తెలంగాణ వచ్చింది.. మనకేమొచ్చింది ! | Sakshi
Sakshi News home page

తెలంగాణ వచ్చింది.. మనకేమొచ్చింది !

Published Thu, Apr 20 2017 4:12 AM

తెలంగాణ వచ్చింది.. మనకేమొచ్చింది !

♦ ఉరికినోళ్లు ఎల్లక్కల పడ్డరు
♦ ఉరకనోళ్లు పదవులు పొందారు
♦ త్యాగాలు మావే.. పాలన మాదే..
♦ అంబేద్కర్‌ ఆశయ స్ఫూర్తితో ముందుకు సాగాలి
♦ మహనీయుల జయంతి కార్యక్రమంలో గద్దర్‌


డిచ్‌పల్లి (నిజామాబాద్‌ రూరల్‌ ):
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో ఆనాడే ఆర్టికల్‌ 3 పొందుపర్చారని, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ అంబేద్కర్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి వర్సిటీ మైదానంలో నిర్వహించిన మహనీయుల జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో రెండే రకాల మనుషులున్నారని, ఒకరు జందెం వేసే వారు, మరొకరు జందెం వేయని వారని అన్నారు. మూడు శాతం ఉన్న వర్గం వారు 97 శాతం ఉన్న వర్గం వారిపై అధికారం చెలాయిస్తున్నారని అన్నారు. అందుకే త్యాగాలు మావే.. పాలన మాదే.. అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన బిడ్డలకు రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలాంటి ప్రయోజనం దక్కలేదన్నారు. తెలంగాణ వచ్చింది... మనకేం వచ్చిందని ప్రశ్నించుకోవాలన్నారు. ఆనాడు రాష్ట్ర సాధన కోసం ఉరికినోళ్లు ఎల్లకల్ల పడ్డారని, ఉరకనోళ్లు పదవులు సాధించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతి త్వరలో త్యాగాలు చేసిన వారందరూ ఏకమవుతారని, త్యాగాల తెలంగాణ లాంటి పార్టీ ఏర్పడుతుందన్నారు. తన తండ్రి అంబేద్కర్‌ ఆశయవాది అని, తాను చదువుకునే సమయంలో కూలీ పని చేసి చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం ఇంజనీరింగ్‌ చదువు వదిలేసి పోరాటంలోకి వచ్చానని, తన తల్లి కన్నీరు పెట్టుకున్నా  విన్పించుకోలే దన్నారు. ప్రజాఉద్యమం పేరిట ఎన్నో జెండాలు చేతపట్టానని,
అజ్ఞాత వాసంలో ఉన్నానని, తన శరీరంలో ఆరు బుల్లెట్లు దిగాయన్నారు.

ప్రస్తుతం అన్ని జెండాలు వదిలి పంచశీల జెండా (బుద్దిజం) చేతపట్టానని అన్నారు.  అక్షరం అంటరానితనం నుంచి మనిషిని విముక్తం చేస్తుందని అంబేద్కర్‌ నమ్మారని పేర్కొన్నారు. మనిషిని మనిషిగా గుర్తించాలని ప్రశ్నించిన మహనీయుడిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆయన రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్‌ 3 ప్రకారమే తెలంగాణ ఏర్పాటు సాధ్యమయిందన్నారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు కేవలం ముగ్గురు ఉన్నా, తెలంగాణ బిల్లుపై చర్చ నడిచిన సమయంలో పార్టీ అధినేత కేసీఆర్‌ పార్లమెంట్‌కు హాజరు కాలేదని అన్నారు. తెలంగాణ ఏర్పడినా పాలన పైనుంచి సాగడంతో త్యాగాలు చేసిన వారికి, కిందిస్థాయి వర్గాల వారికి  ఎలాంటి ప్రయోజనం కలుగడం లేదన్నారు.

రెండు వందల సంవత్సరాల క్రితమే చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని నమ్మి, మహిళలకు చదువు నేర్పిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని అన్నారు. చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలేను విద్యార్థినులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బహుజన బాంధవుడు కాన్షీరాం రాజ్యాధికారంతోనే బహుజనుల బతుకులు బాగు పడతాయని నమ్మారని అన్నారు. అంబేద్కర్, జ్యోతిబాఫూలే, కాన్షీరాంలు భావ విప్లవం కోరుకున్నారని వివరించారు. విద్యార్థులు మద్యం జోలికి వెళ్లకుండా చదువుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. చదువుతోనే ఏదైనా సాధించవచ్చన్నారు. టీవీ, సెల్‌ఫోన్‌లు మనిషిని రోబోలుగా మార్చాయన్నారు.

కార్యక్రమంలో బహుజన మేథావి కదిరె కృష్ణ, దళిత శక్తి ప్రోగ్రాం కన్వీనర్‌ విశారదన్, ఎస్‌ఎస్‌డీ సౌత్‌ ఇండియా కన్వీనర్‌  దిగంబర్‌ కాంబ్లే, అంబేద్కర్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజేందర్, కన్వీనర్‌ గజానంద్, సభ్యులు, ఓయూ జేఏసీ నాయకుడు రాజారాం యాదవ్, టూటా అధ్యక్షుడు మామిడాల ప్రవీణ్, దళితరత్న అవార్డు గ్రహీత లింగన్న, విద్యార్థి నాయకులు పులి జైపాల్,  అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement