అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

Published Tue, Apr 15 2014 12:07 AM

should take inspiration ambedkar

సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని పాతబస్టాండ్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు  కేజీ నుంచి పీజీ వరకు విద్యావకాశాలను కల్పించడంతో పాటు అర్హులైన విద్యార్థులకు హాస్టల్ వసతిని కల్పించడం జరిగిందన్నారు.

 ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. జిల్లాలో నిరక్షరాస్యతా శాతం రోజురోజుకు తగ్గిపోతోందన్నారు.  దళిత సంఘాల నాయకులు సామాజిక సేవా దృక్పథంతో బడికి దూరంగా ఉన్న పిల్లలను బడిలో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ఆంగ్ల బాషవైపు మొగ్గు చూపడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని అందుకు ప్రతి మండల కేంద్రంలో ఆంగ్ల భాషలో బోధించేందుకు మోడ ల్ పాఠశాలలను ప్రారంభించడం జరిగిందని ఈ పాఠశాలలో 6 నుంచి ఇంటర్ వ రకు హాస్టల్ వసతితో పాటు ఆంగ్ల భాషలో బోధించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి పాఠశాలలోనే ఉండాలని అంతే తప్ప పనిలో ఉండరాదని సూచించారు. అదనపు ఎస్పీ మధుమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కుల వివక్షత ఎక్కడైనా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

 ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. కార్యక్ర మంలో డీఆర్వో దయానంద్, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు సత్యనారాయణతో పాటు దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో  నిర్వహించిన జయంతి కార్యక్రమంలో అదనపు జేసీ మూర్తి హాజరయ్యారు. అనంతరం ఏజేసీ మాట్లాడుతూ అంబేద్కర్  కృషి ఫలితంగానే విద్యావకాశాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారన్నారు. గ్రామీణ వికాస్ బ్యాంక్ జిల్లా కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంజీవరావు అంబేద్కర్  సేవలను కొనియాడారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ప్రధాన కార్యదర్శి అడివయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Advertisement
Advertisement