ఆసరాపై ఆంక్షలు | Sakshi
Sakshi News home page

ఆసరాపై ఆంక్షలు

Published Wed, Dec 17 2014 2:10 AM

Support for sanctions

మేడిపెల్లి/పెద్దపల్లిరూరల్: ‘అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు, ఆహారభద్రత కార్డులు అందజేస్తాం.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..’ సీఎం కె.చంద్రశేఖరరావు మొదలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు పదే  పదే చెబుతున్న మాటలివి. కానీ ఆచరణలో ఇందుకు విరుద్ధంగా జరగుతోంది. జిల్లాలోని ఇరవై మండలాలు, ఐదు మున్సిపాలిటీల్లో గతంలో ఉన్న పింఛన్ల కంటే ఎక్కువ పింఛన్లు మంజూరు చేయడంతో సర్కారు సంబంధిత అధికారులపై కన్నెర్రజేసింది. అదనపు పింఛన్లు ఎందుకు మంజూరు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వడంతో పాటు రీసర్వే నిర్వహించి పింఛన్ల సంఖ్యను తగ్గించాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
 
 రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకంలో లబ్దిదారుల సంఖ్యను కుదించేందుకు తంటాలు పడుతోంది. ఎన్నికల సమయంలో వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్ ఇస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేయడం సర్కారుకు కత్తిమీదసాములా తయారైంది. మొన్నటిదాకా రోజుకో నిబంధన, పూటకో మాటతో పింఛన్ దరఖాస్తుదారులతో పాటు అధికారుల్లో తీవ్ర గందరగోళం సృష్టించింది. ఎట్టకేలకు పింఛన్ల జాబితా ఖరారు కావడంతో జిల్లాలో పదిహేను రోజుల నుంచి అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించిన పింఛన్లను అధికారులు పంపిణీ చేస్తున్నారు.
 
 ఈ తరుణంలో జిల్లాలోని ఇరవై మండలాలు, ఐదు మున్సిపాలిటీల్లో పాత పింఛన్ల సంఖ్యకు మించి కొత్త పింఛన్లు మంజూరు చేశారని, అధికంగా పింఛన్లు ఎందుకు ఇచ్చారో సంజాయిషీ ఇచ్చుకోవాలని కలెక్టర్ నుంచి అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. సంబంధిత మండలాలు, మున్సిపాలిటీల్లో వెంటనే పింఛన్ల సంఖ్యను తగ్గించాలని జీవో నంబర్ బీ5/329/2014 ద్వారా సోమవారం అన్ని మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. దీంతో అధికారులు ఆగమేఘాల మీద ఆయా గ్రామాల్లో రీసర్వే ప్రారంభించారు.
 
  పెద్దపల్లి మండలంలోని ఏడు గ్రామాల్లో గతంలో మంజూరైన పింఛన్ల కన్న ఇరవై శాతం మేర పింఛన్లు ఎక్కువగా మంజూరు చేసినట్లు గుర్తించారు. మండలంలోని నిట్టూరు, రాగినేడు, పెద్దకల్వల, గుర్రాంపల్లి, రంగంపల్లి, పాలితం, చందపల్లి గ్రామాల్లో మంగళవారం రీసర్వే చేపట్టారు. పెద్దపల్లి ఆర్డీఓ నారాయణరెడ్డి, ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్‌రెడ్డి రాగినేడు, నిట్టూరు, పెద్దకల్వల గ్రామాల్లో రీసర్వే తీరును పరిశీలించారు.
 
  మూడేళ్లుగా వితంతు పింఛన్లు మంజూరు లేని కారణంగా ఈసారి కొత్తగా ఆ పింఛన్లు మంజూరు చేయడంతో లబ్దిదారుల సంఖ్య పెరిగినట్టు అధికారులు గుర్తించారు. సదరు గ్రామాల్లో రీసర్వేలోనూ అన్నీ సక్రమమేనని తేలినట్లు ఓ అధికారి వివరించారు. కాగా.. పింఛన్ మంజూరైన లబ్దిదారుల్లో రీసర్వేలో తమ పేరు ఉంటుందా.. పోతుందా అన్న ఆందోళన మొదలైంది. కొత్తగా మంజూరు కోసం ఎదురుచూస్తున్న వారిలోనూ ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇదివరకే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొని ఆన్‌లైన్ సమస్యతో పింఛన్ రాని లబ్దిదారులు ఎంతోమంది ఉన్నారు. జిల్లాలో ఆన్‌లైన్ డాటా ఎంట్రీ నిలిచిపోవడం, ఇదివరకు ఉన్న పింఛన్లను రీసర్వే చేయించడానికి ప్రత్యేకాధికారులను నియమించడంతో వారిలోనూ ఆందోళన మొదలైంది. అర్హులందరికీ పింఛన్ ఇస్తామంటున్న ప్రభుత్వం ఇలాంటి నిబంధనలు ఎందుకు పెడుతుందో అర్థం కావడం లేదని పలువురు వాపోతున్నారు.
 

Advertisement
Advertisement