారెడ్డి (మేడ్చల్), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), తలసాని శ్రీనివాస్‌యాదవ్ (సనత్‌నగర్), జి.జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట) విజయం సాధించారు. కామారెడ్డిలో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ: సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా పోటీచేశారు. వీటిలో కామారెడ్డిలో పరాజయం పాలుకాగా.. గజ్వేల్‌లో మాత్రం వరుసగా మూడోసారి విజయం సాధించారు. కేసీఆర్ గత 40 ఏళ్లలో తొలిసారి ఒక ఎన్నికలో ఓడిపోవడం గమనార్హం. 1983లో తొలిసారిగా సిద్దిపేట అసెంబ్లీ స్థానంలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. తర్వాత వరుసగా 1985, 1989, 1994, 1999లలో ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్ఎస్ స్థాపించాక 2001 ఉపఎన్నిక, 2004 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. 2004లో కరీంనగర్ ఎంపీగానూ పోటీ చేసి గెలవడంతో సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తర్వాత 2006, 2008లలో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో కరీంనగర్లో గెలిచారు. 2009లో మహబూబ్‌నగర్, 2014లో మెదక్ ఎంపీగానూ విజయం సాధించారు. 2014, 2018తోపాటు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నాటి తొలి ఓటమి తర్వాత ఇప్పుడు కామారెడ్డిలో కేసీఆర్ పరాజయం పొందడం గమనార్హం. చీఫ్ విప్ సహా విప్ల ఓటమి శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లుగా పనిచేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా పరాజయం పాలయ్యారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడంతో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బరిలో దిగలేదు. పోటీ చేసిన ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ (వరంగల్ పశ్చి మ), బాల్క సుమన్ (చెన్నూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), రేగ కాంతారావు (పినపాక), గొంగిడి సునీత (ఆలేరు) ఓటమి చెందారు. -
గజ్వేల్ జేజేల కోసం..
యెన్నెల్లి సురేందర్ : మలివిడత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2021వరకు ఎంతో సాన్నిహిత్యం, అనుబంధం ఉన్న సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. గజ్వేల్ గడ్డ పై మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్ అభివృద్ధి మంత్రంతో హ్యాట్రిక్ ధీమాతో ఉండగా, ఈటల బీసీ నినాదంతో బరిలోకి దిగారు. కేసీఆర్ : అభివృద్ధి ఎజెండా ఈటల : బీసీ మంత్రం నర్సారెడ్డి : లోకల్ ఫ్లేవర్ అభివృద్ధి మంత్రం.. బహుముఖ వ్యూహం ‘సెంటిమెంట్’గా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొని రెండుసార్లు సీఎం పదవి చేపట్టిన కేసీఆర్ గజ్వేల్‌ను రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనాగా మలచడంలో సఫలమయ్యారు. నియోజకవర్గంలోని మర్కూక్ వద్ద కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్, కొండపాక మండలంలో మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం, ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ యూనివర్సిటీ, గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌లో రింగురోడ్డు, వంద పడకల జిల్లా ఆస్పత్రి, మరో వంద పడకలతో మాతా శిశురక్షణ ఆస్పత్రి, ఎడ్యుకేషన్ హబ్ వంటి అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరిగాయి. గజ్వేల్ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా జరిగిన అభివృద్ధిని చూపిస్తూ కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు బీఆర్ఎస్ యంత్రాంగం బహుముఖ వ్యుహంతో ముందుకు సాగుతోంది. మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తూ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. అన్నింటికీ మించి బూత్‌లెవల్ మేనేజ్మెంట్ సక్రమంగా జరిగేలా వంద ఓట్లకు ఒక ఇన్చార్జిని నియమించారు. ప్రజా ఉద్యమాలకు ఊపిరి... గజ్వేల్, తూప్రాన్, మనోహరాబాద్, ములుగు, మర్కూక్, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, కుకునూర్‌పల్లి మండలాలతో కూడుకొని ఉన్న గజ్వేల్ నియోజకవర్గం యాదాద్రి, జనగామ, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సరిహద్దున ఉన్నది. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌ను ఆనుకొని ఉండటం వల్ల ఇక్కడ నగర వాతావరణం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో 179 పంచాయతీలున్నాయి. నిర్వాసితులను ఆకట్టుకునే ప్రయత్నం గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో మల్లన్నసాగర్ నిర్వాసితులను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు ఆరాటపడుతున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తొగుట మండలంలో పల్లెపహాడ్, వేములగాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురైన సంగతి తెలిసిందే. ఆయా గామాల్లో 10వేలకుపైగా ఓట్లు ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, ఎన్నికల్లో తమకు మద్దతు ప్రకటిస్తే పోరాడుతామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు హామీ ఇస్తున్నారు. ఈటల ముమ్మర ప్రచారం బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బీసీ నినాదం, స్థానిక సమస్యలే ఎజెండాతో ఎన్నికల బరిలో దిగారు. నియోజకవర్గంలో సుమరుగా 1.40లక్షల బీసీ ఓటర్లు ఉండగా..అందులో తన సొంత సామాజికవర్గం ముదిరాజులు 55వేల వరకు ఉంటారు. వీరిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పేరిట 30వేల కుటుంబాలకు చెందిన భూములను లాక్కొని, సరైన నష్ట పరిహారం ఇవ్వకపోవడంతో రోడ్డున పడ్డారని చెబుతూ...వారందరికీ అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్లో అసంతృప్తి నేతలను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 1992 నుంచి సుమారు పదేళ్లకుపైగా ఈటల ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి ’లోకల్’ కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి నేను లోకల్ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే 24గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రచారం చేస్తున్నారు. ఈటల రాజేందర్ కూడా స్థానిక వ్యక్తి కాదని, ఆయన గెలిచినా ఉపయోగం ఉండదని చెబుతున్నారు. -
గజ్వేల్, కామారెడ్డిలో బీజేపీదే గెలుపు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డిలో ఆయన ఓడిపోతారని, ఆ రెండు స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈసారి ఎన్నికల్లో తండ్రీకొడుకులిద్దరూ ఓడిపోవడం ఖాయమని తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ రెండుచోట్ల పోటీ చేస్తున్నారని చెప్పారు. ఈటల బరిలో ఉంటున్నాడని తెలిసినప్పటి నుంచి కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని, కామారెడ్డిలోనూ వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోతారన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో పోటీలో ఉందని తెలిపారు. బీజేపీ తరపున నామినేషన్ వేసిన రెబల్స్ దాదాపు ఉపసంహరించుకున్నారని చెప్పారు. బీజేపీ నుంచి 36 మంది, జనసేన నుంచి ముగ్గురు బీసీ అభ్యర్థులు పోటీలో ఉన్నారని, కాంగ్రెస్ 22 మంది బీసీలకు మాత్రమే టికెట్లు ఇచ్చిందని, బీఆర్ఎస్ 23 మంది బీసీలకు టికెట్ ఇచ్చిందని చెప్పారు. రెండు జనరల్ స్థానాలను కూడా దళితులకే ఇచ్చామన్నారు. బీజేపీ 14 మంది మహిళలకు టికెట్లు ఇవ్వగా, బీఆర్ఎస్ 8 మంది మహిళలకే టికెట్ కేటాయించిందన్నారు. 17న రాష్ట్రానికి అమిత్‌షా... ఈ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికలని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే నష్టమే తప్ప ఎలాంటి మార్పూ రాదని, కుటుంబ, అవినీతి పాలనలో ఈ రెండు పార్టీలూ మునిగిపోయాయన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని, కొందరు దొంగ కంపెనీల పేరిట తప్పుడు సర్వేలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 17న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారని, 18న నాలుగు జిల్లాల్లో సభలు ఉంటాయని, వరంగల్, నల్లగొండ, రాజేంద్రనగర్ అసెంబ్లీల వారీగా బీసీ సంఘాలతో సదస్సు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు బానిస బతుకు మాత్రమే మిగిలిందని, అందుకే గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా చాలామంది నామినేషన్లు వేశారన్నారు. నెలరోజుల్లో పదవి దిగిపోయే కేసీఆర్ ఇప్పుడు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారని, సరైన సమయంలో భూములు చూపకుంటే అందుకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత టెక్స్టైల్ పార్క్, సైన్స్ సిటీ, కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. పాతబస్తీలో నిరుపేద ముస్లింల భూములు లాక్కుని షాదీఖానాలు ఏర్పాటు చేస్తున్నారని, బీజేపీ వారికి రక్షణగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, నితీశ్ కుమార్, కేజ్రీవాల్, కుమారస్వామి తదితర ప్రాంతీయ పార్టీల నేతలను కలిశారని, వారికి ప్రత్యేక విమానాలు పంపించి మరీ దావత్ ఇచ్చారని, వారిలో ఒక్కరైనా ఇప్పుడు మద్దతిచ్చారా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కూడా ప్రచారం చేస్తారని చెప్పారు. -
అందరి దృష్టి కామారెడ్డిపైనే..
