ఎల్బీటీ విధానం మరికొంతకాలం | Sakshi
Sakshi News home page

ఎల్బీటీ విధానం మరికొంతకాలం

Published Fri, Nov 21 2014 10:42 PM

Maharashtra govt unlikely to scrap LBT until GST introduced

సాక్షి, ముంబై: స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ) రద్దు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఈ విషయమై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, సంబంధిత అధికారుల మధ్య మంత్రాలయలో జరిగిన సమావేశంలో ఎలాంటి పరిష్కారమూ లభించలేదు. దీంతో రాష్ట్రంలో ఎల్బీటీ విధానం మరికొంత కాలం కొనసాగే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. ఎల్బీటీకి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంబంధింతి అధికారులను ఆదేశించారు.

 ఎల్బీటీకి తమవద్ద ప్రత్యామ్నాయం ఉందని, అందువల్ల అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేస్తామని శాసనసభ ఎన్నికలకు ముందు ఫడ్నవీస్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన సంగతి విదితమే. అయితే అధికారంలోకి వచ్చినప్పటికీ దాన్ని తక్షణమే రద్దు చేయలేని పరిస్థితి నెలకొంది. దీనికి ప్రత్యామ్యాయ మార్గాలను కనుగొనేందుకు విక్రయ పన్ను శాఖ కమిషనర్లను పురమాయించారు. ఒకవైపు ఎల్బీటీ రద్దు కోసం వ్యాపారవర్గాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుండగా మరోవైపు నిర్ణయం తీసుకోవాలంటూ వివిధ నగర, మహానగర పాలక సంస్థలు పట్టుబడుతున్నాయి.

దీంతో సమావేశం ఏర్పాటు చేసి  నాలుగు రోజుల్లో వివరాలు అందజేయాలని విక్రయ పన్ను శాఖ కమిషనర్ నితిన్ కరీర్, ఆర్థిక శాఖ అప్పర్ ప్రధాన కార్యదర్శి సుధీర్ శ్రీవాస్తవ్‌లను సీఎం ఆదేశించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో నగర, మహానగర పాలక సంస్థల సంఖ్య అధికం. ఈ కార్పొరేషన్లు రోడ్లు, అగ్నిమాపక సేవలు, ఆరోగ్య సేవలు తదితర అనేక మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నాయి. అందుకు ప్రభుత్వ పరిపాలనావిభాగం నుంచి కూడా కొంతమేర ఆర్థిక సాయం అందుతోుంది. ఒకవేళ ఎల్బీటీ రద్దయితే కార్పొరేషన్లకు 14-15 వేల కోట్లు ఆర్థిక సాయం అందజేయాల్సి ఉంటుంది. లేదంటే కార్పొరేషన్ల ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటాయి. అప్పుడు దీని ప్రభావం ప్రజలకు కల్పించే మౌలిక సదుపాయాలపై పడతుంది.

Advertisement
Advertisement