నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

Published Mon, Feb 27 2017 5:09 AM

నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

- వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
- స్వస్తి వచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్న అధికారులు

యాదగిరికొండ: యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. సోమవారం నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పిస్తున్నారు. చలువ పందిళ్లను సిద్ధం చేశారు. ఆలయంలో తోపులాట జరగకుండా పోలీసు సిబ్బందిని కేటాయించారు. భక్తుల కోసం సుమారు 1 లక్ష చిన్న లడ్డూలు, 50 వేల పెద్ద లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నారు. క్యూలైన్లలో భక్తులకు వలంటీర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయనున్నారు. బాలాలయం చుట్టూ విద్యుద్దీపాలతో అందంగా అలంకరిస్తున్నారు.

ఘాట్‌ రోడ్డుకు ఇరువైపులా వీధి దీపాలు వేస్తున్నారు. ఆలయంలో హోమ గుండాలను ఏర్పాటు చేశారు. గజ, హనుమంతం, కల్పవృక్షం, శేష, తదితర వాహన సేవలకు పాలిషింగ్‌ చేశారు. నిత్యం 1500 మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలను, గదులను పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రామాయణ, మహాభారత, భాగవత, ఇతిహాసాల పారాయణాల కోసం 75 మంది రుత్విక్కులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. ఉత్సవాల నిర్వహణ కోసం 11 రోజుల పాటు ఆలయ అర్చకులకు, అధికారులకు సెలవులను రద్దు చేశారు.

‘యాదాద్రి’లో భక్తుల రద్దీ
దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సుమారు 25వేల మంది భక్తులు స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు.


Advertisement
Advertisement