బొద్దుగుమ్మ 'బుజ్జిమా' కష్టాలు తీరిపోయాయి! | Sakshi
Sakshi News home page

బొద్దుగుమ్మ 'బుజ్జిమా' కష్టాలు తీరిపోయాయి!

Published Wed, May 4 2016 7:43 PM

telugu actor vidyulekha raman gets help from indian embassy

దేశం కాని దేశంలో హ్యాండ్‌బ్యాగ్‌, పాస్‌పోర్టు పోగొట్టుకొని.. పీకల్లోతు కష్టాల్లో పడిన తెలుగు, తమిళ చిత్రాల హాస్యనటి విద్యుల్లేఖ రామన్ కష్టాలు తీరిపోయాయి. ఆమెను ఆదుకోవడానికి వియన్నాలోని భారత రాయబార కార్యాలయం ముందుకొచ్చింది. స్వదేశం వచ్చేందుకు ఆమెకు తాత్కాలిక ట్రావెల్ పర్మిట్‌ను జారీచేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో తెలిపిన విద్యుల్లేఖ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. (చదవండి - చిక్కుల్లో బొద్దుగుమ్మ 'బుజ్జిమా')

స్నేహితులతో కలిసి వియన్నాలో విహారానికి వెళ్లిన విద్యుల్లేఖను ఊహించని కష్టాలు చుట్టుముట్టాయి. ఆమె ఉన్న హోటల్‌ లాబీలో ఆమె హ్యాండ్‌బ్యాగును దొంగలు కొట్టేశారు. దీంతో పాస్‌పోర్టు, క్యాష్ కార్డ్స్‌, డబ్బు అంతా కోల్పోయి విద్యుల్లేఖ చిక్కుల్లో పడింది. స్నేహితులతో కలిసి ఈ దేశానికి రావడమే తప్పయిందని ట్విట్టర్‌లో వాపోయింది. ఇదంతా తలరాత అయి ఉంటుందని వైరాగ్యం ప్రకటించింది. వియన్నాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించడానికి సాయం చేయాలని కోరింది.

ఈ క్రమంలో తనకు వెంటనే భారత రాయబార కార్యాలయం సాయం చేసిందని, ఎంతో స్నేహపూర్వకంగా రాయబార సిబ్బంది తనను అర్థం చేసుకున్నారని, ఇది ఎంతో ఆనందం కలిగిస్తున్నదని విద్యుల్లేఖ తాజాగా విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌, పీఎంవోను ట్యాగ్‌ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. తనకు జరిగింది చాలా దురదృష్టకరమని, ఈ ఘటనలో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి హాని జరగనందుకు కృతజ్ఞురాలై ఉంటానని, తాను సురక్షితంగా ఉన్నానని విద్యుల్లేఖ తెలిపింది. టూరిస్టులు లక్ష్యంగా ఎప్పుడూ దాడులు జరుగుతాయని, వారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆమె తన అనుభవపూర్వకంగా సూచించింది.

అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన 'సరైనోడు' సినిమాలో సాంబారు చబ్బీ బ్యూటీగా,  'రాజుగారి గది' చిత్రంలో బుజ్జిమాగా తమిళ నటి విద్యుల్లేఖ రామన్ తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. సీనియర్‌ నటుడు మోహన్‌ రామన్‌ కుమార్తె అయిన విద్యు తమిళ, తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌ ఫ్రెండ్ పాత్రలకు చిరునామాగా మారింది.

Advertisement
Advertisement