Alexa
YSR
‘ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలి. అందుకు సంక్షేమ పథకాలు పెద్దన్న పాత్ర పోషించాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వేదికకథ

ప్రక్షాళనలో తొలి అడుగు

Sakshi | Updated: January 04, 2017 00:05 (IST)
ప్రక్షాళనలో తొలి అడుగు

సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకున్నాకైనా తమకలవాటైన పాత ఆటలకు స్వస్తి చెప్పక తప్పదని గుర్తించలేని భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) సారథులకు ఇదొక షాక్‌ ట్రీట్‌మెంట్‌! బోర్డు ప్రక్షాళనకు ససేమిరా సిద్ధపడని బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు అనురాగ్‌ ఠాకూర్, అజయ్‌ షిర్కేలను పదవులనుంచి తప్పిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీసుకున్న కఠిన నిర్ణయం ఆ సంస్థ పరివర్తనకు దోహదపడే చర్య.  కోట్లాదిమంది అభిమానులను సమ్మోహనపరిచే క్రికెట్‌ క్రీడను మన దేశంలో రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికార గణం హైజాక్‌ చేసి దాన్ని భ్రష్టు పట్టిస్తున్న వైనాన్ని, నాశనం చేస్తున్న తీరును కేంద్రంలోని ప్రభుత్వాలు చూసీ చూడనట్టు ఊరుకున్నాయి. దాంట్లో జోక్యం తమ బాధ్యత కాదన్నట్టు ప్రవర్తిం చాయి. క్రికెట్‌ను కేవలం ‘వినగలిగే’ రోజుల్లో సైతం ఆ ఆటకు అసంఖ్యాక క్రీడా భిమానులుండేవారు.

క్రికెట్‌ సిరీస్‌ సాగుతున్న సమయంలో రేడియో ఉన్నవారి వద్దకు పరుగులెత్తి ‘స్కోరెంత...?’ అని ఆదుర్దాగా ప్రశ్నించేవారు. అలాంటి క్రీడకు కళ్లముందే చెదలు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమంటే జరుగు తున్న నేరంలో భాగం కావడమే. ఆ నింద మోయడానికైనా ప్రభుత్వాలు సిద్ధపడ్డా యిగానీ జోక్యానికి ససేమిరా అన్నాయి. ట్వంటీ–ట్వంటీ క్రికెట్‌ ఆ క్రీడకు అప్పటికే ఉన్న ఆకర్షణను పెంచితే ఐపీఎల్‌ వచ్చాక అది శిఖరాగ్రానికి చేరింది. ఐపీఎల్‌కు కనీవినీ ఎరుగని రీతిలో కాసులు రాలడం మొదలయ్యాక దానికి అనుబంధంగా బెట్టింగ్‌ల జోరు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ల హోరు కూడా పెరిగింది. ప్రధాన నగరాలే కాదు... మారుమూల గ్రామాలకు కూడా ఈ బెట్టింగ్‌ ముఠాల ప్రభావం విస్తరిం చింది. ఇలాంటి ధోరణులను అరికట్టడానికి బీసీసీఐ తానుగా చేసిందేమీ లేదు. సరికదా అక్కడ చేరిన రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ముఠాలు కట్టి  దాన్ని రాజకీయమయం చేశాయి. రాష్ట్ర స్థాయిల్లో ఉండే క్రీడా సంఘాలు కూడా ఈ ముఠా రాజకీయాలకు బ్రాంచి ఆఫీసుల్లా మారాయి! ఇలాంటి పరిస్థితుల్లో బిహార్‌ క్రికెట్‌ సంఘ కార్యదర్శి బెట్టింగ్‌ కేసులను బీసీసీఐ పెద్దలే నీరుగారుస్తున్నారని సుప్రీంకోర్టుకెక్కారు.

పర్యవసానంగా  సర్వోన్నత న్యాయస్థానం ఆ సంస్థను ప్రక్షాళన చేసి తీరాలన్న సంకల్పంతో ముందుకు కదిలింది. అందువల్లే 2015 జనవరిలో జస్టిస్‌ ఆర్‌ఎం లోథా ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించి బీసీసీఐ సంస్థాగత మార్పులకు అవసరమైన సూచనలు చేయమని కోరింది. ఆ కమిటీ అదే సంవ త్సరం ఏప్రిల్‌లో పని ప్రారంభించాక ఎంతో శ్రమించింది. బీసీసీఐ పనితీరు, దానికి జరిగే ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో, దానికి అనుబంధంగా ఉండే కమిటీల ఏర్పాటు, వాటి నిర్వహణ ఎలా కొనసాగుతున్నదో, ఆటగాళ్ల సంక్షే మానికి తీసుకునే చర్యలేమిటో ఆరా తీసింది. కూలంకషంగా అధ్యయనం చేసింది. నిరుడు జనవరి మొదటి వారంలో అనేక విలువైన ప్రతిపాదనలు చేసింది. వాటిపై మీ స్పందనేమిటని బీసీసీఐని సుప్రీంకోర్టు అడిగింది. సరిగ్గా నెలరోజులు వేచి చూశాక మార్చి నెల 3 లోగానైనా జవాబివ్వాలని ఆదేశించింది. ఆ పరిస్థితుల్లో తప్పనిసరై బీసీసీఐ జవాబిచ్చింది.

