కాలిబాటలు ఆక్రమిస్తే కటకటాల్లోకే.. | Sakshi
Sakshi News home page

కాలిబాటలు ఆక్రమిస్తే కటకటాల్లోకే..

Published Tue, Oct 13 2015 5:06 PM

City Police launch new app

- పదేపదే ఉల్లంఘిస్తే తప్పదన్న ట్రాఫిక్ చీఫ్
- ఈ తరహా కేసులన్నీ ఇక ట్యాబ్‌ల ద్వారానే
- జీపీఎస్, లెసైన్సు వివరాలతో సహా నమోదు
- మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన నగర కొత్వాల్

సాక్షి : రహదారులపై సామాన్యుల నడకను నరకప్రాయంగా చేస్తున్న ఫుట్‌పాత్ ఆక్రమణల్ని ట్రాఫిక్ విభాగం అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పదే పదే ఈ నేరానికి పాల్పడుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ సహకారంతో ట్రేడ్ లెసైన్సుల రద్దుతో పాటు న్యాయస్థానం ద్వారా జైలుకు కూడా తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నగర ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న అధికారుల ట్యాబ్‌ల కోసం ప్రత్యేక యాప్ రూపొందించారు. దీన్ని మంగళవారం కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

నగర కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ విభాగంలో ఉన్న 150 మంది అధికారులకు అందించిన ట్యాబ్స్‌లో దీన్ని నిక్షిప్తం చేస్తున్నారు. నగరంలోని ఫుట్‌పాత్‌లను దుకాణదారులతో పాటు చిరువ్యాపారులూ ఆక్రమిస్తున్నారు. దీంతో పాదచారులు రోడ్డు మీదనే నడవాల్సి రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరహా ఉల్లంఘనులపై ట్రాఫిక్ పోలీసులు సిటీ పోలీసు చట్టంలోని 39 (బి) సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు చలాన్ పుస్తకాల ద్వారా ఈ కేసులు రాస్తుండటంతో డేటాబేస్ లేక పదే పదే ఆక్రమిస్తున్న వారిని సాంకేతికంగా గుర్తించడం సాధ్యం కావట్లేదు. దీనికి పరిష్కారంగానే యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.

ఈ యాప్‌ను వినియోగించి చలాన్ విధించినప్పుడు అనేక వివరాలను ఆన్‌లైన్‌లోకి చేరతాయి. వ్యాపారి వివరాలతో పాటు దుకాణం ట్రేడ్ లెసైన్స్ సంఖ్య, టిన్ నెంబర్, జీపీఎస్ ప్రకారం ఆ దుకాణం ఉన్న ప్రాంతం తదితరాలు నమోదు అవుతాయి. ఓసారి పోలీసులు కేసు రాసిన తర్వాత ఒకటి రెండు రోజులకు మళ్ళీ ఫుట్‌పాత్‌ను ఆక్రమించేస్తుంటారు. ఇలా పదే పదే ఉల్లంఘనకు పాల్పడే వారి వివరాలతో డేటాబేస్ రూపొందుతుంది. వీటి ఆధారంగా న్యాయస్థానంలో చార్జ్‌షీట్ వేసి జైలుకు పంపేలా చేయడంతో పాటు దుకాణం లెసైన్సు రద్దు చేయించేందుకు వీలుంటుంది.

Advertisement
Advertisement