17న ఎమ్మెల్సీ ఎన్నికలు | Sakshi
Sakshi News home page

17న ఎమ్మెల్సీ ఎన్నికలు

Published Wed, Feb 22 2017 4:53 AM

17న ఎమ్మెల్సీ ఎన్నికలు - Sakshi

ఎమ్మెల్యే కోటా పోలింగ్‌కు షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల సంఘం
- రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి
- రాష్ట్రంలో 3, ఏపీలో 7 స్థానాలకు ఎన్నికలు
- పోలింగ్‌ తేదీ మారే అవకాశం
- స్థానిక ఎమ్మెల్సీల ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలకు ఓటు హక్కు
- ఒకేరోజు రెండు ఎన్నికల్లో ఓటు ఎలా?
- ఈసీకి లేఖ రాస్తామన్న భన్వర్‌లాల్‌


సాక్షి, న్యూఢిల్లీ:
తెలుగు రాష్ట్రాలలో త్వరలో ఖాళీ కానున్న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే పోలింగ్‌ తేదీ మారే సూచనలు కన్పిస్తున్నాయి. స్థానిక సంస్థల నియోజకవర్గాలకు చెందిన ఎన్నికల పోలింగ్‌ కూడా వచ్చేనెల 17న జరగనుండటమే ఇందుకు కారణం.

శాసనసభ్యుల కోటాలో శాసనమండలికి ఎన్నికైన సభ్యులలో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఏడుగురు, తెలంగాణకు చెందిన ముగ్గురు మార్చిలో పదవీ విరమణ చేయనున్నారు. ఏపీకి చెందిన కె.ప్రతిభాభారతి, బి.చెంగల్రాయుడు, సి.రామచంద్రయ్య, ఎం.సుధాకరబాబు, వెంకట సతీష్‌కుమార్‌ రెడ్డి సింగారెడ్డి, పి.జె.సి.శేఖరరావు, మహ్మద్‌ జానీల పదవీకాలం వచ్చేనెల 29వ తేదీన ముగియనుంది. తెలంగాణ ఎమ్మెల్సీలు సయ్యద్‌ అల్తాఫ్‌ హైదర్‌ రజ్వి, ఎం.రంగారెడ్డి, వి.గంగాధర్‌ గౌడ్‌ల పదవీకాలం కూడా మార్చి 29నే ముగియనుంది.

ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాలలో కొత్తవారి ఎన్నిక కోసం ఈ నెల 28 వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. అదే తేదీ నుంచి మార్చి 7 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అయితే ఎమ్మెల్యేల కోటా, స్థానిక సంస్థలు.. ఈ రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకే రోజు రెండు ఎన్నికల్లో ఓటేయడం శాసన సభ్యులకు సాధ్యం కానందున, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ తేదీని మార్చాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు.

మార్చి 18న ‘టీచర్, గ్రాడ్యుయేట్‌’ఓట్ల లెక్కింపు
 ఇదిలా ఉండగా ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని ఎన్నికల కమిషన్‌ మార్చి 18వ తేదీకి మార్పు చేసింది. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పోలింగ్‌ వచ్చే నెల 9వ తేదీన జరగనుంది. ఓట్ల లెక్కింపును మార్చి 15వ తేదీన చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ తొలుత ప్రకటించింది. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు మార్చి 17న పోలింగ్‌ జరుగుతున్నందున అంతకన్నా ముందుగా గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఫలితాలను ప్రకటిస్తే వాటి ప్రభావం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల పోలింగ్‌పై పడుతుందనే భావనతో ఎన్నికల కమిషన్‌ ఈ ఓట్ల లెక్కింపు తేదీని మార్చి 18వ తేదీకి మార్పు చేసింది.

Advertisement
Advertisement