ఎస్. వేణుగోపాలచారి: కామారెడ్డిలో ఏం జరుగుతుంది.. ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి అదే. తెలంగాణ తెచ్చిన నేతగా, ముచ్చటగా మూడోసారి సీఎం పీఠాన్ని అధిరోహించాలన్న పట్టుదలతో కేసీఆర్‌లో కామారెడ్డిలో బరిలోకి దిగగా, ఆయనపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీకి దిగడమే చర్చకు ప్రధాన కారణం. రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు జనం నాడి పట్టేందుకు సర్వేల మీద సర్వేలు చేస్తున్నాయి. కేసీఆర్, రేవంత్‌రెడ్డితోపాటు బీజేపీ నుంచి స్థానికంగా గట్టి పట్టు సంపాదించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయనకు నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉంది. మూడ్ ఎలా ఉంటుందో.. సాధారణంగా వీవీఐపీలు పోటీ చేసే నియోజక వర్గాల్లో ప్రజల నాడి త్వరగా బయటపడుతుంది. కానీ ఇక్కడ రెండు పార్టీల కీలక నేతలు పోటీ చేస్తుండడం, వారికితోడు స్థానికుడైన బలమైన నాయకుడు బరిలో ఉండడంతో పోటీ ఎవరి మధ్యన ఉంటుందన్నదానిపై ఇప్పటికైతే క్లారిటీ రావడం లేదు. స్వయంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారంటే అభివృద్ధి పరుగులు పెడుతుందన్న భావన కొన్ని సెక్షన్లలో ఉండడం సహజం. అధికార బీఆర్ఎస్పై ఉన్న ఒకింత వ్యతిరేకత ఓట్లను ప్రతిపక్ష పార్టీలు రెండూ పంచుకుంటే అధికార పార్టీకి లాభం జరుగుతుందనే అంచనాలు ఉంటాయి. పేగుబంధం సెంటిమెంట్‌తో కేసీఆర్ రెండు పర్యాయాలుగా గజ్వేల్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్‌తో పాటు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. తాను పోటీ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఐదారు నియోజక వర్గాలపై ప్రభావం చూపవచ్చనే ఉద్దేశంతో రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారు. 44వ నంబరు జాతీయ రహదారి ద్వారా హైదరాబాద్‌కు కేవలం గంటన్నరలో చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ కామారెడ్డిని ఎంచుకున్నట్టు భావిస్తున్నారు. దీనికి తోడు కేసీఆర్ తల్లి పుట్టి పెరిగిన ఊరు కావడంతో ఈ ప్రాంతంతో ఆయనకు పేగుబంధం ఉన్నది. ఇక్కడ పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్ఛిన దరిమిలా కేసీఆర్ అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించారు. సర్వేల మీద సర్వేలు... ఇప్పుడు కామారెడ్డి సర్వే రాయుళ్లకు కేరాఫ్ నిలిచిందంటే అతిశయోక్తి కాదు. జనం నాడి పట్టేందుకు ఓ పక్క రాజకీయ పార్టీలు సొంతంగా సర్వేలు చేయించుకుంటుండగా, మరో పక్క నిఘా వర్గాలు, మీడియా సంస్థలు పోటాపోటీగా సర్వేలు చేస్తున్నాయి. కాటిపల్లి ’లోకల్’ బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గత నాలుగైదేళ్లుగా నియోజక వర్గంలో నిరంతరం ప్రజా సమస్యలపై అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. డ్వాక్రా మహిళలకు రావలసిన వడ్డీ రాయితీ డబ్బుల కోసం, మాస్టర్ ప్లాన్‌తో నష్టం జరుగుతోందని ఆందోళన చెందిన రైతుల కోసం ఈయన అండగా అండగా నిలిచి ఉద్యమానికి నాయకత్వం వహించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు కేటాయించాలని పెద్ద పోరాటమే చేశారు. ఇలా వరుస ఉద్యమాలతో జనంతో మమేకమైన వెంకటరమణారెడ్డి తనకు స్థానికులు ఓట్లు వేసి పట్టం కడతారని ఆశిస్తున్నారు. ఆ మేరకు రూ.150 కోట్లతో సొంత మేనిఫెస్టోను అమలు చేస్తానని ప్రకటించాడు. సీఎం పోటీ చేస్తున్నా.. వెరవకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. సవాల్ చేసి మరీ బరిలోకి దిగిన రేవంత్... అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యన జరిగే మాటల యుద్ధంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీఎంకు దమ్ముంటే కొడంగల్‌కు వచ్చి నిలబడమని లేదంటే, తానే కామారెడ్డికి వచ్చి పోటీ చేస్తానంటూ పలుమార్లు సవాళ్లు విసిరారు. సీఎం గానీ, ఆయన పార్టీ నేతల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. కానీ సవాల్ విసిరిన రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి బరిలోకి దిగారు. -
