కుక్కు.. బాగా కుక్కు.. | Sakshi
Sakshi News home page

కుక్కు.. బాగా కుక్కు..

Published Sat, Aug 27 2016 3:31 AM

కుక్కు.. బాగా కుక్కు.. - Sakshi

* సూట్‌కేసులో బట్టలు సరిపోవడం లేదు.. మనమేం చేస్తాం.. ఎలాగోలా కుక్కేస్తాం..
* జపాన్‌లోని సబ్‌వే రైలు సిబ్బంది కూడా అంతే.. అయితే , వీరు మనుషులకు బట్టలకు మధ్య పెద్దగా తేడా చూపరు. బట్టలను కుక్కేసినట్లు మనుషులను రైలులో కుక్కేస్తారు.. 100 మంది పట్టాల్సిన చోట 200 మందిని కుక్కేసి.. రైట్ రైట్ అంటారు..

 
జపాన్‌లోని టోక్యో సబ్‌వే నెట్‌వర్క్. ఇక్కడ ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు వస్తుంది. రద్దీ బాగా ఉన్న సమయంలో 2-3 నిమిషాలకు ఒక రైలు వెళ్తుంది.. అయినప్పటికీ.. ఇదే పరిస్థితి. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే టైము.. వచ్చే టైములో ఇక నరకమే. రైళ్లు సరిపోని పరిస్థితి. ఇలాంటి సమయాల్లోనే వీరు రంగంలోకి దిగుతారు. ప్రయాణికులను బోగీల్లోకి తోస్తూ.. మనుషులు కదలడానికి కూడా వీల్లేనంతగా వాటిని నింపేస్తూ.. తలుపు గట్టిగా బిడాయించి.. రైట్‌రైట్ అంటారు. వీరిని పెట్టింది ఇలా టైటుగా నింపడం కోసమే. వీరిని ఎప్పుడు నియమించారో తెలియదు గానీ.. 1950ల నుంచీ ఉన్నారు.

తొలుత వీరిని షింజుకు స్టేషన్‌లో నియమించారు. అప్పట్లో వీరిని ‘ప్యాసింజర్ అరేంజ్‌మెంట్ స్టాఫ్’గా పిలిచేవారు. ఎక్కువ మంది విద్యార్థులు పార్ట్‌టైం జాబ్ కింద దీన్ని చేసేవారు. ప్రస్తుతం ఇందుకోసమే ప్రత్యేకంగా సిబ్బంది లేనప్పటికీ.. రద్దీ సమయాల్లో రైల్వే సిబ్బంది ఈ పాత్రను పోషిస్తుంటారు. రద్దీ సమయాల్లో ప్రయాణికుల అవస్థలు వర్ణణాతీతం.

దీనికితోడు   ముందు రైలు రష్‌గా వెళ్తే.. తర్వాతి రైలు ఖాళీగా ఉంటుంద నే భావనతో కొందరు వస్తున్న రైలును వదిలేసి.. తర్వాతి రైలు కోసం చూస్తుంటారు.  అదే సమయంలో మనలాగే మిగతావాళ్లు కూడా ఆలోచిస్తారన్న విషయం మరిచిపోతుంటారని.. ఈ పరిస్థితికి ఇది కూడా ఓ కారణమని.. సబ్‌వే స్టేషన్‌లో అటెండెంట్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి చెప్పారు.

Advertisement
Advertisement