చెరువులతోనే బతుకుదెరువు | Sakshi
Sakshi News home page

చెరువులతోనే బతుకుదెరువు

Published Sun, Apr 19 2015 11:49 PM

JAC chairman Professor kodandaram talks about villsages ponds

- గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అవి పట్టుగొమ్మలు
- వాటి పునరుద్ధరణ సక్రమంగా జరగాలి
- జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్
- గిర్మాపూర్ దాతర చెరువులో ‘మిషన్ కాకతీయ’ ప్రారంభం
- జేఏసీ నాయకుల శ్రమదానం
మేడ్చల్ రూరల్:
చెరువులు.. పల్లెసీమలకు పట్టుగొమ్మలు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టులు.. వాటి పునరుద్ధరణలో ప్రతి వ్యక్తీ  పాలుపంచుకోవాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆకాంక్షించారు. ఆదివారం జేఏసీ ఆధ్వర్యంలో మేడ్చల్ మండలం గిర్మాపూర్ దాతర చెరువులో శ్రమదానం చేశారు. రాజకీయ, ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాద, పారిశ్రామిక జేఏసీ నాయకులు మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ర్యాలీగా బయలుదేరి గిర్మాపూర్ దాతర చెరువుకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కోదండరామ్ మాట్లాడుతూ..  కాకతీయులు చేపట్టిన చెరువుల తవ్వకాలను స్ఫూర్తిగా తీసుకుని మిషన్ కాకతీయ పనుల్లో తమవంతు సహాయ సహకారాలు అందించేందుకు జేఏసీ శ్రమదానం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిందన్నారు. చెరువులు బాగుంటేనే ఊరు బాగుంటుందని.. చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంటే అన్ని వర్గాల ప్రజలకు, జంతు, జీవరాశులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.

ఆంధ్రా పాలకులు ఇక్కడి చెరువులను విస్మరించారని, ఎన్నడూ పూడిక తీసిన పాపాన పోలేదన్నారు. ఈ కారణంగానే ఎన్నో చెరువులు ఉనికిని కోల్పోయాయని తెలిపారు. పునరుద్ధరణలో భాగంగా చెరువుల్లోకి మొదటగా నీరు చేరుకునే కాల్వలను సరిచేయాలని అధికారులకు కోదండరామ్ సూచించారు. మిషన్ కాకతీయ పనులు సక్రమంగా అమలు కావాలని, ప్రజలు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు.

ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల పరిస్థితి అస్తవ్యస్తం..
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని చెరువుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. మిషన్‌కాకతీయ పనులు తెలంగాణకే వన్నె తెచ్చే పథకమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 74 చెరువులను తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన జేఏసీ నాయకులు శ్రమదానం చేయడం అభినందనీయమన్నారు. జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. చెరువుల ఉనికితోనే అన్ని వర్గాలకు జీవనం ఏర్పడుతుందని తెలిపారు.

టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా ఉద్యోగులు చెరువుల పునరుద్ధరణకు తమవంతు కర్తవ్యం నెరవేరుస్తామని తెలిపారు. చెరువులు బాగుపడి పంటలు పుష్కలంగా పండితే ప్రజల వలసలు తగ్గుతాయని గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర నాయకుడు మధుసూదన్ పేర్కొన్నారు. మిషన్‌కాకతీయ పథకానికి తమవంతు సహాయంగా మే నెల ఒక రోజు జీతం రూ. 10 కోట్ల 50 లక్షలను విరాళంగా అందజేస్తున్నామని ప్రకటించారు.

న్యాయవాదుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాజేందర్‌రెడ్డి, పారిశ్రామికవేత్తల సంఘం రాష్ట్ర చైర్మన్ సుధీర్‌రెడ్డి, ఇంటర్ విద్య జేఏసీ రాష్ట్ర చైర్మన్ మధుసూధన్‌రెడ్డి, గెజిడెట్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, ఇరిగేషన్ శాఖ ఓఎస్‌డీ శ్రీధర్ దేశ్ పాండే, జేఏసీ సభ్యుడు హమీద్ మహ్మద్‌ఖాన్‌లు తదితరులు ప్రసంగించారు.

కార్యక్రమంలో మేడ్చల్ జెడ్పీటీసీ సభ్యురాలు జేకే శైలజ, సర్పంచ్ నవనీత, ఎంపీటీసీ సభ్యురాలు రజిత, మేడ్చల్ పీఏసీఎస్ చైర్మన్ అంతిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఈశ్వర్, నారాయణగౌడ్, తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీఓ శోభ, ఈఓఆర్డీ జ్యోతి, ఇరిగేషన్ శాఖ సీఈ రామకృష్ణ, ఎస్‌ఈ వెంకటేశ్వర్, డీఈ భీంరావు, ఈఈ నర్సింహులు, ఏఈ నర్సయ్య,  టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాంమోహన్, టీజీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం అధ్యక్షుడు డీపీ రెడ్డి,  జేఏసీ తూర్పు డివిజన్ చైర్మన్ చెల్మారెడ్డి, కన్వీనర్ సంజీవరావు, నియోజకవర్గ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, మండల ైచైర్మన్ మల్లారెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మల్లారెడ్డి, మధుసూదన్, వేణుగోపాల్‌స్వామి, వెంకటేశ్వర్లు, కైలాసం, టీఆర్‌ఎస్ నాయకులు మల్లికార్జున్ స్వామి, సత్యనారాయణరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, నర్సింహ, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement