'రజాకార్లు కావాలో... తెలంగాణ ప్రజలు కావాలో... తేల్చుకో' | Sakshi
Sakshi News home page

'రజాకార్లు కావాలో... తెలంగాణ ప్రజలు కావాలో... తేల్చుకో'

Published Wed, Sep 17 2014 10:42 AM

'రజాకార్లు కావాలో... తెలంగాణ ప్రజలు కావాలో... తేల్చుకో' - Sakshi

హైదరాబాద్: రజాకార్లు కావాలో, తెలంగాణ ప్రజలు కావాలో తేల్చుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్కు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు కిషన్రెడ్డి అధ్యక్షతన ఘనం జరిగాయి. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ సీఎంగా కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై కిషన్రెడ్డి నిప్పులు చెరిగారు.

మహారాష్ట్ర, కర్ణాటకలోని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రా దినోత్సవాలను అధికారికంగా జరుపుతున్నా... ఇక్కడ ఎందుకు జరపడం లేదని కేసీఆర్ను ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఎందుకు ఈరోజుని అధికారికంగా జరపడం లేదో తెలపాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ఎవరు వద్దన్నా... కాదన్నా... గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేస్తామని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17వ తేదీ ... తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

బాపు ఘాట్ వద్ద...
అనంతరం బాపు ఘాట్ వద్దకు కిషన్రెడ్డితో పాటు ఇతర నేతలు చేరుకున్నారు. అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ... సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినంగా అధికారిక ప్రకటన చేసేంతవరకూ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని కిషన్రెడ్డి స్ఫష్టం చేశారు. వారంతా మరికాసేపట్లో బాపు ఘాట్ నుంచి గోల్కొండ కోటకు ర్యాలీగా బీజేపీ నేతలు వెళ్లనున్నారు.

Advertisement
Advertisement