గజ్వేల్‌లో 145 .. కామారెడ్డిలో 92
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసిపోగా, రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. మొత్తం 5,716 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండగా, గజ్వేల్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 145 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. కామారెడ్డిలో సైతం 92 మంది నామినేషన్ వేయడం గమనార్హం. మేడ్చల్ నియోజకవర్గంలో 116 మంది, ఎల్బీనగర్ నుంచి 77 మంది, మునుగోడు నుంచి 74 మంది, సూర్యాపేట నుంచి 68 మంది, మిర్యాలగూడ నుంచి 67 మంది, నల్లగొండ నుంచి 64 మంది, సిద్దిపేట నుంచి 62 మంది, కోదాడ నుంచి 61 మంది నామినేషన్ వేశారు. అత్యల్పంగా నారాయణపేట్ స్థానం నుంచి 13 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన నిర్వహించనుండగా, 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. పోస్టల్ బ్యాలెట్ కోసం 31,551 దరఖాస్తులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం భారీ సంఖ్యలో ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. దివ్యాంగులు, వయోజనులు, ఎన్నికలతో సంబంధం లేని అత్యవసర సేవల్లో ఉండే ఓటర్లు కలిపి మొత్తం 31,551 మంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా సిద్ధిపేట నుంచి 757 మంది, అత్యల్పంగా మక్తల్ నియోజకవర్గం నుంచి 5 మంది దరఖాస్తు చేసుకున్నారు. వయోజన, దివ్యాంగ ఓటర్లకు ఇంటి వద్దే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు అవకాశం కల్పిం చనున్నారు. 3.26 కోట్లకు పెరిగిన ఓటర్లు ఈ నెల 5న తుది ఓటర్ల జాబితాను ప్రకటించగా, ఆ తర్వాత వచ్చిన ఓటర్ల నమోదు దరఖాస్తులను పరిష్కరించి శుక్రవారం అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,26,18,205కి పెరిగింది. అందులో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది మహిళలు, 2,676 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. తొలిసారిగా మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లకు మించిపోయింది. 15,406 మంది సర్విసు ఓటర్లు, 2,944 మంది ఓవర్సీస్ ఓటర్లున్నారు. 2023 జనవరితో పోల్చితే తాజాగా రాష్ట్రంలో 8.75 శాతం మంది ఓటర్లు పెరిగారు. 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు 44,371 మంది ఉండగా, వికలాంగ ఓటర్లు 506921 మంది ఉన్నారు. 18–19 ఏళ్ల యువ ఓటర్ల సంఖ్య 9,99,667 కాగా, మొత్తం ఓటర్లలో వీరి శాతం 3.06గా ఉంది. -
బీజేపీ ‘చలో గజ్వేల్’ భగ్నం
సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట జరిగిన వనరుల విధ్వంసాన్ని ప్రజలకు చూపించడం కోసం బీజేపీ చేపట్టిన ‘చలో గజ్వేల్’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి వెంకటరమణారెడ్డిని ఒకరోజు ముందుగానే గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం నుంచి భారీసంఖ్యలో బీజేపీ శ్రేణులు వెంకటరమణారెడ్డి ఇంటికి తరలిరాగా, వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తీసుకెళ్లారు. దీంతో జిల్లాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. వెంకటరమణారెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ బిచ్కుంద పోలీస్‌స్టేషన్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ఆధ్వర్యంలో కార్యకర్తలు, నేతలు ఆందోళన చేశారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆందోళన చేపట్టారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కారులో హైదరాబాద్ నుంచి బిచ్కుంద పోలీసుస్టేషన్‌కు బయలుదేరగా పెద్దకొడప్గల్ మండలకేంద్రం శివారులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన నడుచుకుంటూ పెద్దకొడప్ గల్‌కు చేరుకుని రెండుగంటలపాటు నిరీక్షించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు ఆయన ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. పోలీసులు సాయంత్రం వెంకట రమణా రెడ్డిని విడిచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడు తూ గజ్వేల్‌లో అక్రమాలు వెలుగులోకి వస్తాయని, సీఎం చెబుతున్న అభివృద్ధికి సంబంధించిన గుట్టు రట్టవుతుందన్న ఉద్దేశంతోనే తనను అడ్డుకున్నారని ఆరోపించారు. -
