నేటినుంచి ప్రత్యేక కార్యక్రమాలు | Sakshi
Sakshi News home page

నేటినుంచి ప్రత్యేక కార్యక్రమాలు

Published Fri, Nov 28 2014 4:18 AM

Special Events from today

* వికలాంగుల దినోత్సవం సందర్భంగా.. మండల, జిల్లాస్థాయిలో పోటీలు
* ప్రత్యేక అవసరాలుగల పిల్లలు, వారి తల్లిదండ్రులకు
* సాధారణ పిల్లలతోపాటు ఉపాధ్యాయులకు కూడా..

చిలుకూరు : ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రతి యేటా ప్రపంచ వికలాంగుల దినోత్పవం సందర్భంగా ప్రత్యేక అవసరాల పిల్లలకు మాత్రమే ఒక్క రోజు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసేవారు. కానీ ఈ ఏడాది నుంచి కార్యక్రమాల నిర్వహణలో మార్పులు చేశారు. వారం రోజుల పాటు ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు అలాగే సాధారణ పిల్లలు, ఉపాధ్యాయులకు కూడా మండల జిల్లా స్థాయిలో వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు.
 
నేడు ఉపాధ్యాయులకు..
మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శుక్రవారం వివిధ అంశాలలో పోటీలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు ‘ప్రత్యేక అవసరాలు గల  పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలు’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు, సహిత విద్యలో ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపై వకృ్తత్వ పోటీలు , ప్రత్యేక అవసరాల పిల్లల స్థితిగతులపై క్రియేటివ్ ఆర్ట్ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలలో గెలుపొందిన ఉపాధ్యాయులు వచ్చే నెల ఒకటవ తేదీన జిల్లా స్థాయిలో నల్లగొండలోని సర్వశిక్ష అభయాన్‌లో నిర్వహించే పోటీలలో పాల్గొనాలి.
 
డిసెంబర్ 2వ తేదీన పిల్లలకు పోటీలు
* వచ్చే నెల 2వ తేదీన ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో పాటు సాధారణ పిల్లలను కలిపి ఆటల పోటీలు నిర్వహిస్తారు.  
* త్రోబాల్, రింగ్స్ వేయడం, బోర్డు గేమ్, బ్యాలెన్స్ వాక్, రంగోలి, డ్రాయింగ్, పెయింటింగ్, పాటల పోటీలు నిర్వహిస్తారు. బుట్టలో బంతి వేయడం, సరళమైన ఆటలు నిర్వహిస్తారు.
 
3న తల్లిదండ్రులకు కూడా..
వచ్చే నెల 3వ తేదీన ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులకు కూడా పలు రకాల ఆటలు పోటీలు నిర్వహిస్తారు .  రన్నింగ్, రంగోలి, పాటలు, డ్యాన్స్‌ల పోటీలు నిర్వహిస్తారు.  కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించేందుకు మండలానికి ప్రత్యేకంగా రూ. 10 వేల చొప్పున కేటాయించారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని ఎంఈఓలకు పూర్తి స్థాయిలో సమాచారం అందించారు.

Advertisement
Advertisement