ఐస్ బకెట్ చాలెంజ్ కు 'రైస్ బకెట్' సవాల్! | Sakshi
Sakshi News home page

ఐస్ బకెట్ చాలెంజ్ కు 'రైస్ బకెట్' సవాల్!

Published Sun, Aug 24 2014 4:21 PM

ఐస్ బకెట్ చాలెంజ్ కు 'రైస్ బకెట్' సవాల్!

హైదరాబాద్:ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలంతా ఐస్ బకెట్ చాలెంజ్ లో మునిగి తేలుతుంటే.. ఒక తెలుగు మహిళ ఆ చాలెంజ్ కే సవాల్ విసిరింది. అసలు ఐస్ బకెట్ ఛాలెంజ్ కంటే రైస్ బకెట్ ఛాలెంజే ముద్దు అంటోంది. ఐస్ బకెట్ ఛాలెంజ్ ఒక వైరస్ లా విస్తరించిన సమయంలో రైస్ బకెట్ ఛాలెంజ్ ను ఆరంభించడానికి సిద్ధమయ్యారు మంజు లతా కళానిధి.  దీనికి ఫేస్ బుక్ ను వారధిగా ఎంచుకున్నారు. దీనికి అంతా కలిసి రావాలని విన్నవించారు. ఈ రైస్ బకెట్ ఛాలెంజ్ తో పేద ప్రజలకు సాయం చేసే అవకాశం దక్కుతుందని ఆమె ఆశిస్తున్నారు. ఎవరైతే పేద ప్రజలకు సాయం చేయాలనుకుంటున్నారో వారు రైస్ బకెట్ ఛాలెంజ్ లో పాల్గొనాలని తెలిపారు. ప్రస్తుతం ఈ రైస్ బకెట్ చాలెంజ్ ఇప్పడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.
 

అమియోట్రోపిక్ లేటరల్ స్ల్కెరాసిస్(ఎఎల్‌ఎస్) అనేది నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే వ్యాధి. దీనివల్ల మనిషి జీవచ్ఛవంలా మారతాడు. మన దేశంలో అంతగా కన్పించని ఈ వ్యాధి, కొన్ని పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతోందట. ఇంతవరకు దీనికి కారణాలు కనుక్కోలేదు. ఈ ఛాలెంజ్ తో  ప్రపంచవ్యాప్తంగా చైతన్యం తీసుకువచ్చి ఆ వ్యాధి పరిశోధనకు విరాళాలే సేకరించడమే ఈ చాలెంజ్ ప్రధాన ఉద్దేశం.

అయితే.. రైస్ బకెట్ చాలెంజ్ ఉద్దేశం మాత్రం పేదలకు భోజన సదుపాయంతో పాటు, రోగులకు మందులు సమకూర్చడమే. దీనికి ఆమె ఫేస్ బుక్ ద్వారా స్నేహితుల సాయం కోరుతున్నారు. ఆ ఆహారాన్ని సొంతంగా తయారు చేసి కానీ, కొనుగోలు చేసి అయినా కానీ పేదలకు అందజేయవచ్చు. ఒకవేళ రోగులకు సాయం చేయాలనుకుంటే మాత్రం ఒక్కొక్కరూ కనీసం రూ.100 తక్కువ కాకుండా మందులను ఇవ్వొచ్చు.

సామాజిక చైతన్యం కల్గించడానికి ఎన్ని చాలెంజ్ లు ప్రవేశపెట్టినా ఫర్వాలేదు గానీ.. మరి సాయం చేయడానికి ఎన్ని చేతులు కలుస్తాయో వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement