యుద్ధప్రాతిపదికన కరువు నివారణ చర్యలు | Sakshi
Sakshi News home page

యుద్ధప్రాతిపదికన కరువు నివారణ చర్యలు

Published Mon, May 2 2016 3:31 AM

యుద్ధప్రాతిపదికన కరువు నివారణ చర్యలు - Sakshi

పెబ్బేరు/భూత్పూర్: రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కరువు నివారణ చర్యలు చేపట్టాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణలో పూర్తి కరువు ఏర్పడిందన్నారు. ఆదివారం మే డే వేడుకల్లో భాగంగా ఆయన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్, పెబ్బేరు మండలాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ని నాలుగు జిల్లాల్లో జేఏసీ ఆధ్వర్యంలో కరువు పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదికలను జిల్లాల కలెక్టర్లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు అందజేశామని వివరించారు.

త్వరలో గవర్నర్ నరసింహన్‌నూ కలవనున్నట్లు తెలిపారు. పంటలు, పండ్లతోటలు దెబ్బతిని రైతులు అప్పులపాలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కనీసం ఎకరాకు రూ.10 వేలు తగ్గకుండా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను ఇప్పుడు ఆదుకుంటేనే వచ్చే ఖరీఫ్‌లో తిరిగి పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయి చెరువులను నీటితో నింపి ఉంటే ఇంతటి కరువు వచ్చేది కాదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో వృద్ధులు, వికలాంగులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని ఆయన కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా టీజేఏసీ పాత్ర ప్రముఖంగా ఉంటుందని కోదండరాం స్పష్టంచేశారు.
 
 కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలి
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న సరళీకరణ చట్టాల ఫలితంగా కార్మికుల సంక్షేమం డోలాయమానంలో పడిందని కోదండరాం ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్, ఒప్పంద ఉద్యోగులను నియమిస్తూ ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నాయని చెప్పారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేసినప్పుడే కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు.

Advertisement
Advertisement