నిరసన గళం.. నిర్బంధపు జులుం! | Sakshi
Sakshi News home page

నిరసన గళం.. నిర్బంధపు జులుం!

Published Fri, Feb 24 2017 12:51 AM

నిరసన గళం.. నిర్బంధపు జులుం! - Sakshi

సమకాలీనం

పోలీసు వ్యవస్థతో ఊడిగం చేయించుకునే ఫ్యూడల్‌ సంస్కృతిని మన ప్రభుత్వాలు బలోపేతం చేస్తున్నాయి. తాము చెప్పిందే సరైనది, మారుమాటాడకుండా ఒప్పుకోవాలనే పాలకుల ధోరణి ఫలితమే నిరసన గళాలపై ఈ నిర్బంధం. దీన్ని గ్రహించి పౌర సమాజం చైతన్యవంతమైతే తప్ప ‘ప్రజాస్వామ్యమంటే ఏ కొందరికో అధికారం కట్టబెట్టడం కాదు! పాలకులు తప్పు చేస్తున్నప్పుడు, ఏయ్, ఎందుకిలా చేస్తున్నావ్‌? అని ప్రతి పౌరుడూ అడగ్గలిగే స్థితి ఉంటేనే ప్రజాస్వామ్యం’ అన్న గాంధీజీ మాటలు నిజం కావు.

ప్రజాస్వామ్యంలో కీలకమైనదని చెప్పుకునే ప్రజాభిప్రాయం నిరంతర ప్రక్రియనా? లేక ఐదేళ్లకొకసారి వ్యక్తమయ్యేదేనా? ఓట్ల రూపంలో వెల్లడైన ప్రజాభీష్టం మేరకు ఏర్పడ్డ ప్రభుత్వాలు మళ్లీ ఎన్నికల వరకు తామేది తలిస్తే అది చేసుకోవచ్చా? మధ్యలో ప్రజలో ఏ భావమూ వ్యక్తం చేయకూడదా? ప్రజాస్వామ్య పాలనల్లో విధాన నిర్ణయాలకు జనాభిప్రాయమే ఊపిరి. వివిధ రూపాల్లో వ్యక్తమయ్యే జనాభిప్రాయం ఒక నిరంతర ప్రక్రియ. అది తెలిసి మసలుకోవడం ప్రభుత్వాల విధి. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే కాదు, భాగస్వామ్య ప్రజాస్వామ్యం కూడా. ప్రజల ప్రాతినిధ్యం, భాగస్వామ్యం మరో రూపంలోనూ ఉండొచ్చనడానికి పౌరసమాజమే ప్రతీక! కానీ, ఈ మౌలికాంశంపైనే సందేహం రేకెత్తించేలా ఉన్నాయి మన ప్రభుత్వాల నిర్వా కాలు.

కేంద్రంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు నిరసన గళా లను నొక్కేస్తున్న తీరు ఆందోళనకరం. పొగడ్త కానిది మరేదైనా సహించలేని అసహనం పాలకుల్లో పెరిగిపోతోంది. మున్నెన్నడూ లేనంత నిర్బంధకాండ అమలవుతోంది. పాలకులకువ్యతిరేకంగా ఎవరూ మాట్లాడరాదు! నిరసన తెలుపడానికే వీల్లేదు! నిరసన కార్యకలాపాల సంగతలా ఉంచి, అలాంటి అనుమానమొచ్చినా అరెస్టులు, నిర్బంధాలతో అరాచకం సాగిస్తున్నారు. చట్టాలు, విధివిధానాలు, సంప్రదాయాలు అన్నీ గాలికి పోతున్నాయి. చట్టా నికి లోబడి వ్యవహరించాలని మరచిన పోలీసు వ్యవస్థ గుడ్డిగా పాలకులకు ఊడిగం చేస్తోంది. పటిష్ట మైన రాజ్య వ్యవస్థతో ‘దేన్నయినా నిరాటకంగా అడ్డుకుంటాం. వ్యతిరేక భావనలను మొగ్గలోనే తుంచేస్తాం... ధిక్కారమున్‌ సైతుమా?’ అన్నట్టుంది సర్కారు పెద్దల ఒంటెద్దు పోకడ.

అంతటా అదే ధోరణి
‘దాడి చేయడమే అత్యుత్తమ రక్షణ చర్య’ అనే ఆంగ్ల నానుడిని గుర్తు చేస్తున్న సర్కారు తీరు వారి భయాన్ని చెప్పకనే చెబుతోంది. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్తెసరు ఆధిక్యతతో ప్రభుత్వాలను ఏర్పాటుచేసిన పాలక పక్షాల్ని మొదట అభద్రత వెంటాడింది. దీంతో ప్రత్యర్థి పార్టీలను చీలుస్తూ రాజకీయ అనైతికతకు పాల్పడ్డాయి. ఎన్నికైన ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల్ని చట్ట వ్యతిరేకంగా పార్టీలో చేర్చుకుంటూ బలపడటానికి ప్రయాసపడ్డాయి. అధి కారం రుచి మరిగి తిరుగులేని ఆధిక్యతను పెంచుకునే క్రమంలోనే.. నిరసన ఏ మూల నుంచి, ఏ రూపంలోనూ రావొద్దన్న పట్టుదలతో అణచివేతకు దిగు తున్నాయి.

ప్రజా ఉద్యమాల్ని ఉక్కుపాదంతో తొక్కేస్తున్నాయి. ఇది, ఎన్నికల నాటికి ప్రత్యర్థి రాజకీయ, పౌరసమాజ శక్తులు మనుగడలో లేకుండా చేయా లనే దురాశ! నిన్న  హైదరాబాద్‌లో నిరుద్యోగుల ర్యాలీని చిన్నాభిన్నం చేస్తూ ప్రొఫెసర్‌ కోదండరామ్‌పై తెలంగాణ సర్కారు జరిపించిన పోలీసు దాష్టీకం దీన్నే వెల్లడి చేసింది. మొన్న ఏపీ ప్రభుత్వం శాసన సభ్యురాలు రోజాను మహిళా పార్లమెంటరేయన్ల సదస్సుకు వెళ్లనీయకుండా నిర్బంధించి, అక్ర మంగా ఎక్కడెక్కడికో తరలించింది. అంతకు మున్ను ‘ప్రత్యేక హోదా’ కోరుతూ జరిగిన శాంతియుత క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొననీకుండా విపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖపట్నం విమానాశ్రయంలో రెండు గంటలు నిర్బం ధించడమే కాక హైదరాబాద్‌కు తిప్పిపంపింది. ప్రజా ఉద్యమాల పట్ల కేంద్ర ప్రభుత్వ అసహనానికి పలు ఘటనలు అద్దం పడుతున్నాయి.

అసహనానికి పట్టం కట్టడం వల్లనే ఢిల్లీ విశ్వవిద్యాలయం ఈరోజు అట్టుడుకుతోంది. ‘నిర సనల సంస్కృతి’ సదస్సు విషయమై జరిగిన విద్యార్థుల ఘర్షణ, ఉమర్‌ ఖలీద్‌ను రానీయకుండా అడ్డుకున్న తీరు, అధికార విద్యార్థి సంఘం దాడులు సాగిస్తుండగా పోలీసులు పోషించిన ఉద్దేశపూర్వక ప్రేక్షక పాత్ర ఇదే చెబుతు  న్నాయి. ఏ ప్రభుత్వమైనా గిట్టని నిరసన గళాల్ని నియంత్రించడం కాకుండా, తగు వాదనతో ప్రత్యర్థుల్ని ఓడించి విధానాల పరంగా ఆధిపత్యం సాధిం చాలి. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు రావొద్దంటే... హోదా లేకున్నా తామెలా నెట్టుకు రాగలమో వివరించి ప్రజల్ని మెప్పించాలి. నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తున్నామంటే జరిపిన, జరుపనున్న నియామకాలేవో వివ రించాలి. అంతే తప్ప పోలీసు నిర్బంధకాండ అమలుచేయడం సరికాదు.

