రబీకి గండం | Sakshi
Sakshi News home page

రబీకి గండం

Published Sat, Nov 1 2014 4:43 AM

రబీకి గండం - Sakshi

గతేడాది నీటితో నిండు కుండల్లా కనిపించిన ప్రాజెక్టులు ఈసారి వర్షాభావంతో వెలవెలబోతున్నాయి. జిల్లా వరప్రదాయని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈసారి కనీస వరద నీరు కూడా చేరలేదు. ఫలితంగా రెండు పంటలకు నీరందించాల్సిన ప్రాజెక్టు.. ఒక్క పంటకు కూడా నీరందించలేని దుస్థితిలో ఉంది.
 

 తిమ్మాపూర్ :
 ఖరీఫ్ సీజన్‌ను కన్నీటితో ముగిస్తున్న రైతులను రబీ సీజన్ బెంబేలెత్తిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేక... 90 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ సారి చుక్క వరద నీరు చేరలేదు. ప్రాజెక్టు పరిధిలో మొదటి ఫేజ్‌లో ఎస్సారెస్పీ నుంచి ఎల్‌ఎండీ ఎగువన 144 కిలోమీటర్ల వరకు 4.07 లక్షల ఎకరాలు, ఎల్‌ఎండీ దిగువన 146 నుంచి 285 కిలోమీటర్ల వరకు 4.94 లక్షల ఆయకట్టు ఉంది. రెండో ఫేజ్‌లో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.

మొత్తంగా 18 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులోకి పూర్తిస్థాయిలో నీరు చేరితే ఆయకట్టు మొత్తానికి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో రెండు పంటలకు నీరందించేవారు. సాగునీటికి ఖరీఫ్‌లో 34 టీఎంసీలు, రబీ కోసం 50 టీఎంసీల నీరు అవసరముంటుంది. ఆశించిన మేర వర్షాలు లేక ఖరీఫ్‌లో యాభై శాతం భూములు కూడా సాగవలేదు.

ఎస్సారెస్పీలో 90 టీఎంసీల సామర్థ్యానికి గాను 24 టీఎంసీలే ఉండగా, ఎల్‌ఎండీలో 24 టీఎంసీలకు గాను 7.252 టీఎంసీల నీరే ఉంది. ఈ నీరంతా గతేడాది నిల్వ ఉన్న నీరే. ఖరీఫ్ సీజన్‌లో పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోవడంతో ఖరీఫ్ చివరిదశలో ఒక తడి నీరు అందించారు.

ప్రాజెక్టులో నీరు లేక ఈ రబీ సీజన్‌కు సాగునీరిచ్చే అవకాశమే లేదని సీఈ శంకర్ శుక్రవారం ప్రకటించారు. ఇప్పుడున్న నీరు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతుందని తెలిపారు. ఇప్పటికే బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో గోదావరి వరద నీరు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. దీంతో రబీలో ఆయకట్టు మొత్తం బీడుగానే ఉండే పరి స్థితులు నెలకొన్నాయి. మొత్తంగా బోర్లు, బావు లు ఉన్నచోట లక్ష ఎకరాలు మాత్రమే సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

 నిల్వలు తాగునీటికే...
 ఎస్సారెస్పీలో ప్రస్తుతం 24 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా ఇవి తాగునీటి అవసరాలకే కేటాయించనున్నారు. 5 టీఎంసీలు నీరు తాగునీటి అవసరాలకు పోను, మరో ఐదు టీఎంసీ లు ఆవిరిగా చూపుతారు. మిగతా 14 టీఎంసీ ల్లో ఐదు టీఎంసీలు కనీస నీటి మట్టం కాగా, 9 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. సాగునీటి కోసం ఈ నీరు ఏ మాత్రం సరిపోయే అవకాశం లేకపోగా భవిష్యత్ కోసం నిల్వ ఉంచే అవకాశముంది.

వర్షాలు పడేవరకు నీటిని కాపాడుకుం టూ తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని సీఈ శంకర్ తెలిపారు. కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, నిజామాబాద్ సిద్దిపేట, వరంగల్ ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ నీరే ఆధారం. దీంతోపాటు ఎన్టీపీసీకి సైతం నీరందించాల్సి ఉంది. సాగునీటికి విడుదల చేస్తే ఎండాకాలం లో తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదముందని అధికారులు ముందు జాగ్రత్త పడుతున్నారు.

Advertisement
Advertisement