గంగూలీ రికార్డ్ బద్ధలు.. ద్రావిడ్ రికార్డ్ సేఫ్! | Sakshi
Sakshi News home page

గంగూలీ రికార్డ్ బద్ధలు.. ద్రావిడ్ రికార్డ్ సేఫ్!

Published Sat, Feb 25 2017 10:54 AM

AB de Villiers is fastest to reach 9000 runs in ODIs

వెల్లింగ్టన్: దక్షిణాఫ్రికా విధ్వంసక ఆటగాడు, ఆ జట్టు కెప్టెన్ ఏబీ డివిలియర్స్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్ లో అతి తక్కువ మ్యాచ్‌లు, ఇన్నింగ్స్ లలో 9000 మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో 228 ఇన్నింగ్స్ లలో ఈ మైలురాయిని చేరిన క్రికెటర్ గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న  రికార్డును డివిలియర్స్ 205 ఇన్నింగ్స్ లలో సాధించాడు. ఓవరాల్‌గా వన్డే క్రికెట్‌లో 18 మంది ఫీట్‌ను నమోదు చేశారు. అయితే వీరిలో అత్యుత్తమ స్ట్రైక్ రేట్ 99.94 తో ఇతడు అగ్రస్థానంలో ఉన్నాడు.

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా ఇక్కడ మూడో వన్డే ఆడుతుంది. ఈ మ్యాచ్ లో 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సఫారీ కెప్టెన్ డివిలియర్స్ తొమ్మిది వేల వన్డే పరుగులు పూర్తిచేసుకుని గంగూలీ రికార్డును అధిగమించాడు. న్యూజిలాండ్ పర్యటనకు రాకముందు ఈ ఫీట్ కు కేవలం 87 పరుగుల దూరంలో ఉన్న డివిలియర్స్ తొలి రెండు వన్డేల్లో వరుసగా 37 పరుగులు నాటౌట్, 45 పరుగులు చేశాడు. 9వేల క్లబ్ కు అవసరమైన ఐదు పరుగులను ఈ వన్డేలో డివిలయర్స్ (80 బంతుల్లో 85: 7 ఫోర్లు, 1 సిక్సర్) సాధించాడు. సఫారీ జట్టు నుంచి గతంలో జాక్వస్ కలిస్ (242 ఇన్నింగ్స్ లు) పేరిట ఉన్న రికార్డును డివిలియర్స్ (205 ఇన్నింగ్స్ లు) సవరించాడు.

ద్రావిడ్ రికార్డు సేఫ్
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ రికార్డును మాత్రం డివిలియర్స్ అధిగమించ లేకపోయాడు. అతి తక్కువ మ్యాచ్‌లు, ఇన్నింగ్స్‌ల పరంగా 9 వేల క్లబ్‌లోకి డివిలియర్స్ ఎంటర్ అయినా.. అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ నెలకొల్పలేదు. వన్డేల్లో అరంగేట్రం చేసిన 9 ఏళ్ల 322 రోజుల్లో ద్రావిడ్ తొమ్మిది వేల పరుగులను సాధిస్తే... డివిలియర్స్ 12 ఏళ్ల 23 రోజులకు ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

Advertisement
Advertisement