నిరసన ప్రజాస్వామ్య హక్కు
ప్రభుత్వాల వైఖరి, విధానాలు, పద్ధతులు, ప్రాథమ్యాలు నచ్చనపుడు నిరసన తెలుపడం పౌరుల ప్రాథమిక హక్కు. నిరసన తెలిపే అవకాశమే లేనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థమే లేదన్నది న్యాయ నిపుణుల మాట. మార్చ్, ర్యాలీ, ప్రదర్శన, పికెటింగ్, ధర్నా ... ఇలా వివిధ పద్ధతుల్లో ప్రజలు నిరసన తెలు పొచ్చు. ఇది, రాజ్యాంగంలోని 19వ అ«ధికరణం కల్పించిన హక్కు. పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు దీన్ని స్పష్టీకరించింది. అధికరణం 21 జీవించ డానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు భరోసా కల్పించింది. అధికరణం 21 కల్పించిన ‘స్వేచ్ఛతో కూడిన జీవించే హక్కు’ ప్రజాస్వామ్య సమాజ రాజ్యాంగ  విలు వలకు గుండెకాయ లాంటిది అని జస్టిస్‌ కృష్ణయ్యర్, జస్టిస్‌ భగవతి వ్యాఖ్యా నించారు. ఓ అంశానికి అనుకూలంగానో, ప్రతికూలంగానో ప్రజాభిప్రా యాన్ని వ్యక్తం చేసే పద్ధతే నిరసన.

సహజంగా శాంతియుతంగానే జరిగే ఇటువంటి నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు కొన్ని సందర్భాల్లో హింసాయు తంగా మారొచ్చు. వాటిని పసిగట్టి తగు చర్యల ద్వారా నియంత్రించడం సమర్థ పోలీసింగ్‌పై ఆధారపడి ఉంటుంది. హింసకు ఆస్కారముందనే సాకును చూపి అసలు ర్యాలీలు, ప్రదర్శనలు జరుపుకోవడానికే అనుమతిం చకపోవడం దారుణం. చట్టం అనుమతిస్తోంది కదా అని, తగు ప్రాతిపదిక లేకుండానే సెక్షన్‌ 151 (సీఆర్పీసీ)ని రాజకీయంగా వాడుకుంటూ ప్రత్యర్థుల్ని ముందస్తు అరెస్టులు చేసి నిర్బం«ధించడం కచ్చితంగా అణచివేతే! ‘మీరు హింస జరుపుతారని మాకు అనుమానం ఉందం’టూ ఒక నిరాధార   మైన,æహేతుబద్ధం కాని కారణంతో నిర్బంధించడం, నిరసనే తెలుపనీయ  కుండా అడ్డుకోవడం పౌరుల హక్కును కాలరాయడమే.

నిజానికి ఆ సెక్షన్‌ వాడాలంటే  1) సదరు వ్యక్తి విచారించదగ్గ నేరానికి పాల్పడే వ్యూహంతో ఉన్నట్టు పోలీసులకు నిర్దిష్ట సమాచారం ఉండాలి. 2) అరెస్టు ద్వారా తప్ప మరో విధంగా దాన్ని అడ్డుకోలేని స్థితి ఉండాలి. పైన ప్రస్తావించిన హైద రాబాద్, గన్నవరం, విశాఖ ఘటనలకు సంబంధించి వీటిలో ఏ ఒక్క పరిస్థితీ లేదు. ‘మీ ముందస్తు అరెస్టు నాకు తెలుసు, ఉదయం 6 గంటలకు బయట కొస్తాను కదా! అప్పుడు అరెస్టు చేసుకోండ’ని కోదండరామ్‌ కిటికీలోంచి చెబుతుంటే, వినకుండా తలుపులు బద్దలు కొట్టి 3 గంటల రాత్రి ఆయన్ని అరెస్టు చేయడాన్ని పోలీసులైనా, ప్రభుత్వమైనా ఎలా సమర్థించుకుంటారు? పెట్టుబడిదారీ దేశాల్లోనూ నిరసన ర్యాలీలు, ప్రదర్శనల్ని అనుమతించే ప్రజా స్వామ్య వాతావరణం ఉంది.

