అంచనా వ్యయం రూ. 3,212 కోట్లు | Sakshi
Sakshi News home page

అంచనా వ్యయం రూ. 3,212 కోట్లు

Published Sat, Aug 23 2014 2:36 AM

అంచనా వ్యయం రూ. 3,212 కోట్లు - Sakshi

  • మన జిల్లా - మన ప్రణాళిక ఖరారు
  •  తొలుత రూ.81.13 కోట్లతో పనుల ప్రతిపాదనలు
  •  ఇతర జిల్లాలను అనుసరిస్తూ తుది జాబితా తయూరు
  •  భారీగా పెరిగిన అంచనాలు
  •  రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేత
  • సాక్షి, హన్మకొండ : జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ‘మన జిల్లా-మన ప్రణాళిక’ ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ పాలకమండలి, అధికారులు తుది ప్రతిపాదనలు రూపొందించారు. వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించి మొదటి ప్రాధాన్యత అంశాలుగా 50 పనులను ఎంపిక చేశారు. ఈ పనులు చేపట్టేందుకు రూ.3,212 కోట్ల వ్యయం అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు మన జిల్లా- మన ప్రణాళిక తుది జాబితాను జిల్లా అధికారులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. బడ్జెట్ రూపకల్పనలో ఈ జాబితాను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నిధులు కేటాయించనుంది.
     
    రూ.81.13 కోట్ల నుంచి రూ.3,212 కోట్లు...

     
    ప్రజల అవసరాలు, ఆకాంక్షలు ప్రతిబింబించేలా రాష్ట్ర ప్రభుత్వం మన  జిల్లా-మన ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జూలై 27న తొలి పాలకమండలి సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా జిల్లాలోని 50 మండలాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీటీసీ సభ్యులు అందరూ కలిపి 1,557 పనులను సూచించారు. అయితే... రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక్క పనిని మాత్రమే మన జిల్లా-మన ప్రణాళికలో చేర్చాలని సూచించింది. దీంతో తొలి విడతలో రూ.81.13 కోట్ల అంచనా వ్యయంతో ప్రతి మండలం నుంచి ఒక పని వంతున 50 పనులను ఎంపిక చేశారు.

    ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలిన జిల్లాలు సమర్పించిన జాబితాలో ఒకే రకమైన పనులన్నింటీని ఒకదానిగానే పరిగణించారు. ఉదాహరణకు ఆరోగ్య విభాగానికి సంబంధించి అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఒకే పనిగా పేర్కొంటూ మన జిల్లా-మన ప్రణాళిక జాబితాను సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రణాళికలు రూ. 2,500 కోట్లను దాటాయి. దీంతో వరంగల్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ, జిల్లాపరిషత్ అధికారులు రూ.81.13 కోట్లతో తొలుత సమర్పించిన ప్రణాళికను రద్దు చేశారు. ఒకే విధమైన పనులను ఒకేదానిగా పేర్కొంటూ రూ 3,212 కోట్ల అంచనా వ్యయంతో కొత్త ప్రణాళికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.

    ప్రభుత్వానికి సమర్పించిన జాబితా ప్రకారం...

    ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల అభివృద్ధితోపాటు కొత్త రోడ్ల నిర్మాణానికి జిల్లా ప్రణాళికలో ప్రాధాన్యం లభించింది.  జిల్లాలోని 50 మండలాల్లో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో పాత బీటీ రోడ్ల అభివృద్ధికి రూ.384 కోట్లు... 47 మండలాల్లో కొత్త బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.78.68 కోట్లు అవసరమవుతాయని ప్రణాళికలో పేర్కొన్నారు. వీటితోపాటు కేసముద్రం, ఖానాపూర్ మండలాల్లో రోడ్ల అభివృద్ధికి రూ.80 కోట్లు.. మద్దూరు, మహబూబాబాద్, మరిపెడకు రూ.79.76 కోట్లు... నర్మెట, నర్సంపేటకు రూ.62.22 కోట్లు... నెక్కొండకు రూ.66.06 కోట్లు... నెల్లికుదురు, పాలకుర్తి, పరకాలకు రూ.94.57 కోట్లు... రాయపర్తి, రేగొండ, సంగెం మండలాల్లో రూ.51.61 కోట్లతో వివిధ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు  అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో తాగునీటి పనులకు రూ.709 కోట్లు అవసరమవుతాయని ప్రణాళికలో పొందుపరిచారు.
         
    జిల్లాలో 25 మండలాల పరిధిలోని చెరువులు, తూముల మరమ్మతులకు రూ.99.35 కోట్లు,  మరో 25 మండలాల్లో చెరువుల అభివృద్ధికి రూ.97 కోట్లు కేటాయించారు. జిల్లాలోని ప్రతి మండలంలో భూసార పరీక్ష కేంద్రాలను నెలకొల్పేందుకు రూ.320 కోట్లు... పది మండలాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయూల కోసం రూ.410 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదించారు.
         
    32 మండలాల్లో గ్రామపంచాయతీల భవనాల నిర్మాణానికి రూ 99 కోట్లు... 50 మండలాల్లో డివిజన్ పంచాయతీ ఆఫీస్ భవనాలకు రూ 23.30 కోట్లు... 18 మండలాల్లో మండల సమాఖ్య భవనాలు, మార్కెటింగ్ గోదాంలకు రూ 44.81 కోట్లు అవసరమని జిల్లా ప్రణాళికలో ప్రతిపాదించారు.
         
    వైద్యరంగంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు రూ.173.39 కోట్లు... విద్యారంగానికి రూ.69.32 కోట్లు... రీజనల్ సైన్స్ సెంటర్ అభివృద్ధికి రూ 5.50 కోట్లు... జిల్లాలో పర్యాటక ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులకు రూ.38.25 కోట్లు  జిల్లా ప్రణాళికలో పేర్కొన్నారు. వీటితోపాటు ఒక్కో చోట రూ.25 కోట్ల వ్యయంతో స్టేషన్‌ఘన్‌పూర్, డోర్నకల్, ములుగు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో బస్‌డిపోలు నిర్మించాలని పేర్కొన్నారు. క్రీడలకు సంబంధించి 50 మండలాల్లో యూత్ వెల్ఫేర్ హాస్టళ్లను నెలకొల్పేందుకు రూ.149 కోట్లు కావాలని మన జిల్లా-మన ప్రణాళికలో పేర్కొన్నారు.
     

Advertisement
Advertisement