సీబీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం | Sakshi
Sakshi News home page

సీబీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Published Thu, Nov 27 2014 12:54 AM

సీబీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

* ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టానికి సవరణ
* ప్రతిపక్షాల్లో అతిపెద్ద పార్టీ నేతకు ఎంపిక కమిటీలో స్థానం
* ‘కోరమ్’ సవరణపై కాంగ్రెస్ అభ్యంతరం.. తోసిపుచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సవరణ బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ ప్రవేశపెట్టిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్(సవరణ) బిల్లు-2014ను మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. సీబీఐ చీఫ్ ఎంపిక కమిటీలో ప్రతిపక్షాల్లో అతిపెద్ద పార్టీ నేతకు స్థానం కల్పిస్తూ ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టానికి సవరణతో ఈ బిల్లును రూపొందిం చారు. సీబీఐ చీఫ్ ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. అయితే లోక్‌సభలో ప్రతిపక్ష నేత లేని పక్షంలో ఆయన స్థానంలో విపక్షాల్లో అతిపెద్ద పార్టీ నేతకు అవకాశం కల్పించేందుకు తాజా బిల్లు అవకాశం కల్పిస్తుంది.

అయితే సెలెక్షన్ కమిటీలో ఏ ఒక్క సభ్యుడు లేకున్నా (కోరమ్ లేకుంటే) ఎంపిక ప్రక్రియకు విఘాతం కలగకూడదన్న సవరణను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేందుకు, అతిపెద్ద ప్రతిపక్ష పార్టీని ఎంపిక ప్రక్రియకు దూరంగా ఉంచేందుకే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. తాజా నిర్ణయం ప్రమాదకరమైనదని, రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును ఉపసంహరించుకుని సమగ్రమైన బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఖర్గేకు బీజేడీ సభ్యులు తథాగత్ సత్‌పతి, భర్తృహరి మహ్తాబ్ మద్దతు తెలిపారు. ఎంపిక ప్రక్రియ సజావుగా సాగాలనే ఈ బిల్లు తీసుకొచ్చామని మంత్రి జితేంద్రసింగ్ చెప్పారు. ఇలాంటి నిబంధనలు లోక్‌పాల్, సీవీసీ, నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ చట్టాల్లో ఉన్నాయన్నారు. సీబీఐను బలోపేతం చేసేందుకే ఈ బిల్లును తీసుకొచ్చినట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు.
 

Advertisement
Advertisement