జొకోవిచ్ అలవోకగా... | Sakshi
Sakshi News home page

జొకోవిచ్ అలవోకగా...

Published Wed, Aug 27 2014 12:46 AM

జొకోవిచ్ అలవోకగా... - Sakshi

 చెమటోడ్చిన ముర్రే  యూఎస్ ఓపెన్

న్యూయార్క్: కెరీర్‌లో రెండో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సాధించాలనే పట్టుదలతో ఉన్న ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ తొలి రౌండ్‌ను సులువుగానే అధిగమించాడు. సోమవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం) అర్ధర్ ఆషే స్టేడియంలో జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్‌లో అర్జెంటీనాకు చెందిన డీగో ష్వార్ట్జ్‌మాన్‌ను 6-1, 6-2, 6-4 తేడాతో ఓడించాడు.
 
కేవలం తన రెండో గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ ఆడుతున్న డీగో ఏ దశలోనూ ఈ టాప్ సీడ్‌కు పోటీనివ్వలేకపోయాడు. అయితే బేస్‌లైన్ ర్యాలీలతో ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో బ్రిటన్ ఆశాకిరణం ఆండీ ముర్రే అతికష్టమ్మీద నెగ్గాడు. డచ్ ఆటగాడు రాబిన్ హాస్ గట్టి పోటీనివ్వడంతో పాటు నాలుగో సెట్‌లో ముర్రేకు అనూహ్యంగా కండరాలు పట్టేసాయి. అయినా మూడు గంటలకు పైగా సాగిన ఈ పోరులో పట్టు వదలకుండా పోరాడి 6-3, 7-6 (8/6), 1-6, 7-5తో గట్టెక్కాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో స్టాన్ వావ్రింకా 6-2, 7-6 (8/6), 7-6 (7/3)తో జిరి వెస్లీ (చెక్)పై, స్టెఫానెక్ (చెక్) 6-3, 6-2, 6-2తో బాచింగర్ (జర్మనీ)పై, వెర్డాస్కో (స్పెయిన్) 6-3, 3-6, 7-5, 1-6, 6-4తో రోలా (స్లొవేకియా)పై, బెలూసి (బ్రెజిల్) 7-6 (7-4), 6-4, 6-1తో మహూట్ (ఫ్రాన్స్)పై, మిలోస్ రవోనిక్ (కెనడా) 6-3, 6-2, 7-6 (7/1) డానియల్ (జపాన్)పై గెలిచారు.
 
షరపోవా జోష్: గాయం కారణంగా గతేడాది యూఎస్ ఓపెన్‌లో ఆడలేకపోయిన రష్యా బ్యూటీ మరియా షరపోవా ఈసారి పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఐదో సీడ్ షరపోవా తన దేశానికే చెందిన మరియా కిరిలెంకోపై 6-4, 6-0తో నెగ్గింది. తొలి సెట్‌లో 2-4తో వెనుకబడిన షరపోవా వరుసగా 10 గేమ్‌లు గెలిచి కిరిలెంకోను కంగుతినిపించింది.

అలాగే మాజీ చాంపియన్ వీనస్ విలియమ్స్ 2-6, 6-3, 6-3తో కిమికో డేట్ క్రమ్ (జపాన్)ను ఓడించింది. వోజ్నియాకి (డెన్మార్క్) 6-1, 3-6, 2-0తో రైబరికోవా (స్లొవేకియా)ను, జంకోవిక్ (సెర్బియా) 6-2, 6-3తో జొవనోవ్‌స్కీ (సెర్బియా)ని ఓడించారు. 24వ సీడ్  సమంతా స్టోసుర్ 6-1, 6-4తో లారెన్ డేవిస్ (అమెరికా)ను, అనా ఇవనోవిచ్ (రష్యా) 6-3, 6-0తో ఆలిసన్ రిస్క్ (అమెరికా)ను ఓడించారు.

Advertisement
Advertisement