పోటీనా.. పొత్తా! | Sakshi
Sakshi News home page

పోటీనా.. పొత్తా!

Published Mon, Sep 22 2014 1:17 AM

పోటీనా.. పొత్తా!

మోగిన నార్మాక్ ఎన్నికల నగారా
 
మూడు డెరైక్టర్ల పదవులకు నోటిఫికేషన్
జిల్లాకు రెండు, రంగారెడ్డికి ఒకటి రిజర్వ్ స్థానాలను గెలుచుకునేందుకు అధికార పార్టీ వ్యూహం

 
 భువనగిరి : నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (నార్మాక్) ఎన్నికల నగారా మోగింది. గుత్తా జితేందర్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న ఈ పాలకవర్గంలో 15మంది డెరైక్టర్లు ఉన్నారు. ఈ నెలాఖరులోగా డెరైక్టర్లు కాయితి వెంకట్‌రెడ్డి, మడూరి రంగారెడ్డి, రాంరెడ్డిల పదవీ కాలం ముగుస్తుంది. వీరిస్థానంలో మరో ముగ్గురిని ఎన్నుకోనున్నారు. ఈ 3 డెరైక్టర్ల  స్థానాల్లో 2 జిల్లాకు, ఒకటి రంగారెడ్డి జిల్లాకు రిజర్వు చేశారు. ఈ మేరకు ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల వల్ల అధికార టీఆర్‌ఎస్ ఈ స్థానాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ కుదిరితే పొత్తు.. లేకపోతే ఎన్నికలను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల్లోని 21 చిల్లింగ్ సెంటర్ల పరిధిలో 421మంది పాల సొసైటీ అధ్యక్షులు నూతన డెరైక్టర్లను ఎన్నుకోనున్నారు.

గ్రామాల్లో రాజకీయ వేడి..

మదర్‌డెయిరీ ఎన్నికలు అనగానే గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలవుతుంది. అయితే ఈసారి మారిన ప్రభుత్వం, రాజకీయ నేపధ్యంలో టీఆర్‌ఎస్ డెరైక్టర్ల స్థానాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి మోతె పిచ్చిరెడ్డి ఇటీవల భువనగిరి చిల్లింగ్ సెంటర్ పరిధిలో అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఆ విచారణ కొనసాగుతోంది. మరోవైపు 421మంది సొసైటీ చైర్మన్లలో 200 మంది వరకు భువనగిరి, ఆలేరు, మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచే ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన రాష్ట్రమంత్రి జి.జగదీష్‌రెడ్డి జిల్లాకు కేటాయించిన రెండు డెరైక్టర్ల స్థానాలను కైవసం చేసుకోవడానికి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కాగా ఈసారి ఎన్నికలు పోటాపోటీగా జరుగుతాయా లేదా ప్రస్తుతం ఉన్న చైర్మన్, పాలకవర్గం.. అధికార పార్టీతో పొత్తు పెట్టుకొని స్థానాలను పంచుకునే అవకాశాలు లేకపోలేదని పాడి రైతులు తెలుపుతున్నారు.

ఎన్నికల షెడ్యూల్

 ఈ నెల 23న ఉదయం 10 నుంచి 2 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ 24న నామినేషన్ల పరిశీలన 25న ఉపసంహరణ 29న ఎన్నికలు, (మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఎన్నికలు, 2 గంటల తర్వాత లెక్కింపు)  మూడు నామినేషన్లు వస్తే ఏకగ్రీవమైనట్లు ప్రకటిస్తారు..లేకపోతే రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు.
 
 

Advertisement
Advertisement