సోనియా వల్లే కాలేదు.. రాహుల్‌ ఎంత? | Sakshi
Sakshi News home page

సోనియా వల్లే కాలేదు.. రాహుల్‌ ఎంత?

Published Fri, Jun 2 2017 4:46 PM

సోనియా వల్లే కాలేదు.. రాహుల్‌ ఎంత? - Sakshi

అందోలు : అందోలు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభ పెడితే కనీసం అందోలు సీటును కూడా గెలవలేకపోయారు.. ఇక రాహుల్‌ ఎంత? అంటూ అందోలు ఎమ్మెల్యే పి. బాబూమోహన్‌ ఎద్దేవా చేశారు. అందోలు ఐబీ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పగటి వేషగాళ్లంతా గురువారం సంగారెడ్డి వచ్చి ప్రగల్భాలు పలికారన్నారు. ఒక్కసారి అధికారం ఇస్తే ఉద్యోగాలు ఇస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించడం సిగ్గుచేటని, పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం చేశారు.. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్‌ పార్టీ కాదా అని ఆయన ప్రశ్నించారు.
 
సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫొటోల్లోని నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా గాంధీలు ఒక్క కుటుంబం కాదా అంటూ కేటీఆర్‌, కవితలకు ఉన్న పరిజ్ఞానం రాహుల్‌ గాంధీకి ఉన్నదా అని నిలదీశారు. కాంగ్రెస్‌ నేతలు ఆవేశం‍తో మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండడం ఖాయమని బాబుమోహన్‌ అన్నారు. 
 
స్టెప్పులేసిన బాబుమోహన్‌
రాష్ర్ట ఆవిర్బావ దినోత్సవ సంబరాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి తిరిగి వెళుతుండగా ఆసుపత్రి సిబ్బంది డీజే సౌండ్ పాటలు పెట్టి బతుకమ్మ ఆట ఆడుతుండగా ఎమ్మెల్యేను ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్ సంగారెడ్డి ఆహ్వానించారు. ఏఎన్‌ఎంలు, సిబ్బంది, నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ కవిత సురేందర్‌ గౌడ్‌,  ఎంపీపీ  విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే బాబూమోహన్‌ కొద్దిసేపు బతుకమ్మ ఆడారు. డీజే సౌండ్‌లో తెలంగాణ పాట వస్తుండడంతో మార్కెట్‌ చైర్మన్‌ నాగభూషణం వారి మద్యలోకి వచ్చి స్టెప్పులు వేశారు. ఎమ్మెల్యే చేతులు పట్టుకుని లాగడంతో ఆయన కూడా పాటకనుగుణంగా స్టెప్పులు వేశారు. దీంతో కార్యకర్తలు ఈలలు కొడుతూ ఉత్సాహపరిచారు. 

Advertisement
Advertisement