ఓటమి ఒప్పుకున్నకేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం ద్వారా ఈ విషయం స్పష్టమైందని అన్నారు. అభ్యర్థుల ప్రకటన సమయంలో ముఖ్యమంత్రి గొంతులో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని, ఆయన పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి రెండింటిలో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మొత్తం సిట్టింగులకు సీట్లివ్వాలన్న తన సవాల్‌ను స్వీకరించకుండా కొందరిని మార్చారని అన్నారు. సోమవారం గాందీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనారిటీలను అవమానించడమే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని తాను మొదటి నుంచి చెప్పిన మాటలు నిజమయ్యాయని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ జాబితా చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేలిపోయిందని, మూడింట రెండొంతుల మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ పారిపోవాలనుకుంటే సిద్దిపేట ఉంది.. సిరిసిల్ల ఉంది..కానీ ఒక మైనారిటీ నేత బరిలో ఉన్న కామారెడ్డికి వెళ్లడం.. మైనారిటీలను అవమానించడమే. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఎనలేని సేవ చేశారు. కాంగ్రెస్ అంతా షబ్బీర్ అలీకి అండగా ఉండి కేసీఆర్ పని పడుతుంది. అసలు కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటకు వెళ్లకుండా కామారెడ్డికి ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలి..’అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఓటమి సూర్యాపేట సభలోనే స్పష్టంగా కనిపించిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 12.03 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరగగా, ఆ సమయంలో లిక్కర్ షాపుల డ్రా తీశారని ఎద్దేవా చేశారు. దీనిని బట్టి కేసీఆర్ ప్రాధాన్యత ఏంటో తెలంగాణ సమాజం అర్ధం చేసుకోవాలని అన్నారు. రుణమాపీలో రూ.11 వేల కోట్లు మిగుల్చుకున్నారు రుణమాఫీ పేరుతో కేసీఆర్ అతి తెలివితేటలు ప్రదర్శించారని రేవంత్ విమర్శించారు. రూ 99,999 వరకు మాత్రమే రుణమాఫీ చేసి రూ.11 వేల కోట్లు మిగుల్చుకున్నారని ఆరోపించారు. ఒక్క రూపాయే తేడా అని అందరూ అనుకుంటున్నారు కానీ.. దానివల్ల వేలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే పూర్తి రుణమాఫీ జరిగిందని రేవంత్ చెప్పారు. రూ.75 ఉన్న పింఛన్‌ను రూ.200కు పెంచింది కాంగ్రెస్సేనన్నారు. ‘50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అని కేసీఆర్ అంటున్నారు. నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టులు మీ తాతలు కట్టారా? 12,500 గ్రామ పంచాయతీలకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? చింతమడకలో బడి కట్టింది, ముఖ్యమంత్రి ఇంటికి కరెంటు ఇచ్చింది కాంగ్రెస్సే. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో నిర్మించింది కాంగ్రెస్..’అని స్పష్టం చేశారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో లెక్కలతో సహా చర్చకు సిద్ధమని ప్రకటించారు. కమ్యూనిస్టులను కరివేపాకులా తీసేశారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రూ.4 వేల పెన్షన్ ఇస్తుందని రేవంత్ దీమా వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రగతి భవన్ గోడలమీద రాసుకోవాలని సవాల్ విసిరారు. ఏ పెద్ద ఒప్పందం జరిగినా, తర్వాత పది రోజులకు పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తారని విమర్శించారు. సూర్యాపేట సభలో శ్రీకాంత చారి తల్లిని నిలబెట్టి కేసీఆర్ అవమానించారని అన్నారు. కమ్యూనిస్టులను కరివేపాకులా తీసి పారేశారని ధ్వజమెత్తారు. మోసానికి గురైన కమ్యూనిస్టులు కేసీఆర్‌పై తిరుగుబాటు చేయాలని అన్నారు. పార్టీ లో చేరికలు బాన్సువాడ, వర్ధన్నపేట, ముధోల్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు సోమవారం గాందీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. -
