కొత్తగా 14 జిల్లాలు | Sakshi
Sakshi News home page

కొత్తగా 14 జిల్లాలు

Published Wed, Sep 2 2015 1:34 AM

కొత్తగా 14 జిల్లాలు

కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం
జిల్లాల ఏర్పాటుపై నేడు కే బినెట్ భేటీలో చర్చ
ఏపీ డిస్ట్రిక్ట్ ్స (ఫార్మేషన్) చట్టాన్ని వర్తింపజేయడంపై నిర్ణయం
మరో పది వేల ఉద్యోగాలు, నూతన మద్యం విధానంపై చర్చ
ప్రాజెక్టుల ఎస్కలేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపైనా చర్చ


హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందుకు అనుగుణంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం-1974ను తెలంగాణకు వర్తింపజేయాలని భావిస్తోంది. తెలంగాణ డిస్టిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్-2015 పేరుతో స్వల్ప మార్పులతో ఈ చట్టాన్ని అమలు చేయనుంది. బుధవారం మధ్యాహ్నం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రెండు నెలల తర్వాత జరుగుతున్న కేబినెట్ భేటీ కావటంతో పలు కీలకమైన అంశాలు ఇందులో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను పునర్విభజించి 14 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. సీఎం కె.చంద్రశేఖర్‌రావు వివిధ జిల్లాల్లో పర్యటనల సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై హామీ ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యానికి వీలుగా జిల్లాల సంఖ్యను పెంచనున్నారు. ఈ నేపథ్యంలో చట్టం అమల్లోకి తీసుకురావటం ద్వారా కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. ప్రస్తుతమున్న ప్రతిపాదనల ప్రకారం.. మెదక్ జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో వనపర్తి, నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాలో సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో  భద్రాచలం, ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, వరంగల్ జిల్లాలో జనగామ, ఆచార్య జయశంకర్ పేరిట భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల కొత్త జిల్లాలుగా ఏర్పడతాయి. రంగారెడ్డి జిల్లాకు బదులుగా వికారాబాద్‌ను జిల్లాగా మార్చటంతోపాటు హైదరాబాద్‌ను నాలుగు జిల్లాలుగా మార్చే ఆలోచనలున్నాయి. దశలవారీగా వీటిని పునర్విభజించాలని.. తొలిదశలో జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న వాటిని  కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

 చీప్ లిక్కర్‌పై చర్చ
 కొత్తగా అమల్లోకి తీసుకురానున్న మద్యం విధానంపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసిన ఈ ఫైలును అధికారులు కేబినెట్ ఆమోదానికి పంపారు. రూ.15, రూ.30 బాటిళ్లలో చీప్ లిక్కర్‌ను విక్రయించాలనే నిర్ణయం ప్రభుత్వం తుది పరిశీలనలో ఉంది.

 మరో పది వేల ఉద్యోగాలపై..
 ఈ ఏడాది 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రకటించారు. జూలైలో 15,552 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. మిగతా పది వేల పోస్టుల భర్తీకి లక్షలాది మంది నిరుద్యోగులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్న ఈ ఫైలుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది.


కేబినెట్‌లో చర్చకు రానున్న మరిన్ని అంశాలు..
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 25 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ఎస్కలేషన్ పెంపు చేయాలనే ప్రతిపాదనలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ల మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా చర్చ జరిగే అవకాశముంది.
వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ల నియామకానికి రిజర్వేషన్లపై చర్చించనున్నారు.
 ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కరువు భత్యం (డీఏ)పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచాలనే డిమాండ్‌పై చర్చ జరగనుంది.
 
ప్రతిపాదిత జిల్లాలు
 
మెదక్ జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి
మహబూబ్‌నగర్ జిల్లాలో వనపర్తి, నాగర్‌కర్నూల్
నల్లగొండలో సూర్యాపేట..
వరంగల్‌లో జనగామ, ఆచార్య జయశంకర్ పేరిట భూపాలపల్లి
ఖమ్మంలో భద్రాచలం
కరీంనగర్‌లో జగిత్యాల..
ఆదిలాబాద్‌లో మంచిర్యాల
హైదరాబాద్ ను 4 జిల్లాలుగా.. రంగారెడ్డికి బదులుగా వికారాబాద్‌ను జిల్లాగా మార్చాలన్న ప్రతిపాదనా ఉంది
 
 

Advertisement
Advertisement