అనిశ్చితిలో గల్ఫ్ భారతీయులు | Sakshi
Sakshi News home page

అనిశ్చితిలో గల్ఫ్ భారతీయులు

Published Sun, Nov 29 2015 2:54 AM

అనిశ్చితిలో గల్ఫ్ భారతీయులు

(సెంట్రల్ డెస్క్): గల్ఫ్ దేశాల్లో అలజడి మొదలైంది. ఆయిల్ నిల్వలతో ప్రపంచాన్ని శాసించిన యూఏఈ, ఖతార్, కువైట్, ఒమన్ దేశాలు ఇప్పుడు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుండటమే ఇందుకు కారణం. 2014లో బ్యారెల్ 114 డాలర్లున్న ధర.. తాజాగా 41 డాలర్ల దగ్గర ఆగింది. ఇది తిరిగి పుంజుకుని 75 డాలర్లకు చేరని పక్షంలో.. గల్ఫ్ దేశాల ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారుతుందని, సౌదీ అరేబియా కోలుకోవాలంటే.. బ్యారెల్ ధర కనీసం 100 డాలర్లకు చేరాల్సిందేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి హెచ్చరించింది. దీంతో గల్ఫ్ దేశాలు బడ్జెట్ కుదింపు, సబ్సిడీల తగ్గింపు, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవటంపైనే దృష్టిపెట్టాయి. ఈ దేశాల్లోని కంపెనీలు జీతాలు, ఇంక్రిమెంట్లలో కోత విధించాయి. దీని ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడనుంది.

గల్ఫ్ దేశాల్లోని వివిధ కంపెనీల్లో దాదాపు 70 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. అందులోనూ కేరళనుంచే ఎక్కువమంది ఉన్నారు. వేతనాలు కూడా భారీగానే ఉండటంతో.. సంపాదనలో కొంత భాగాన్ని స్వదేశానికి పంపించేవారు. ఒక్క కేరళైట్లు వాళ్ల బంధువులకు పంపించే డబ్బు.. ఆ రాష్ట్రానికి కేంద్రం చేసే సహాయానికి 5.5 రెట్లు ఉంటుందని తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. తాజా పరిస్థితులతో.. కంపెనీలు జీతాల్లో కోత విధించటం వీరి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇప్పుడిప్పుడే పలు కంపెనీలు ఉద్యోగస్తుల తొలగింపును మొదలుపెట్టాయి.

ఇదే తీవ్రతరమైతే.. పెద్ద సంఖ్యలో భారతీయులు రోడ్డున పడాల్సిందే. దీనికి తోడు గల్ఫ్ దేశాల్లోని అమానుషమైన కార్మిక చట్టాలు.. ఉద్యోగులు కంపనీలు మారేందుకు సహకరించవు. అయితే అక్కడే పనిచేయాలి.. లేదంటే భారత్‌కు తిరిగొచ్చి ఉద్యోగమో, వ్యాపారమో చేసుకోవాలి. ఇప్పటికే నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్న భారత్‌కు గల్ఫ్ దేశాల్లో పరిస్థితి కుదురుకోక.. వారంతా ఇక్కడికి వచ్చేస్తే.. మరిన్ని సమస్యలు తప్పవని ఇందుకు.. ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
Advertisement