ఓటమి భయంతోనే ‘కామారెడ్డికి’ కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. సీజన్ రాకముందే కోయిల కూసింది అన్నట్లుగా ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ప్రత్యేక అభివృద్ధి పేరుతో గజ్వేల్ నియోజకవర్గంలో లెక్కలేనంత ఖర్చు పెట్టినా.. అక్కడ గెలిచే పరిస్థితిలేదనే కేసీఆర్ మరో చోటుకు వెళ్తున్నారని విమర్శించారు. ఈసారి గజ్వేల్‌లో ఓడిపోతున్నారనే సర్వే ఫలితాల భయంతోనే కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని భట్టి అన్నారు. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయాలన్న నిర్ణయంతోనే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందనేది అర్థం అవుతోందని.. బీఆర్ఎస్ నేతలు పార్టీలు మారుతారనే ఆందోళనలోనే కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన ముందే చేశారని అన్నారు. సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అనంతరం ఢిల్లీలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్‌కే గెలిచే పరిస్థితి లేకపోతే, ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తంచేశారు. ఏ లక్ష్యాలకోసం తెలంగాణ సాధించుకున్నామో.. ఆ లక్ష్యాలన్నీ కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫిబ్రవరి, మార్చి నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిందని.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచి్చనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కాగా, సెల్ఫీ విత్ కాంగ్రెస్ అభివృద్ధి అనే కార్యక్రమంతో మరోసారి ప్రజల్లోకి వెళ్తామని.. కాంగ్రెస్ హయంలో చేసిన అభివృద్ధి పనులను సెల్ఫీ తీసుకొని ప్రజలతో పంచుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనతో నష్టపోయిన వారందరూ కాంగ్రెస్‌తో కలసిరావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. -
‘కొండపోచమ్మ’ ప్రారంభానికి ప్రజలు రావొద్దు
సాక్షి, గజ్వేల్: కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి పరిమిత సంఖ్యలో ప్రజాప్రతినిధులకు మాత్రమే ఆహ్వానం అందించామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గజ్వేల్ ప్రజాప్రతినిధులను మాత్రమే ఆహ్వానిస్తున్నామని చెప్పారు. శుక్రవారం కొండపోచమ్మ దేవాలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. ‘ఇది మనమందరం జరుపుకోవాల్సిన జలపండుగ. కానీ కరోనా నేపథ్యంలో ఇది సాధ్యం కాదు. శుక్రవారం ముఖ్యమంత్రి కేవలం ప్రారంభిస్తారు. తరువాత ప్రజలు ఎవరైనా వచ్చి సామాజిక దూరాన్ని పాటిస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్‌ను సందర్శించవచ్చు’ అని తెలిపారు. ప్రజలు ఎవరూ ప్రారంభోత్సవానికి రావొద్దు అని విజ్ఞప్తి చేశారు. (నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు) -
అవినీతికి అడ్డాగా గజ్వేలు: వంటేరు
హైదరాబాద్: గజ్వేలును అవినీతికి అడ్డాగా మార్చేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. ఈ నియోజకవర్గ పరిధిలోని ఎస్సై రామకృష్ణ మరణం వెనుక డీఎస్పీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్లో బుధవారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ, ఈ సంఘటనపై హోం మంత్రి గానీ, జిల్లా మంత్రి హరీశ్‌రావు కానీ స్పందించలేదని పేర్కొన్నారు. తాను రూ.15 లక్షలు వసూలు చేయలేనని డీఎస్పీకి ఫోన్లో చెప్పి మరీ ఎస్సై ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఒక్క పోలీస్ శాఖలోనే ఇంత అవినీతి ఉంటే ఇతర ప్రభుత్వ శాఖ ల్లో ఎంత అవినీతి జరుగుతుందో ఊహించవచ్చన్నారు. స్నేహపూర్వక పోలీస్ వ్యవస్థను అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటోందని, అయితే ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఆ వ్యవస్థ లేదని, ప్రజలన