త్రైమాసిక ఫలితాలే దిక్సూచి.. | Sakshi
Sakshi News home page

త్రైమాసిక ఫలితాలే దిక్సూచి..

Published Mon, Apr 20 2015 1:15 AM

త్రైమాసిక ఫలితాలే దిక్సూచి..

న్యూఢిల్లీ: విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర బ్లూచిప్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఫలితాలతో పాటు డాలరుతో రూపాయి విలువ కదలికలు, చమురు ధర కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వారన్నారు.  ఇన్ఫోసిస్, హిందుస్థాన్ జింక్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, కెయిర్న్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు క్యూ4 ఆర్థిక ఫలితాలను ఈ వారం వెల్లడిస్తాయని, ఆయా ఫలితాలకు అనుగుణంగా మార్కెట్ హెచ్చుతగ్గులుంటాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మంగ్లిక్ చెప్పారు. అలాగే ఏప్రిల్ 20 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు బడ్జెట్ మలిదశ సమావేశాల్లో జరిగే పరిణామాల్ని ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని, భూ సేకరణ బిల్లు, జీఎస్‌టీ బిల్లులపై మార్కెట్ దృష్టివుందని మాంగ్లిక్ వివరించారు.
 
 ఇప్పటికైతే స్వల్పకాలిక ట్రెండ్ కోసం త్రైమాసిక ఫలితాలపై మార్కెట్ ఆధారపడుతుందని, దాంతో ఆయా షేర్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. మార్కెట్ కరెక్షన్ దశలో వున్నపుడు, ప్రతికూల ఫలితాలు వెల్లడించిన కంపెనీల షేర్ల పతనం అధికంగా వుంటుందని, ఇప్పుడు మార్కెట్ అదే దశలో వుందని మాంగ్లిక్ చెప్పారు. శుక్రవారం మార్కెట్  ముగిసిన తర్వాత వెలువడిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలకు ఈ సోమవారం ప్రారంభసమయంలో మార్కెట్ స్పందిస్తుందన్నారు. 2015 మార్చితో ముగిసిన మూడు నెలలకు రూ. 6381 కోట్ల అత్యధిక లాభాన్ని రిలయన్స్ ప్రకటించడం తెలిసిందే.
 

Advertisement
Advertisement