యువ తడాఖా... | Sakshi
Sakshi News home page

యువ తడాఖా...

Published Mon, Nov 23 2015 4:04 AM

యువ తడాఖా...

అదే జోరు.. అదే ఫలితం.. టోర్నీ ఆద్యంతం దూకుడే మంత్రంగా చెలరేగిపోయిన భారత యువ ఆటగాళ్లు ఆఖరి అడ్డంకిని అద్వితీయంగా అధిగమించారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతూ అంతిమ సమరంలోనూ తమ తడాఖా చూపించారు. ఆసియా జూనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచారు.
 
ఆసియా జూనియర్ హాకీ చాంపియన్ భారత్  
* ఫైనల్లో పాకిస్తాన్‌పై 6-2తో ఘనవిజయం  
* హర్మన్‌ప్రీత్ సింగ్ ‘హ్యాట్రిక్’
క్వాంటన్ (మలేసియా): లీగ్ మ్యాచ్‌లలో తాము ప్రదర్శించిన ఆటతీరు గాలివాటం కాదని భారత హాకీ జట్టు నిరూపించింది. ఆసియా జూనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 6-2 గోల్స్ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది.

భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ ‘హ్యాట్రిక్’తో కలిపి నాలుగు గోల్స్ (10, 15, 30, 53వ నిమిషాల్లో) చేయగా... అర్మాన్ ఖురేషీ (44వ నిమిషంలో), మన్‌ప్రీత్ జూనియర్ (50వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. పాకిస్తాన్ జట్టులో మొహమ్మద్ యాకూబ్ (28వ నిమిషంలో), మొహమ్మద్ దిల్‌బర్ (68వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. దక్షిణ కొరియా జట్టుకు మూడో స్థానం లభించింది. వర్గీకరణ మ్యాచ్‌లో కొరియా 2-1తో జపాన్‌ను ఓడించింది.
 
పాక్ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయని భారత ఆటగాళ్లు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగారు. సమన్వయంతో ముందుకు కదులుతూ అవకాశం దొరికినపుడల్లా ప్రత్యర్థి వలయంలోకి దూసుకెళ్లారు. నిరంతర దాడుల ఫలితంగా భారత్‌కు పదో నిమిషంలో తొలి పెనాల్టీ కార్నర్ లభించింది. దానిని హర్మన్‌ప్రీత్ లక్ష్యానికి చేర్చడంతో భారత్ ఖాతా తెరిచింది.

ఐదు నిమిషాల తర్వాత లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను కూడా హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలచడంతో భారత్ ఆధిక్యం 2-0కు చేరింది. 28వ నిమిషంలో యాకూబ్ గోల్‌తో పాక్ ఖాతా తెరిచినా... వారి ఆనందం రెండు నిమిషాల్లోనే ఆవిరైంది. 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సద్వినియోగం చేసుకోవడంతో అతని ఖాతాలో ‘హ్యాట్రిక్’ చేరింది. విరామ సమయానికి భారత్ 3-1తో ఆధిక్యంలో నిలిచింది.
 
ద్వితీయార్ధంలోనూ భారత్ దూకుడుగా ఆడింది. తొమ్మిది నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ సాధించి 6-1తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక మ్యాచ్ ముగియడానికి రెండు నిమిషాలముందు పాక్ జట్టుకు దిల్‌బర్ గోల్ అందించినా అప్పటికే ఆలస్యమైపోయింది.
* 28 ఏళ్ల ఆసియా జూనియర్ హాకీ కప్ చరిత్రలో భారత్ విజేతగా నిలువడం ఇది మూడోసారి. గతంలో భారత్ 2004, 2008లలో టైటిల్‌ను సొంతం చేసుకుంది. 1987, 2012లలో మూడో స్థానం పొందిన భారత్ 1996, 2000లలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 1992లో మాత్రం నాలుగో స్థానానికి పరిమితమైంది.
* ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్‌లో భారత్ అజేయంగా నిలిచింది. లీగ్ దశలో 2-1తో జపాన్‌పై, 5-4తో మలేసియాపై, 4-1తో చైనాపై గెలిచిన టీమిండియా... క్వార్టర్ ఫైనల్లో 9-0తో ఒమన్‌పై, సెమీఫైనల్లో 6-1తో జపాన్‌పై విజయం సాధించింది.
* కోచ్ హరేంద్ర సింగ్ పర్యవేక్షణలో హర్జీత్ సింగ్ నాయకత్వంలో ఈ టోర్నీలో మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన భారత్ 32 గోల్స్ చేసి తొమ్మిది గోల్స్‌ను ప్రత్యర్థి జట్లకు సమర్పించుకుంది.
* భారత్ విజేతగా నిలువడంలో ‘డ్రాగ్ ఫ్లికర్’ హర్మన్‌ప్రీత్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. అతను ఈ టోర్నీలో మొత్తం 14 గోల్స్ చేయగా... అందులో పెనాల్టీ కార్నర్‌ల ద్వారానే 13 గోల్స్ రావడం విశేషం.
 
ఫైనల్ ఉత్కంఠభరితంగా సాగింది. కుర్రాళ్లు సంయమనం కోల్పోకుండా ఆద్యంతం ఏకాగ్రతతో ఆడారు. సుల్తాన్ జొహర్ కప్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాం. దాంతో ఇక్కడ విజేత కావాలనే పట్టుదలతో ఆడాం. ప్రేక్షకుల నుంచి ఊహించని మద్దతు లభించింది. స్వదేశంలో ఆడుతున్నట్లే అనిపించింది. భవిష్యత్‌లో ఇదే జోరును కొనసాగించి మరిన్ని విజయాలు సాధిస్తాం.            
-కోచ్ హరేంద్ర సింగ్

Advertisement
Advertisement