ఒక వైపు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా దేశాధ్య క్షుడిగా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటిస్తుండగా మొదలైన నిరసన ప్రద ర్శనలు, ఆయన పాలన సాగిస్తున్నా కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన్ని అధ్యక్షుడిగా అంగీకరించని ప్రజల నిరసనలు స్వేచ్ఛగా సాగుతున్నాయి. అభి వృద్ధిచెందిన దేశాల్లో నిరసన వ్యక్తంచేసే పౌరుల స్వేచ్ఛను కాపాడుతూనే, జన సమూహాల్ని పోలీసులు జాగ్రత్తగా నియంత్రిస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజస్వామ్య దేశంలో అది కరవవుతోంది.

అసమ్మతికి తావే లేకుండా చేసే కుట్ర
భావ ప్రకటన స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కును పౌరులు వాడుకునే ఆస్కా రాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్య పౌరులు, సామాజిక కార్యకర్తలు నష్టపోవాల్సి వస్తోంది. హైదరా బాద్‌లో ఒకప్పుడు నిరసనకారులు అసెంబ్లీ వద్దకు, తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు వచ్చేవారు. తర్వాతి కాలంలో బాబూజగ్జీవన్‌రామ్‌ (బషీర్‌ బాగ్‌), అంబేద్కర్‌ (ట్యాంక్‌బండ్‌ సర్కిల్‌) విగ్రహాల వరకూ ప్రదర్శనల్ని అనుమతించే వారు. నిరనస ప్రదర్శన చేస్తున్న అంగన్‌వాడి మహిళల్ని లోగడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుర్రాలతో తొక్కించిన దుర్ఘటన చోటు చేసుకున్నది తెలుగుతల్లి విగ్రహం సమీపంలోనే. నిర్దిష్టంగా స్థలం చూపి, అక్కడే (జలదృశ్యం) టెంట్‌ వేసి నిరసనలు తెలుపుకోవడాన్ని సర్కారు కొంతకాలం అనుమతించింది.

రోజుల తరబడి నిరసనకు కూర్చునే బాధితు లతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రతినిధులు వెళ్లే సంప్రదాయం కూడా కూడా లోగడ ఉండేది. తర్వాత ఆ నిరసనల స్థలాన్ని ఇందిరాపార్క్‌ ఎదుటికి తరలించారు. అది ఎవరి దృష్టికీ ఆనేదీ కాదు, ప్రభుత్వం తరçఫున ఎవరూ పట్టించుకున్న పాపాన పోయేవారూ కాదు 108 వైద్య సర్వీసు ఉద్యోగులు దాదాపు ఏడాది పాటు ఎండలో, వానలో, చలిలో రిలే నిరాహార దీక్షలు జరి పినా ఎవరి నుంచీ స్పందన లేక సమస్య పరిష్కారం కాకుండానే తమ నిరసనను విరమించాల్సి వచ్చింది.

ఇప్పుడు ఎవరరికీ పట్టని అక్కడ్నుంచి కూడా నిరసన స్థలిని నగర శివార్లలోకి తరలించాలని ప్రభుత్వం యోచి స్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో నిరసన స్థలి జంతర్‌మంతర్‌ పార్లమెంటుకు సమీపంలో ఉంటుంది. అమెరికాలోనూ ఇలా ‘ఫ్రీ స్పీచ్‌ జోన్స్‌’ ఏర్పాటు చేసి నిరసన ప్రదర్శనల్ని అక్కడికి పరిమితం చేసిన ప్పుడు ఇది వారి రాజ్యాంగపు తొలి సవరణ స్ఫూర్తికి విరుద్ధమంటూ తీవ్ర నిరసన వ్యక్తమైంది. నిరసన తెలిపే, ప్రదర్శనలు నిర్వహించుకునే హక్కులకు భంగకరమైన చట్టాలను చేయకుండా నిరోధించడమే అమెరికా రాజ్యాంగ తొలి సవరణ పరమార్థం.

