తొలి రోజు గరంగరం | Sakshi
Sakshi News home page

తొలి రోజు గరంగరం

Published Mon, Aug 31 2015 2:41 PM

తొలి రోజు గరంగరం - Sakshi

ఆంధ్రప్రదేశ్ శాససభ సమావేశాలు తొలి రోజు వాడివేడిగా జరిగాయి. అధికార, విపక్షాల పరస్పర ఆరోపణలతో అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ గట్టిగా పట్టుబట్టడంతో సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాపై ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడిన కొద్ది సేపటి తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడింది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చర్చించేందుకు వైఎస్సార్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభ ప్రారంభంకాగానే స్పీకర్ తిరస్కరించారు. ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టినా స్పీకర్ పట్టించుకోలేదు. తర్వాత సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారికి, ప్రత్యేక హోదా ప్రాణత్యాగం చేసిన సంతాపం తెలుపుతూ సభ తీర్మానాలు ఆమోదించింది.

తొక్కిసలాటలో 29 మంది మృతికి కారణమైన చంద్రబాబు సంతాప తీర్మానం ప్రవేశపెట్టడం పట్ల ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ మాట్లాడుతుండగా స్పీకర్ పదే పదే మైక్ కట్ చేశారు. విపక్ష నేత ప్రశ్నలతో ప్రభుత్వం ఇరుకున పడడంతో జగన్ పై మంత్రులు వ్యక్తిగత దూషణలకు దిగారు. మంత్రుల వ్యాఖ్యలకు వైఎస్సార్ సీపీ సభ్యులు అభ్యంతరం తెలపడంతో స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.

సభ తిరిగి సమావేశమైన తర్వాత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దీనిపై విపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రశ్నోత్తరాలు కొనసాగించడాన్ని తప్పుబట్టాయి. ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టాయి. దీంతో సభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత 1.30 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వివరణ ఇచ్చేందుకు తమకు సమయం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ సభ్యులు కోరినా స్పీకర్ తిరస్కరించారు. తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు.

Advertisement
Advertisement