లోథా కమిటీ సిఫార్సుల్లో కొన్ని మాత్రమే తమకు ఆమోదయోగ్యమని చెబుతూ ఫలానా ప్రతిపాదనలు ఆచరణయోగ్యం కాదంటూ తిరస్కరించింది. బీసీసీఐకి నచ్చని సిఫార్సుల్లో ‘ఒక రాష్ట్రానికి ఒక ఓటు’, ఏడు పదుల వయసు వచ్చినవారు పాలనా పగ్గాలు వదిలిపోవాలనడం, జోడు పదవుల నిర్వహణ కుదరదని చెప్పడం వగైరాలున్నాయి. దీనిలోని ఆంతర్యం అందరికీ తెలిసిందే. మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి రాష్ట్రాలు బహుళ ఓట్లతో బీసీసీఐని కబ్జా పెట్టాయి. ఆ రాష్ట్రాలు ఎవరిని అందలం ఎక్కించదల్చు కుంటే వారిదే రాజ్యమవుతున్నది. ఈ మాదిరి ధోరణుల వల్ల ఇతర రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. వారి మాటకు విలువ లేకుండా పోతోంది. ఈ సిఫా ర్సులు ఆచరణయోగ్యం కాదనుకుంటే ఎందుకు కాదో బీసీసీఐ సుప్రీంకోర్టుకు వివరంగా చెప్పి ఉండాల్సింది. అది ఆ పని చేయలేదు. అందువల్లే ఆరు నెలల్లోగా లోథా కమిటీ సిఫార్సులు అమల్లోకి తీసుకురావాల్సిందేనని నిరుడు జూలైలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.

బీసీసీఐ ప్రభుత్వాలిచ్చే గ్రాంట్లపైన నడవకపోవచ్చు. కానీ అది ఎవరి ప్రయో జనాలో నెరవేర్చడానికుద్దేశించిన ప్రైవేటు సంస్థేమీ కాదు. ఈ దేశ పౌరులకు అది జవాబుదారీగా ఉండాలి. ఇక్కడి చట్టాలకు లోబడి పనిచేయాలి. దాని పనితీరు పారదర్శకంగా ఉండాలి. దాని నిర్వహణ ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. బీసీ సీఐకి జవాబుదారీతనం లేని పర్యవసానంగా బెట్టింగ్‌లు విజృంభించి, దేశ భద్రతకు ముప్పు కలిగించే దావూద్‌ ఇబ్రహీం ముఠా జోక్యం కూడా అందులో పెరిగి క్రికెట్‌ క్రీడతో నేరం పెనవేసుకుపోయే స్థితి ఏర్పడింది. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్, కార్యదర్శి అజయ్‌ షిర్కేలను తొలగించడం ద్వారా సంస్థ ప్రక్షాళన విషయంలో తనకున్న తిరుగులేని సంకల్పాన్ని సుప్రీంకోర్టు వెల్ల డించింది.

ఇకపై ఆ సంస్థ తీరుతెన్నులను సర్వోన్నత న్యాయస్థానం ఎలా పర్య వేక్షిస్తుందో, అందులో పారదర్శకతను పునరుద్ధరించేందుకు ఏం చర్యలు తీసుకుం  టుందో వేచి చూడాల్సి ఉంది. 70 ఏళ్ల వయసు నిండిన రాజకీయ నాయకులు నాయకత్వ స్థానాల్లో ఉండటం కుదరదని జస్టిస్‌ లోథా కమిటీ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇకపై బీసీసీఐ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. వృద్ధ నేతలు మౌనంగా నిష్క్రమిస్తారా, లేక తమ తమ వర్గాలను వెనకుండి నడి పిస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అలాగే ఒక రాష్ట్రానికి ఒక ఓటు విధానం అమలైతే సంస్థ నాయకత్వం పగ్గాలు ఎవరికి దక్కుతాయన్నది కూడా ఆసక్తికరమే. ఏదేమైనా బీసీసీఐ మళ్లీ ఉన్నత ప్రమాణాలతో, ఉత్కృష్ట విలువలతో విరాజిల్లాలని... ఆరోపణలొచ్చినప్పుడు స్పందించి సరిదిద్దుకునే వ్యక్తిత్వం ఉండా లని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇవన్నీ సాధ్యమైతే క్రికెట్‌ మళ్లీ ‘మర్యాదస్తుల ఆట’గా మన్నన పొంది నిజమైన క్రీడాభిమానులను అలరిస్తుంది. దేశంలో క్రీడా స్ఫూర్తి వెల్లివిరుస్తుంది.


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

చర్చ లేకుండానే ఆమోదం

Sakshi Post

8 Arrested For Exchanging Demonetised Notes Worth Rs 4.41 Crore

The gang was charging 30 per cent commission for exchange of old notes.

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC