ఎంపీడీఓలదే బాధ్యత | Sakshi
Sakshi News home page

ఎంపీడీఓలదే బాధ్యత

Published Mon, Apr 20 2015 1:23 AM

all the respontiblities  held on mpdo's

- అంగన్‌వాడీల పనితీరుపై నివేదికలివ్వాలి
- ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.10 వేల కోట్లు
- ఆర్‌అండ్‌బీ, మహిళాశిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల
 - గజ్వేల్ నియోజకవర్గంలో విస్తృత పర్యటన
గజ్వేల్:
అంగన్‌వాడీల పనితీరును ఎంపీడీఓలు సైతం పర్యవేక్షించవచ్చని రోడ్లు, భవనాలు, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. అంతేగాక వారి పనితీరుపై ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలందించాలని సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు ఈ ఏడాది రూ.1,600 కోట్లను కేటాయిం చినట్టు చెప్పారు. బాలింతలు, ఐదేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఆదివారం ఆయన నియోజక వర్గంలోని ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, గజ్వేల్ మండలాల్లో పర్యటించారు. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో రూ.20కోట్ల వ్యయంతో చేపట్టనున్న కొడకండ్ల-జగదేవ్‌పూర్ బీటీ డబుల్ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందించి అభివృద్ధికి బాటలు వేస్తున్నట్టు చెప్పారు.

నాలుగేళ్లలో తెలంగాణ రూపురేఖలే మారబోతున్నాయని తెలిపారు. మెరుగైన రోడ్ల ద్వారానే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. అందుకే ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఇటీవల రూ.10 వేల కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా మెదక్ జిల్లాకు రూ.1,100 కోట్లు, ఖమ్మం జిల్లాకు రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్టు స్పష్టం చేశారు. వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్టు వెల్లడించారు.

ఈ పథకంతో పల్లెల్లోనూ మంచి నీటి సమస్య తీరుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రగామిగా మారబోతున్నదన్నారు. ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎంపీపీ చిన్నమల్లయ్య, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, టీఆర్‌ఎస్ గజ్వేల్ మండల అధ్యక్షులు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పండరి రవీందర్‌రావు, గ్రామ సర్పంచ్ మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు అంజి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement