సింహగర్జన కాదు.. చిట్టెలుక స్వరం | Sakshi
Sakshi News home page

సింహగర్జన కాదు.. చిట్టెలుక స్వరం

Published Sat, Feb 25 2017 1:57 AM

సింహగర్జన కాదు.. చిట్టెలుక స్వరం - Sakshi

ప్రధాని మోదీపై రాహుల్‌ విసుర్లు
లక్నో : ప్రధాని మోదీ స్వరం చిట్టెలుక కంటే బలహీనంగా మారిందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ విమర్శించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాసి నియోజకవర్గంలో ప్రసంగిస్తూ... ‘మేకిన్  ఇండియా అంటూ ప్రధాని పిలుపునిచ్చారు. అయితే అది సింహ గర్జన కాదు... చిట్టెలుక శబ్దం కంటే బలహీనంగా మారింది’ అంటూ వ్యంగ్యా స్త్రాలు సంధించారు. ప్రతీచోట ‘మేడిన్  ఇన్  చైనా’ వస్తువులు అందుబాటులో ఉన్నాయని, నా ఫోన్  కూడా మేడిన్  చైనానే అంటూ రాహుల్‌ చమత్కరించారు.

ఎస్పీ–కాంగ్రెస్‌లు జట్టు కట్టినప్పటి నుంచి  మోదీ మత విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్నారన్నారు. మోదీ ధనికుల రుణాలు మాఫీ చేశారు గానీ, రైతుల్ని పట్టించుకోలేదని తప్పుపట్టారు. యూపీకి దత్తపుత్రుడిగా మోదీ ప్రచారం చేసుకోవడాన్ని కూడా రాహుల్‌ ఎద్దేవా చేశారు. ఎక్కడికెళ్తే అక్కడ బంధుత్వం ఏర్పరచుకుంటారని, అది కేవలం పెదాలకే పరిమితం కాకూడదన్నారు. మోదీ దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే(అచ్చే దిన్  వాగ్దానం) సినిమా తీశారని, నోట్ల రద్దుతో అది షోలేగా మారిందన్నారు.

రాహుల్‌పై బీజేపీ వ్యంగ్యా స్త్రాలు
రాహుల్‌గాంధీ ఇంకా పరిణతి చెందలేదని, అందుకు మరికొంత సమయం అవసరమన్న షీలాదీక్షిత్‌ వ్యాఖ్యల్ని బీజేపీ సమర్ధించింది. ఒకవేళ రాహుల్‌ పరిణితి చెందకపోతే... బలవంతంగా ఎందుకు ఉత్తరప్రదేశ్‌పై ప్రయోగిస్తున్నారు? ఇదేమైనా రాజకీయ ప్రయోగశాలా లేక పాఠాలు నేర్చుకునే వేదికా? అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ ప్రశ్నించారు.

ఎస్పీని అడ్డుకునేందుకు ఏకమైన బీజేపీ, బీఎస్పీ: అఖిలేశ్‌
బీజేపీ సాయంతో ఎస్పీని అడ్డుకునేందుకు మాయావతి ప్రయత్నిస్తున్నారంటూ యూపీ సీఎం అఖిలేశ్‌ ఆరోపించారు. అయోధ్యలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. బీజేపీపై పోరాడాలనే ఉద్దేశం బీఎస్పీకి లేదని, అందుకే వారిద్దరు సమాజ్‌వాదీ పార్టీని అడ్డుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని విమర్శించారు.  మరోవైపు, యూపీ అసెంబ్లీ ఐదో విడత పోలింగ్‌ ప్రచారం నేటితో ముగియనుంది. ఐదో విడతలో 12 జిల్లాల్లోని 51 సీట్లకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement
Advertisement