పౌరచేతనే పరిష్కారమా?
పోలీసు వ్యవస్థతో ఊడిగం చేయించుకునే ఫ్యూడల్‌ సంస్కృతిని మన ప్రభు త్వాలు బలోపేతం చేస్తున్నాయి. దీన్నిపుడు వ్యవస్థీకృతంగా చేస్తున్నారు. తద్వారా చట్ట నిబంధనలు, కోర్టు తీర్పులు, మానవహక్కుల సంఘ మార్గ దర్శకాలు, ‘అమ్నెస్టీ’ వంటి అంతర్జాతీయ సంస్థల నివేదికలతో నిమిత్తం లేకుండా పోలీసులు సర్కారుకు వీరవిధేయులై వ్యవహరిస్తున్నారు. నియామ కాల నుంచి బదిలీలు, పదోన్నతులు, కీలకబాధ్యతల అప్పగింతవరకు రాజ కీయ ప్రమేయాలు పోలీసు శాఖ పని తీరును ప్రభావితం చేస్తున్నాయి, ప్రజా స్వామ్య విలువల్ని భ్రష్టు పట్టిస్తున్నాయి.

శాఖాపరమైన నిర్ణయాల్లో ‘పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బోర్డు’ ప్రమేయాన్ని పాలకులు నామమాత్రం చేశారు. పోలీసు విభాగానికి మంచి వాహనాలు, వసతులు, భత్యాలు వంటి మౌలిక సదుపాయాలు పెంచడం వారిని మచ్చిక చేసుకొని నియంత్రణలోకి తెచ్చు కునే ఎత్తుగడేనని పరిశీలకుల వాదన. నరహంతక నేరగాడు నయీమ్‌తో నెయ్యం నెరపిన బడా పోలీసు బాసుల్ని కూడా ప్రభుత్వం కాపాడుతోంది, పరోక్షంగా వారితో దొడ్డిదారి మేళ్లు పొందుతోందనే విమర్శలున్నాయి. పాల కులకుగాక, రాజ్యాంగానికి, దాని పరిధిలో ఏర్పడ్డ చట్టాలకే విధేయులుగా ఉండాలనే స్ఫూర్తి పోలీసు యంత్రాంగంలో పెరగాలని మేధావి వర్గం చెబు తోంది.

ఎదుటివారి వాదన వినకపోవడమేగాక, తాము చెప్పిందే సరైనది, తమ నిర్ణయాన్ని సమీక్షించకుండానే అంతా మారుమాటాడకుండా అంగీకరిం చాలనే ప్రభుత్వాల ధోరణి వల్లే నిరసన గళంపై ఈ నిర్బంధం వచ్చిపడింది. ఈ విషయాలన్నీ గ్రహించి పౌర సమాజం చైతన్యం తెచ్చుకుంటే తప్ప ‘‘ప్రజాస్వామ్యమంటే ఏ కొందరి చేతులకో అధికారం కట్టబెట్టడం కాదు! పాలకులు తప్పు చేస్తున్నప్పుడు, ఏయ్, ఎందుకిలా చేస్తున్నావ్‌? అని ప్రతి పౌరుడూ అడగ్గలిగే స్థితి ఉన్నదే ప్రజాస్వామ్యం’’ అన్న గాంధీజీ మాటలు నిజం కావు. జాతిపిత కలలు కన్న ప్రజాస్వామ్యం పరిఢవిల్లదు.

( వ్యాసకర్త : దిలీప్‌ రెడ్డి
ఈమెయిల్‌: dileepreddy@sakshi.com)

 

Advertisement
Advertisement