కుర్రాళ్లోయ్‌ కుర్రాళ్లు.. వెర్రెత్తి ఉన్నోళ్లు..! | Sakshi
Sakshi News home page

కుర్రాళ్లోయ్‌ కుర్రాళ్లు.. వెర్రెత్తి ఉన్నోళ్లు..!

Published Wed, Jul 26 2017 8:52 AM

దాడి వివరాలు తెలుసుకుంటున్న ఎస్సై సుమన్ - Sakshi

 
 
పాలేరు: ఆ ఐదుగురి వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్యన ఉంటుంది. అందులో ముగ్గురేమో స్నేహితులు. మరో ఇద్దరు అన్నదమ్ములు. గొడవకు దిగారు. కొట్టుకున్నారు. రక్తమోడింది. కేసులయ్యాయి. అరెస్టయ్యారు. వీరి మధ్య గొడవకు అసలు కారణమేమిటో మీరు తెలుసుకుంటే.. ‘ఈ కుర్రాళ్లకేమైనా వెర్రెత్తిందా..?!’ అని అనుకోకుండా ఉండలేరు.
వీళ్లెవరు..?
బ్రహ్మరపు వీరబాబు, ఎన్‌.వీరన్న, కె.గోపి. నేలకొండపల్లికి చెందిన ఈ ముగ్గురూ స్నేహితులు. మచ్చా నాగరాజు, మచ్చా ఎల్లారావు. వీరిద్దరూ అన్నదమ్ములు. వీరిది కూడా నేలకొండపల్లే. వీరంతా, ఉపాధి కోసం చిన్నాచితకా పనులు చేసుకుంటున్న నిరుపేద కుర్రాళ్లు.
ఏమైంది..?
ఆ ముగ్గురు స్నేహితులు కలిసి సోమవారం రాత్రి సుష్టుగా భోంచేసి స్థానిక జగన్నాథ ఫంక్షన్‌ హాలు ఎదురుగా ఉన్న సిమెంట్‌ బల్ల పై కూర్చుని కబుర్లాడుకుంటున్నారు. వారి ముందు నుంచి మచ్చా నాగరాజు ఒక్కడే నడుచుకుంటూ వెళుతున్నాడు. అతడిని వీరబాబు ఆపాడు. ‘పది రోజుల కిందట నా సెల్‌ ఫోన్‌ డిస్‌ప్లే ఎందుకు పగలగొట్టావ్‌?’’ అని ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాదన మొదలైంది. మాటా మాటా పెరిగింది. కొట్టుకుంటున్నారు. వీరబాబుకు తోడుగా గోపి వచ్చాడు. ఇద్దరూ కలిసి నాగరాజును కొడుతున్నారు.
క్షణికావేశంతో...
తన అన్నను పడేసి కొడుతుండడాన్ని దూరం నుంచి తమ్ముడు ఎల్లారావు చూశాడు. పరుగున పరుగున వచ్చాడు. ఆవేశం ఆపుకోలేకపోయాడు. క్షణికావేశంతో, అక్కడున్న సెంట్రింగ్‌ రన్నర్‌ (కర్ర ముక్క) తీసుకుని వీరబాబు, గోపిపై దాడికి దిగాడు. గోపి స్పృహ తప్పి పడిపోయాడు. తీవ్ర గాయాలతో వీరబాబుకు రక్తస్రావమవుతోంది. ఇంతలో చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. ఆ ఇద్దరినీ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరబాబు పరిస్థితి విషమించింది. అతడిని ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది.
కేసు నమెదు..
గోపి ఫిర్యాదుతో, అన్నదమ్ములైన నాగరాజు, ఎల్లారావుపై హత్యా యత్నం కేసును నేలకొండపల్లి ఎస్సై కొణతం సుమన్‌ నమోదు చేశారు. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
వెర్రెత్తిందేమో...!
ఈ గొడవకు, దాడికి కారణం తెలుసుకున్న నేలకొండపల్లి వాసులు తమలో తాము ఇలా అనుకున్నారు... ‘కుర్రాళ్లోయ్‌ కుర్రాళ్లు.. వెర్రెత్తి ఉన్నోళ్లు..!’. 

Advertisement
Advertisement