భారతీయ విద్యార్థులకు ఫీజు మాఫీ | Sakshi
Sakshi News home page

భారతీయ విద్యార్థులకు ఫీజు మాఫీ

Published Fri, Apr 24 2015 5:13 PM

భారతీయ విద్యార్థులకు ఫీజు మాఫీ - Sakshi

మిస్సోరీ స్టేట్ యూనివర్సిటీ వెల్లడి


మిస్సోరీ స్టేట్ యూనివర్సిటీ (అమెరికా)లో చదువుతున్న భారతీయ విద్యార్ధుల్లో ప్రతిభావంతులకు నాన్-రెసిడెంట్ ఫీజు మాఫీ చేస్తున్నట్టు ఎంఎస్‌యు ఉపాధ్యక్షుడు స్టీఫెన్ హెచ్ రాబినెట్ వెల్లడించారు. ఫీజు మాఫీ ద్వారా భారతీయ విద్యార్ధులకు ఆరు వేల డాలర్ల (సుమారు రూ. 3.81 లక్షల) లబ్ది చేకూరనుందన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిస్సోరీ అవుట్‌రీచ్ గ్రాడ్యుయేట్ ఆపర్చునిటీ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు ఉపకార వేతనాలను అందించనున్నట్టు వెల్లడించారు.

ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్, తెలంగాణ), మమతా డెంటల్ కళాశాల (ఖమ్మం, తెలంగాణ), విష్ణు డెంటల్ కళాశాల (భీమవరం, ఆంధ్రప్రదేశ్), మద్రాస్ క్రిస్టియన్ కళాశాల, బి.ఎస్.అబ్దుల్ రహమాన్ యూనివర్సిటీ, శ్రీరామస్వామి మెమోరియల్ యూనివర్సిటీ, ఆర్‌ఎంకే గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల, సవిత యూనివర్సిటీ (చెన్నై),  బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (గ్రేటర్ నోయిడా, యూపీ)తో తమ భాగస్వామ్యం ఉందని వివరించారు.

ప్రస్తుతం ఎంఎస్‌యూలో 23 వేల మంది విద్యార్ధులు ఉన్నారని, వీరిలో 1,500 మంది అంతర్జాతీయ విద్యార్ధులని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతీయ విద్యార్ధుల సంఖ్య 30కి పైనే ఉందన్నారు. గత ఏడాది భారతీయ విద్యార్ధుల నుంచి 150 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈ సంఖ్యను రానున్న కొద్ది రోజుల్లో 300 నుంచి 400 వందల వరకు పెంచుతామని రాబినెట్ చెప్పారు.

Advertisement
Advertisement